తెలుగు తియ్యందనాలు
పలికితే
తేనెచుక్కలు చిందించాలి -
ఆలకించేవాళ్ళను
ఆనందసాగరంలో ఓలలాడించాలి.
పాడితే
తియ్యగా ఉండాలి -
శ్రోతలహృదులను
ఆనందాశ్చర్యాలలో ముంచెయ్యాలి.
పఠిస్తే
మధురంగా ఉండాలి -
కాయమును
కమ్మదనాలతో కుతూహలపరచాలి.
సేవిస్తే
కవనసుధలు చెరకురసంలా ఉండాలి -
తనువులకు
తృప్తినిచ్చి తన్మయత్వపరచాలి.
వింటే
మాటలు మాధుర్యం పంచాలి -
మదులను
మురిపించి మత్తెక్కించేలాగుండాలి.
పేరిస్తే
పదాలు చక్కెరపాకం పట్టినట్లుండాలి -
సాహితీ తియ్యదనాలను
చక్కగా తయారుచేసి అందించేలాగుండాలి.
విందునిస్తే
తొలుత సుకవితలతో నోర్లను తీపిచేయాలి -
ఆరగించేవార్లకు
ఆస్వాదించేలా తగిన ఏర్పాట్లుచెయ్యాలి.
రాస్తే
రమ్యంగా రసవత్తరంగా రాయాలి -
చదువరులను
సురసం క్రోలించి సంతసపరచాలి.
అజంత తెలుగుభాషను
తీపికి మారుపేరుగా నిలపాలి -
దేశంలోనే
అగ్రగామి స్థానముకు తీసుకెళ్ళాలి.
ఆంధ్ర అక్షరములును
గుండ్రని ముత్యాలని చాటాలి -
అవనిలోనే
అత్యున్నత హిమాలయశిఖరాలకు చేర్చాలి.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment