అదిగో...కొంకణీ వనదేవత


పచ్చని పచ్చికపై పాదాలు ముద్రిస్తూ,

పర్వతాల మడిలో పరిమళాలు చల్లుకుంటూ,

అడవుల అద్దాల్లో తన అందం చూసుకుంటూ,

ఆమె చల్లని గాలితో జడలు ఆడించుకుంటూ నడుస్తోంది.


పచ్చని చెట్లు –

ఆ తల్లి పచ్చని చీర అంచులై,

భూమికి శాంతి చల్లే పచ్చదనపు ప్రార్థనలై,

అందానికి ప్రతీకలై నిలుస్తున్నాయి.


ఎత్తైన చెట్లు –

ఆ దేవత తలపాగా మల్లెల్లా,

ఆకాశాన్ని తాకే ఆశల కొండలై,

వానల్ని ఆహ్వానించే వరదాతలై ఊగుతున్నాయి.


కొబ్బరి చెట్లు –

ఆ వనదేవత కంకణాల్లా మ్రోగుతూ,

తీరాలకు తీయని తల్లి పాల్లా, 

నీటి అమృతాన్ని పంచే దేవదూతలవుతున్నాయి.


పోక చెట్లు –

ఆ దేవి నుదుటి బొట్టు పరిమళాలై,

పల్లెలకు పచ్చని పండుగల్ని తెచ్చే పుష్పాభిషేకాలై,

తలలు ఊపుతూ ఆకాశాన్ని పరికిస్తున్నాయి.


రబ్బరు చెట్లు –

ఆ అమ్మ చేతిరేఖలలో ప్రవహించే పాలరసపు ప్రవాహాలై,

శ్రమికుల కలలకు జీవం పోసే శ్వేతధారలై,

గొడ్డళ్ళ గాయాలకు కన్నీరు చిందుతున్నాయి.


గుబురు చెట్లు –

ఆ అరణ్యదేవత ఒడిలోని గూళ్లై,

పక్షులకు పాటలు పంచే వేదికలై,

చీకటికి కాంతి కిరీటాలై విరాజిల్లుతున్నాయి.


ఇలా… కొంకణీ వనదేవత

చెట్టు చెట్టుకూ చైతన్యం నింపుతూ,

ఆకు ఆకు మీద ఆశలు రాస్తూ,

పచ్చదనమే ప్రార్థనగా భూమికే భూషణమై నిలుస్తోంది…


--గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


(మొన్న సాయంత్రం మంగళూరు జిల్లా ఉత్తర ప్రాంతంలో ఒక ఎత్తైన చెట్టు క్రింద నడుస్తున్న ఒక అందమైన యువతి బులుగు చీరలో కనిపించింది. ఆమె ఎవరో ఎందుకు వచ్చారో అనుకుంటుండగా ముందుకు అడుగులేస్తూ అంతర్ధానమయ్యింది. ఆమె అందచందాలకు నా స్పందనే ఈ కవిత.) 


Comments

Popular posts from this blog