🌹గులాబీల గుబాళింపులు🌹 


గులాబీ మొగ్గ 

రెక్కలు విప్పుకుంటుంది,

గులాబీ బాల 

సిగ్గులసువాసన చల్లుతుంది.  


గులాబీ కన్య 

గుబులు రేపుతుంది,

గులాబీ ముల్లు 

గుండెలో గీతలు గీస్తుంది.  


గులాబీ పువ్వు 

చిన్నగా తెంచుకోమంటుంది,

చెలి కొప్పులో 

చక్కగా తురుమమంటుంది.


గులాబీ రెమ్మలు 

తలపై చల్లమంటున్నాయి,

గులాబీ అత్తరు 

బట్టలపై చిమ్మమంటుంది.


పచ్చని కొమ్మల మడిలో

పరిమళాల పల్లకీ ఎక్కి,

పున్నమి వెన్నెలను ఒడిసి పట్టుకుని

ప్రేమకు చిరునామా పలుకుతుంది – గులాబీ.


ముల్లుల గుండెల్లో దాచిన

మృదుత్వపు ముత్యపు మల్లె,

మౌనంలోనూ మాటలాడే

మనసుల భాష ఆవుతుంది – గులాబీ.


ఎర్రని పూతల్లో

ఆత్మాభిమానపు అగ్ని కీలం,

తెల్లని రేకుల్లో

పవిత్రత పూసిన పుష్పం - గులాబీ.


పసుపు రంగులో 

కళ్ళకు కనువిందు, 

రోజా వర్ణంలో 

అండానికి ప్రతిబింబము - గులాబీ. 

 

ఒక్క పువ్వే అయినా

లక్ష భావాలకు పట్టం,

ఒక్క చిరునవ్వే అయినా

వేల మోములకు ప్రకాశం - గులాబీ. 


చేతిలో పట్టుకుంటే

చేతులు కాదు – హృదయాలే తాకుతాయి,

చూపులో పడితే

చూపులు కాదు – కలలే కరిగిపోతాయి.


అందుకే

గులాబీ అంటే

కాదు కుసుమం…

ప్రేమకు పరిమళించిన జీవనగీతం. 


✍️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✍️ 


Comments

Popular posts from this blog