కలం విన్యాసాలు
కలం
పుటలను తడుపుతుంది,
కాంతులు చిమ్ముతుంది,
కన్నులను వెలిగిస్తుంది.
కలం
ఊహలకు రూపమిస్తుంది,
భావాలను వెల్లడిస్తుంది,
సాహిత్యసౌభాగ్యం సృష్టిస్తుంది.
కలం
పువ్వులను పూయిస్తుంది,
నవ్వులను కురిపిస్తుంది,
మనసులను మురిపిస్తుంది.
కలం
గుండెగుబులు పలుకుతుంది,
గాయాలకు మందుపెడుతుంది,
గమ్యస్థానాలకు నడిపిస్తుంది.
కలం
చిరుగాలిలా విస్తరిస్తుంది,
నదినీరులా ప్రవహిస్తుంది,
కడలిలా ఎగిసిపడుతుంది.
కలం
వానచినుకులు కురిపిస్తుంది,
నిప్పురవ్వలు చిందిస్తుంది,
హృదయధ్వనులు వినిపిస్తుంది.
కలం
గళన్ని ఎత్తిస్తుంది,
గీతాన్ని పాడిస్తుంది,
గతిని దారినిపెడుతుంది/
కలం
అమృతాన్ని చిలుకరిస్తుంది,
సుగంధాన్ని చల్లుతుంది,
వెన్నెలను కాయిస్తుంది.
కలం
శక్తిని నింపుతుంది,
యుక్తిని చూపుతుంది,
రక్తిని రగిలిస్తుంది.
కలం
చేతిని కదిలిస్తుంది,
మూతిని పలికిస్తుంది,
ప్రీతిని చాటుతుంది.
కలం
అక్షరవిన్యాసాలు చేయిస్తుంది,
పదప్రయోగాలు కనబరుస్తుంది,
సాహిత్యమును సంపన్నంచేస్తుంది.
కలం
కవిత్వమును ఉన్నతపథంలో నడిపిస్తుంది,
కవన రాజ్యాలను నిర్మింపజేస్తుంది,
కవులకు కిరీటధారణ చేయిస్తుంది.
--గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment