👑 అక్షరప్రతిభకు పట్టాభిషేకం 👑
అచ్చట.. అక్షరాల అంబరంలో
అనురాగపు దీపాలు వెలిగాయి —
అవిరళంగా అలలై ఎగసిన ఆశలపై
ప్రతిభ సింహాసనం ఎక్కింది.
అక్కడ..మౌనంలో మోగిన మంత్రాలు
మనసు మెడలో మాలలై మారి,
అంకురించిన ఆలోచనలకు
అభిషేక జలాలయ్యాయి.
ఆచోట..కలల కాంతులు కిరీటమై
కలముకే కిరీటం పెట్టి,
సాధన శ్వాసలే
స్వరలతలై వేదమయ్యాయి.
అచట..వేదన వడపోసిన వేళల్లో
విజయానికి జన్మనిచ్చిన
నిదాన నడకే
నిరంతర నృత్యమైంది.
అట..నవ్వుల పుష్పవృష్టిలో
నమ్మకపు నినాదాలు నిండగా —
“ప్రతిభ” అనే రాజుకు
పట్టాభిషేకం జరిగింది!
అది ఒక్కరి కీర్తి కాదు —
అది పలువురి ప్రయత్నాల విజయం,
ప్రతి కలయికలో వెలిసే
కాంతుల కిరణాల సంబరం!
కవీశ్వరా! గుర్తించుకో -
సన్మానం కాకూడదు ధ్యేయం,
సత్కారం తేకూడదు గర్వం,
పురస్కారం అవకూడదు అనర్ధకం.
పురస్కారగ్రహీతా! తెలుసుకో -
బాధ్యత పెరిగిందనే నిజం,
భారం పైనబడిందనే సత్యం,
భవిష్యత్తును చేసుకోవాలని బంగారుమయం.
అక్షరయోధా! ఎప్పుడూ
స్వంతడబ్బా కొట్టుకోకు,
కొండెక్కి కూర్చోకు,
కొమ్ములోచ్చాయని అనుకోకు.
సరస్వతీపుత్రా! ఎక్కడా
సంకలు గుద్దుకోకు,
సంబరాలు చేసుకోకు,
సపర్యలు చేయించుకోకు.
✍️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✍️
Comments
Post a Comment