🌾🙏హోరనాడు అమ్మా! శ్రీక్షేత్ర అన్నపూర్ణా!🙏🌾
సహ్యాద్రి శిఖరాల సన్నిధిలో
సిరుల సింహాసనమెక్కిన అమ్మా,
హోరనాడులో వెలసిన అన్నపూర్ణాదేవీ,
అక్షయపాత్రవీ, అన్నప్రదాతవీ నువ్వమ్మా!
అడవుల ఆకుపచ్చ అంచుల్లో
అమృతవర్షం కురిపించే దేవతవీ,
ఆకలి అనే బాధని దూరం చేసే
అన్నం పరబ్రహ్మమని చాటే తల్లివీ నువ్వమ్మా!
అక్షయపాత్రపై నీకరుణ ప్రసరిస్తే
కోట్లకొలది కడుపులు నిండేలా,
భక్తుల గుండెల్లో దీపంలా,
భవబంధాలు తొలగించే జననివీ నువ్వమ్మా!
నీ ఆలయ ఘంటా నాదంలో
నిద్రలేచే సహ్యాద్రి గిరులు -
నీ నామస్మరణతో మారుమ్రోగుతాయి,
నీ మహిమలతో భక్తులు మురిసిపోతారు అంబా!
కర్నాటక గగనంలో నీ కీర్తి -
కనకవర్షంలా కురుస్తుంటే,
హోరనాడు మట్టిలో మోక్షసుగంధం -
మధుర మధురంగా మేళవిస్తుంది జనయిత్రీ!
అమ్మా! నీ చల్లని దీవెనలతో -
ధనధాన్య సౌభాగ్యాలు వర్ధిల్లాలి,
ప్రతి ఇంట అన్నపుదీపాలు వెలగాలి,
పలు పసిడిపంటల పండుగలు జరగాలి జననీ!
నీ నామం పలికే ప్రతి హృదయం -
పరమానందాల పల్లకీ కావాలి,
హోరనాడు అన్నపూర్ణమ్మ తల్లీ,
భువిలో అన్నరాజ్యం ఏలవమ్మా!
మొదటి దర్శనంలో కాంతులు చిమ్మేవు,
రెండవ చూపులో కనులను కట్టేసేవు,
మూడవ వీక్షణంతో నిజస్వరూపం చూపేవు
నాల్గవ పరికింపుతో పరమభక్తుడిగా మార్చావు అమ్మా!
పశ్చిమ కనుముల్లో, పచ్చని పొలాల్లో,
ప్రతిష్ఠించబడిన ప్రాణప్రదాతా ప్రణామాలమ్మా,
అన్నార్తులను ఆదుకునే శక్తిని ఇవ్వమ్మా,
అనుగ్రహించి అన్నదానాలు చేయించవమ్మా!
అమ్మా!అన్నదీపం అన్నీ ఇళ్ళల్లో ఆగనీయకమ్మా,
ఆహారానికి ఎక్కడా కొరత రానీయకమ్మా,
అందరికీ ఆహారలోపం లేకుండా చూడమ్మా,
అవనినంతా అన్నపానాలతో ఆడుకోవమ్మా అన్నపూర్ణేశ్వరీ!
✍️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✍️
(నిన్న 10-01-26 శనివారం కర్నాటకలోని హోరనాడు శ్రీక్షేత్రం
అన్నపూర్ణాదేవిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాను. అమ్మవారు కళకళాలాడిపోతున్నారు. కళ్ళు తిప్పకుండా పలుమార్లు చూడాలనిపించింది. అన్నపూర్ణాదేవిని మరవలేకున్నాను. మారుమారు చూడాలనిపిస్తున్నది. పదేపదే గుర్తుకొస్తున్నది. ఆ స్పందనకి ప్రతిరూపమే నేటి ఈ కవిత.)

Comments
Post a Comment