🌺 కవుల లోకం 🌺
కవుల మాటలు
మధువుల జల్లు – మదిని తడిపే పలుకులు,
మౌనాల లోతుల్లోంచి మార్మోగే మాణిక్యవీణా ధ్వనులు…
కవుల రాతలు
చీకట్ల చెరలను చీల్చే వెలుగుల వాక్యాలు,
నిశ్శబ్దాన్ని పలికించే నిజాల శబ్దాలు…
కవుల కలాలు
కాలానికి కన్నీళ్లు తుడిచే కరుణా కుంచెలు,
గాయాల మీద గంధం పూసే ప్రేమ హస్తాలు…
కవుల గళాలు
అణచివేతల మీద అగ్ని స్వరాలు,
అన్యాయంపై న్యాయపు అమర నినాదాలు…
కవుల చూపులు
చీకటిలోనూ వెలుగును చూసే దివ్యదృష్టులు,
మట్టిలోనూ మణిని కనుగొనే మౌనవిజ్ఞానాలు…
కవుల మదులు
కవితలతో కరిగే కరుణా హృదయాలు,
ప్రపంచ బాధల్ని బయట పెట్టు ప్రాణాలు…
కవుల కలలు
ప్రపంచాన్ని పూలతో నింపే పవిత్ర సాధనాలు,
ప్రేమకే రాజ్యాభిషేకం చేసే పావన సంకల్పాలు…
కవుల కాలము
కాలాన్నే నిలిపేసే అక్షరాల అమృతం,
తరతరాలకూ తరగని వెలుగు మార్గం…
కవుల గొప్పలు
పేరు కాదు – పుటలలో నిలిచే చరిత్ర సాక్ష్యం,
కాలం మారినా మసకబారని అక్షరాల అమరత్వం…!
కవుల లోకము
మదులను మురిపించే మరో ప్రపంచం,
కలమే కిరీటమై కవితలకే కనకసింహాసనం…!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment