కాఫీకప్పు కబుర్లు
ఆవిరి ఊపిరితో
ఉదయం పలకరించే
చిన్న కాఫీ కప్పు
మదిని తడుతుంది
నిద్రమత్తును
నెమ్మదిగా కరిగిస్తూ
ఆలోచనలకు
అక్షరాలా వేడిపుట్టిస్తుంది
తొలి గుటక
తొందరపెడితే
మలి గుటక
తృప్తినిస్తుంది
కప్పు అడుగున
మిగిలిన చేదులోనూ
జీవితానికి
తియ్యనిధైర్యం దాగుంటుంది
చక్కెర తీపి,
పాల మృదుత్వం
కాఫీ వగరు — మూడు కలిసి
జీవితరుచిలా మలుచుకుంటాయి
వర్షపు ఉదయమైనా
ఎండకాల సాయంత్రమైనా
సంగతేమైనా సందర్భమేదైనా
కాఫీకప్పు తోడుంటుంది
కాఫీకప్పు
అందించే శ్రీమతికైనా
ఇప్పించే మిత్రులకైనా
ధన్యవాదాలు చెప్పటం మరువకు
చిన్నదైనా కాఫీ కప్పు—
రోజు మొదలవటానికి
శుభాల సూచిని
ఉత్సాహ ప్రదాయిని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment