🌾 తెలుగోళ్ళ సంక్రాంతి సంబరాలు 🌾
(సంక్రాంతి లక్ష్మికి స్వాగతం)
తెలుగోళ్ళ సంక్రాంతి సంబరాల జాతరరా,
మన మట్టి మనసు మెరిసే మహోత్సవమురా,
ఆత్మీయుల అనుబంధాల అమృతధారరా,
ఇల్లు ఇల్లూ ఇంద్రధనుస్సులేరా!
గొబ్బెమ్మల నవ్వుల్లో గుమ్మాల వెలుగులు,
ముగ్గుల సొగసుల్లో ముత్యాల పరిమళాలు,
పసుపు కుంకుమల పుణ్య తిలకాలు.
మన సంస్కృతికి శుభ శకునాల రాగాలు.
మూడురోజుల పండగ మన సంక్రాంతి పుణ్యం,
భోగి తొలి వెలుగు – బాధల దహనం,
మకర సంక్రాంతి సూర్యుని సన్నిధానం,
కనుమ కర్షకులు పశువుల పూజించే పర్వదినం.
కోడిపందేల కేరింతల కోలాహలం,
గాలిపటాల రెక్కల్లో గగన విహారం,
బొమ్మల కొలువుల్లో భక్తి విరిసే వనం,
లక్ష్మీదేవి పూజల్లో లక్ష్య సౌభాగ్యం.
అరిసెల వాసన అంగనమంతా నిండు,
పొంగలి ఆవిరి ప్రాణాలకు పండుగ కమ్ము,
చక్కెర పొంగలి చిరునవ్వులు చిందు,
అమ్మ చేతి రుచి అమృతమై అలరు.
హరిదాసుల పాటలు హృదయాన్ని తాకు,
గంగిరెద్దుల గంటలు గోపురాలు మోగు,
పల్లె వీధులన్నీ పరవశంతో పులకించిపోవు,
మన మట్టి సంస్కృతి మణిహారమై వెలుగు.
చుట్టాల రాకతో చెలిమి చిందు,
స్నేహాల నవ్వుల్లో సంతోషం పొంగు,
పెద్దల ఆశీస్సులు పెనుగాలిలా వీచు,
కొత్త ఆశల పంట పొలమంతా పండు.
భూమాత వక్షంలో బంగారు ధాన్యం,
రైతన్న చెమటే మన సౌభాగ్యం,
పంటల పండుగే మన ప్రాణం,
సంక్రాంతి అంటేనే సంస్కృతి గర్వం.
ఎక్కడున్నా - తెలుగోడీగా గర్విద్దాం,.
ఏలనైనా - సంస్కృతిని కాపాడుదాం.
పిల్లలకు - సంక్రాంతి పాఠాలుచెబుదాం,
జగతికి - మనజాతి సంస్కారంతెలుపుదాం.
సంకురాత్రి పండుగను స్వాగతిద్దాం,
సంక్రాంతి లక్ష్మిని ఆరాధించుదాం,
సంబరాల్ని ఘనంగా జరుపుకుందాం,
సమయాన్ని సంతోషంగా గడుపుదాం.
✍️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✍️
Comments
Post a Comment