🌸 మాతా! శృంగేరి శారదాంబా! 🌸
తుంగానదీ తీరాన -
తులసీ పరిమళాల తుళ్ళులతో,
తపస్సుల నిశ్శబ్దంలో,
తలపులు పారించే అక్షరజ్యోతివి నువ్వమ్మా!
అడుగుల్లో వాక్యాలు మొలకింపజేస్తూ,
చూపుల్లో వెలుగులు విరజిమ్ముతూ,
చిరునవ్వుల్లో స్వరాలు వినిపిస్తూ,
అక్షరాలు చల్లుతున్న సాహితీమూర్తివి నువ్వమ్మా!
కంఠంలో ఓంకారపు ఊయలనూపుతూ,
చేతుల్తో ఙ్ఞానదీపాలు వెలిగిస్తూ,
పాదాలవద్ద అఙ్ఞానంధకారాన్ని తరుముతూ,
అక్షరలోకాన్ని పాలిస్తున్న సామ్రాజ్ఞివి నువ్వమ్మా!
పదాలను పుష్పాలుగా చేసి,
పాఠకుల హృదయాల్లో -
ప్రకాశం పూయించే -
శాశ్వత కవిత్వశక్తివి నువ్వమ్మా!
మా ఆలోచనలకు దారివి,
మా భావాలకు వెలుగువి,
మా అక్షరాలకు ఆశీర్వాదానివి —
మా శాశ్వత శరణ్యానివి నువ్వమ్మా!
ఒక్కో పంక్తి ఒక్కో పూజ,
ఒక్కో పదం ఒక్క్కో దీపం,
ఒక్కో కవిత్వం ఒక్కో ఆలయం,
ఒక్కో పాఠకుడు ఒక్కో భక్తుడు అమ్మా శారదా!
ఆలోచనలే నా దీపాలు,
భావాలే నా ధూపాలు,
పదాలేనా పుష్పాలు,
కవిత్వమే నా ఆరాధన మాతా శారదా!
కరుణానుగ్రహాలు ప్రసరించవమ్మా,
అక్షరజల్లులు కురిపించవమ్మా,
కవనామృతము త్రాగించవమ్మా,
సాహ్తీసౌరభాలు చల్లించవమ్మా తల్లీ శారదా!
✍️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✍️
(మొన్న 10-01-26 శనివారం నాడు కుటుంబ సమేతంగా శృంగేరి శారదాదేవి మాతను రెండవ పర్యాయము దర్శించుకున్నాను. అమ్మను కనులారా చూశాను. ఆమే ఆశీర్వాదం, అనుగ్రహం పొందాను. నన్ను ప్రోత్సహిస్తూ, నాలో ఆవహించి నిత్యమూ కవితలు వ్రాయిస్తున్న శారదామాతకు పాదాభివందనలు తెలియపరిచాను. ఎప్పటిలాగా, ప్రాణం ఉన్నతవరకూ, కవితలు వ్రాసే శక్తిని కొనసాగించమని వేడుకున్నాను.)

Comments
Post a Comment