ఆనందాష్టకం
చిన్నారులు వచ్చీరాని మాటలతో
ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే
మాతృమూర్తులు వాత్సల్యంతో
మిక్కిలి ఉత్సాహంతో పొంగిపొర్లిపోతారు.
పున్నమి వెన్నెలరోజుల్లో
చందమామ రావే అంటే
జాబిల్లి సంతసించి వెన్నెల చల్లుతుంటే
ఉల్లాలు ఉప్పొంగి ఊయలలూగుతాయి.
బుడిబుడి అడుగులతో
బుజ్జాయిలు నడుస్తుంటే
పుడమితల్లి పుత్రప్రేమతో
పాదస్పర్శకు పులకరించిపోతుంది.
తనచెంతకు తీరానికి వస్తే
రెండడుగులువేసి పలకరించితే
చుట్టాలు వచ్చినట్లు తలచి
చిన్నపిల్లలా అరుస్తూ సాగరం గంతులేస్తుంది.
వసంతమాసం వచ్చిందని సూచిస్తూ
కోకిలలు మామిడిచెట్టెక్కి ప్రభాతవేళల్లో
కమ్మగా కుహూకుహూరాగాలు తీస్తుంటే
శ్రోతలు చెవులునిక్కరించి పదేపదే వింటారు.
నీలాకాశంలో మబ్బులు తేలుతుంటే
చిటపటా చినుకులురాలుతుంటే
చిన్నారులు తడుస్తూ చిందులేస్తుంటే
పెద్దలు సహితం పరవశపడతారు.
మల్లెమొగ్గలు విచ్చుకుంటుంటే
మత్తును వెదజల్లుతుంటే
మదులను దోచుకుంటుంటే
మనుజులు మహాదానందంలో మునిగిపోతారు.
కవిగారి అక్షరాలు
వెలుగులు చిమ్ముతుంటే
సౌరభాలు చల్లుతుంటే
పాఠకుల హృదయాలు మురిసిపోతాయి.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
(ఈ కవితను చదివిన ప్రతి పాఠకుడి హృదయంలో నవ్వు ఒక మల్లెమొగ్గలా విరవాలని, మనసు ఒక పున్నమి వెన్నెలలా వెలగాలని ఆశిస్తున్నాను)
Comments
Post a Comment