లేవరా తెలుగోడా!


లేవరా తెలుగోడా — 

లేపరా తెలుగోళ్ళా, 

చిమ్మరా తేనెచుక్కలూ - 

చల్లరా సుమగంధాలూ!


తల్లిమాటే తారకమంత్రంరా — 

తల్లిభాషే జీవనయంత్రంరా,

తెలుగుతల్లి పిలుపే శ్వాసగా — 

తెలుగుజాతిని మేల్కొలుపురా!


లేవరా… లేచిరా — తెలుగు వెలుగులు విరజిమ్మరా,

లేవరా… లేచిరా — తల్లిభాషకు తిలకం దిద్దరా!


అమ్మ ఒడిలో అక్షరదీపం,

తాత ఎదలో ఙ్ఞాన సంగీతం,

పల్లె గాలిలో పూల పరిమళం,

తెలుగు మాటలే రవితేజం!


నీ పలుకులు పతాకాలై,

నీ అక్షరాలు ఆయుధాలై,

జాతి నుదుట దివ్యజ్యోతై,

నడవరా నీవే మార్గదర్శివై!


లేవరా… లేచిరా — తెలుగు వెలుగులు విరజిమ్మరా,

లేవరా… లేచిరా — తల్లిభాషను విశ్వవ్యాప్తం చేయ్యరా!


పుస్తకాలే మన సైన్యం,

సంస్కృతే మన పరాక్రమం,

సాహిత్యమే మన సింహాసనం,

సంస్కృతే మన స్వరాజ్యం!


నెత్తినరుద్దిన భాషలకు భయపడకురా,

పరదేశభాషా పొంగులకు కలవరపడకురా,

నీ గళమే జాతికి ప్రకాశంరా,

నీ గానమే గెలుపుకు ఆధారంరా!


లేవరా… లేచిరా — తెలుగు వెలుగులు విరజిమ్మరా,

లేవరా… లేచిరా — తెలుగుజాతి గర్వం చాటరా!


రారా తెలుగోడా — 

తల్లి మాటను తలల నింపరా,

యువత నుదుట తిలకం దిద్దరా, 

భాష భవితకు ముద్ర వేయరా!


గోదావరీ తీరానా -

తెలుగును  గలగలా పారించరా,

కృష్ణానదీ పక్కలా -  

తెలుగు సాహితిని వర్ధిల్లజేయరా! 


లేవరా… లేచిరా - తెలుగు వెలుగులు విరజిమ్మరా,

లేవరా… లేచిరా - తెలుగు గళమును వినిపించరా!


తెలుగుమాట తీపని చూపరా,

తెలుగుబాట వెలుగని చాటరా,

తెలుగురాత సొగసని నుడువరా,

తెలుగునాట గర్వంగా తిరుగరా!


తెలుగుజాతి వైభవం చెప్పరా,

తెలుగుజ్యోతి వెలిగించరా,

తెలుగుఖ్యాతి లెస్సని పలకరా,

తెలుగునీతి మేటిగా మలచరా!


లేవరా… లేచిరా — తెలుగు వెలుగులు విరజిమ్మరా,

లేవరా… లేచిరా — తెలుగు చరితను తెలుపుమురా!


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog