🌾🌞 మకర సంక్రాంతి – ఉత్తరాయణ సూర్యప్రణతి 🌞🌾


సూర్యుడు మకరరాశి మెట్టెక్కిన మంగళవేళ —

భూమి బంగారు చిరునవ్వులు చిందించే వేళ,

చెరకు మధురతలతో, పంటల పరిమళాలతో

సంక్రాంతి సంబరాలు స్వర్గమవుతున వేళ!


సూర్యుడు ఉదయిస్తాడు — సృష్టికి శ్వాస పోస్తాడు,

ఉత్తరాయణ పథంలో ధర్మాన్ని నడిపిస్తాడు,

కిరణాల వర్షంతో కల్మషాలు కడిగేస్తాడు,

అజ్ఞాన తిమిరాన్ని అగ్నిగా కాల్చేస్తాడు.


సూర్యుడు నిద్రలేపుతాడు — లోకాన్ని లేపుతాడు,

నిశ్చలతను నశింపజేసి చైతన్యం చల్లుతాడు,

కాలానికి కదలిక నాదమై లోకగీతమవుతాడు,

ధర్మపు దీపమై భూమికి దారి చూపుతాడు.


సూర్యుడు పంటల పోషకి — రైతుకు రక్షకుడు,

అన్నానికి ఆదికారకి — ఆకలి నివారకుడు,

పసిడి పొలాల పరవశంతో పండుగ పులకరింపజేసే

ప్రాణదాత — పరమపూజ్యుడు!


సూర్యుడు ఆయుర్వర్ధనం — ఆరోగ్య సారథి,

రోగాలకు ప్రతిఘాతం — జీవనభారతి,

ఉష్ణ సౌఖ్యమై చలికాలాన్ని చెరిపేసే

జీవనజ్యోతి — జగత్తుకు ఖ్యాతి!


సూర్యుడు ఉదయనామం — ఆశలకు అక్షరదీపం,

అస్తమయ గానం -  శాంతికి సందేశం,

సత్యానికి స్వర్ణభూషణం — సాక్షిభూతం,

బ్రహ్మాండ భాస్కరం — భూమికి భగవంతుని దర్శనం!


సూర్యుడు ప్రత్యక్షదైవం — కాలయంత్రం,

సూర్యుడు విశ్వకేంద్రం — సర్వలోకమంత్రం,

ఈ ఉత్తరాయణ పుణ్యవేళ —

తం సూర్యం ప్రణమామ్యహం!


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్. భాగ్యనగరం ✍️


Comments

Popular posts from this blog