గళం - ప్రేరణా శంఖం


గళం

నాదం వినిపిస్తే

గాలికి కూడా

గర్వమేస్తుంది


గళం

గుండెను విప్పితే

గుసగుసల్ని కూడా

గానంచేస్తుంది


గళం

గర్జన మొదలెడితే

నిజానికి కూడా

బాసటవుతుంది


గళం

మృదు మధురమైతే

హృదులకు కూడా

మత్తేక్కిస్తుంది


గళం

నినాదమైతే

శ్రోతలకు కూడా

పనిపెడుతుంది


గళం

శ్రావ్యత కురిపిస్తే

పశువులను కూడా

పరవశపరుస్తుంది


గళం

శుభం పలికితే

తధాస్తుదేవుళ్ళు కూడా

దీవెనలందిస్తారు


గళం

పూనుకుంటే

నిశ్ఛబ్ధం కూడా

పటాపంచలవుతుంది


గళం

తేనెచుక్కలు చల్లితే

వీనులకు కూడా

విందుదొరుకుతుంది


గళం 

నదిలా పారితే

జీవననౌక కూడా

ముందుకు సాగుతుంది


గళం

ఎప్పుడూ గరళం కాకూడదు

వీచాలి హృదయ తరంగాలు

ఇవ్వాలి ఉల్లాలకు ఉత్సాహాలు


గళం

ఎన్నడూ శబ్దం మాత్రమేకాదు

చెయ్యాలి మౌనంపై పోరాటాలు

ఊదాలి ప్రేరణా శంఖారావాలు


---గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog