తెలుగు యాత్రలు -వెలుగు జ్యోతులు

 

నాడు తెలుగు

తాటిచెట్ల నీడల్లో, తల్లుల ఒడుల్లో -

తాతల కథల్లో, పల్లె పొలాల్లో -

పలుకుల పరిమళం.


నేడు తెలుగు

డిజిటల్ తెరలపై డాలర్ల దేశాల్లో -

విమానాల రెక్కలపై సరిహద్దులు దాటిన -

స్వర్ణాక్షర సంచారం.


ఆంధ్రాలో అమ్మతనపు అక్షరాలు,

తెలంగాణాలో తేజోమయమైన తేటతనం,

తమిళనాడులో తేనెచుక్కల తెలుగు పలుకులు,

కర్నాటకలో కన్నడ గంధంతో కలిసిన కవితా సౌరభం.


ఒరిస్సాలో

ఉత్కలుల ఉల్లాల్లో ఊయలలూగే పదాలలాలిత్యం,

మహారాష్ట్రలో

మరాఠీ మన్నులో మేళవించిన మధురగానం.


అమెరికాలో

సిలికాన్ లోయలో సంస్కృతి సెమినార్లలో సంస్కారస్వరం,

ఆస్ట్రేలియాలో సముద్ర అలలతో కలిసి

సరసమైన సాహితీ సుగంధం.


ఇంగ్లాండులో

వర్షపు వీధుల్లో వర్ణాల వేదనాడి,

మలేషియాలో మలయ మల్లెలతో

మిళితమైన మాధుర్యం.


మారిషస్సులో

క్రిష్ణాగోదావరీ నదీతీరపు గుండె చప్పుడు,

కెనడాలో

మంచు మధ్య మదిని కరిగించే మాతృభాష మమకారం.


ఆరబ్బు దేశాల్లో

అభివృద్ధి చెందుతున్న ఆంధ్రుల మాతృభాషావాడకం

శ్రీలంకలో

సీతాదేవి అడుగుల జాడలో సంస్కృతీ సంచారం.


నాడు పల్లెటూరి పుట్టిల్లు,

నేడు విశ్వగ్రామపు వెలుగు, 

తెలుగు – ఒక భాష కాదు…

ఒక తల్లి గుండె చప్పుడు, ఒక జాతి ఆత్మగానం!


తెలుగు వేదికల్లో

తెలుగుభాషని పొగుడుదాం - తెలుగితల్లికి హారతులిద్దాం

తెలుగుజాతికి జైకొడదాం - తెలుగుఖ్యాతిని చాటుదాం

తెలుగువైభవాన్ని తెలుపుదాం - తెలుగువెలుగులు చల్లుదాం 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog