⚖️ నేతిబీరకాయల్లో నెయ్యా న్యాయస్థానాల్లో న్యాయం?
చేతిలో తులసి కాదు – తూకపు త్రాసు,
కళ్లకు గంతలు కాదు – పక్షపాతం లేని చూపు,
చేతిలో రాజ్యాంగ పుస్తకం – అన్యాయంపై న్యాయపు శాసనం…
ఆమే పుటలపై వెలిగే – న్యాయదేవత!
రాజసభలు మారాయి,
సింహాసనాలు మారాయి,
కాని మనుషుల కన్నీళ్ల రుచి మాత్రం
ఇంకా మారలేదు…
న్యాయస్థానాల మెట్లపై
వేదనతో నిలబడ్డవారి నీడలు,
ప్రతీ గుమ్మం ముందు
ప్రార్థనలై వరసలో నిలుస్తున్నాయి.
సత్యం చేతుల్లో పత్రాలై మారి,
నిజం నోటిలో వాదనలై మిగిలి,
న్యాయం మాత్రం
తేదీల తాళాల్లో చిక్కుకుపోతున్నది…
కాలం గడుస్తోంది,
వ్యాజ్యం నడుస్తోంది,
కానీ బాధితుడి జీవితమే
వాయిదాల బారిన పడుతోంది!
ఆలోచించు ఓ న్యాయదేవతా!
నీ త్రాసు తూగుతున్నదా
లేదా బాధితుల ఓపికను కొలుస్తున్నదా?
స్వార్ధపరువైపు మొగ్గు చూపుచున్నదా!
కళ్ళ గంతులు తొలగించి
ఒక్కసారి కన్నీళ్లను చూడవమ్మా…
న్యాయం ఆలస్యం అయితే
అది న్యాయం కాదని లోకమే చెబుతోంది కదా!
న్యాయస్థానాల గడపలు
ఆశల తలుపులుగా మారాలి,
తీర్పులు గాయాలపై మాన్పులుగా మారాలి,
అప్పుడే న్యాయదేవత చిరునవ్వు అభయహస్తం అవుతుంది!
అన్యాయం అణగదొక్కబడాలి
అక్రమాలు నిరోధించాలి
ఆవినీతిపరుల ఆటలుకట్టించాలి
అప్రతిష్టలకు అంతంపలకాలి
న్యాయం నేతిబీరకాయలో నేయికాకూడదు
కూరకాయల బేరం కాకూడదు
బలవంతుల ఆయుధం కాకూడదు
నోరున్నవాడిదే రాజ్యం కాకూడదు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment