ఇల్ల భాగవతం
ఇల్లు స్వర్గమైతే — అమ్మ చిరునవ్వులే దేవతలై,
నాన్న ఆశీర్వాదాలే పుష్పాలై,
పిల్లల నవ్వులే నిత్యనాదాలై,
ప్రతి ఉదయం పరమపదపు ముంగిటి అవుతుంది.
ఇల్లు నరకమైతే — మాటలే ముళ్లై గుచ్చుకుంటాయి,
మౌనమే మంటలై కాల్చేస్తుంది,
చూపులే కత్తులై గాయపరుస్తాయి,
ప్రతిరాత్రిని అంధకూపంగా ముంచేస్తాయి.
ఇల్లు అరణ్యమైతే — ఒంటరితనమే అడవిపులిగా తిరుగుతుంది,
ఆలోచనలే అరణ్యవల్లులై చుట్టేస్తాయి,
భయమే చెట్లనీడలో దాక్కుంటుంది,
మనసు మునిగా మారి శాంతికోసం సంచరిస్తుంది.
ఇల్లు సాగరమైతే — భావాలే అలలై ఎగసిపడతాయి,
జ్ఞాపకాలే ముత్యాలై లోతుల్లో మెరుస్తాయి,
ప్రేమే నౌకగా నడిపిస్తుంది,
జీవితం తీరాన్ని సురక్షితంగా చేరుతుంది.
ఇల్లు ఆకాశమైతే — కలలే పక్షులై విహరిస్తాయి,
ఆశలే నక్షత్రాలై మెరిసిపోతాయి,
మేఘాలే గుంపులుగా తేలుతాయి,
విశ్వాసమే చంద్రుడై రాత్రికీ దారిచూపుతుంది.
ఇల్లు నిప్పైతే — అహంకారమే చిటపటలాడుతుంది,
అసూయే పొగలా కమ్ముకుంటుంది,
కోపమే జ్వాలగా లేస్తుంది,
బంధాలనే భస్మం చేస్తుంది.
ఇల్లు ప్రేమమయమైతే — మాటలే మల్లెపూలవుతాయి,
మౌనమే మంత్రస్వరమవుతుంది,
అందాలు అవతరిస్తాయి, ఆనందాలు వెల్లివిరుస్తాయి,
చిన్నచిన్న క్షమాపణలే జీవితానికి మహాప్రసాదమవుతాయి.
ఇల్లు దేవాలయమైతే — అమ్మే ప్రధానార్చకురాలు,
నాన్నే ధర్మస్థాపకుడు,
పిల్లల నవ్వులే మంగళహారతులు,
ప్రతి గదీ పుణ్యక్షేత్రమై మనుషులనే దేవుళ్ళుగా తీర్చిదిద్దుతుంది.
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ – భాగ్యనగరం

Comments
Post a Comment