🌾 తెలుగోళ్ళారా! 🌾
తెలుగు రాష్ట్రాల తగాదాలు
చిన్ననాటి రెండుపిల్లుల కధను,
మధ్యవర్తి కోతి పంచాయితీని,
కళ్ళ ముందుకు తెస్తుంది.
గోదావరి నీళ్లు ఎవరివి అని గొడవ,
కృష్ణమ్మ నీళ్లపై రోజూ రగడ,
నీళ్లే జీవం అని తెలిసినా
నీళ్లకోసం అన్నదమ్ములు తగువులాడుతున్నారు.
ప్రాంతభేదాలు రెచ్చగొట్టి,
కులద్వేషాలు రగిలించి,
వైరిపక్షాల విమర్శించి,
ప్రజల సానుభూతికోసం సిగపట్లుకుదిగుతున్నారు.
రాష్ట్ర ద్వేషాలు
మాది ఈ రాష్ట్రం … మీది ఆ రాష్ట్రం,
అని గోడలు కడుతున్నారు మనుషుల మధ్య,
ఒకరికొకరు శత్రువులై మాటలయుద్ధం చేస్తున్నారు.
ప్రతిపక్షాల ఆరోపణలు
వాళ్లు దోచారు… వీళ్లు దాచారు,
అని నిందల జల్లులు కురిపిస్తున్నారు,
ప్రజాసమస్యలు వదిలి వాగ్వాదాలకే వేదికలు కడుతున్నారు.
ఖజానా ఖాళీ అంటున్నారు,
ఋణాల బరువు పెరుగుతుందంటున్నారు,
సంక్షేమ కార్యాలను వాయిదావేస్తున్నారు,
ఇరురాష్ట్రాలు సామాన్యులను ఇబ్బందిపాలుచేస్తున్నారు.
రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి,
పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి,
హామీలు ఏమాత్రం నెరవేరకున్నాయి,
దొందు దొందై నిజమైన మార్పు తీసుకురాకున్నారు.
ఒక రాష్ట్రం కష్టమని తెలిసికూడా,
పోలవరమని అమరావతని బాకాలు ఊదుతుంది -
మరో రాష్ట్రం అసాధ్యమని ఎరిగికూడా
మూసీప్రక్షాలనని భవిష్యత్తునగరమని ఊదరగొడుతుంది.
తెలుగు బిడ్డల్లారా!
తెలుగుతల్లిని ఎన్నడూ ఏడిపించకండి,
అభివృద్ధికి ఎక్కడా అడ్డుపడకండి,
కలసికదలి ఇచ్చిపుచ్చుకొని ముందుకు నడవండి.
చెప్పండి తెలుగోళ్ళారా!
నిందలు కాదు - నిర్మాణాలు కావాలని,
ద్వేషాలు కాదు - సోదరప్రేమలు ఉండాలని,
తగవులు కాదు - తోడ్పాటులు అందించాలని.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment