🌺 కవితాశిల్పాలు 🌺


అక్షర శిల్పాలు —

ఆలోచనల ఆకాశంలో చెక్కబడిన శిలలు,

పద చిత్రాలు —

భావాల పల్లకీలో విహరించే చిత్తరువులు.


రమణీయ దృశ్యాలు —

కవిత కన్నుల్లో మెరిసే కాంతి కిరణాలు,

కమ్మని రూపాలు —

మనసు మైమరిపించే మాధుర్య మాధవాలు.


రంగుల బొమ్మలు —

స్వప్నాల సంతలో వేలాడే వెలుగుల వర్ణాలు,

సుందర ఆకారాలు —

సృష్టి సౌందర్యానికి సాక్ష్యాలైన సౌమ్యరేఖలు.


ప్రతి బింబాలు —

ప్రకృతీ ముఖంలో ప్రతిఫలించే ప్రేమఛాయలు,

మట్టి ప్రతిమలు —

జన్మభూమి గుండెల్లో మలచుకున్న జీవమూర్తులు.


దేవతా విగ్రహాలు —

అక్షరాల ఆలయంలో అర్చనకై ఆవిష్కరించబడతాయి,

సాహితీ మూర్తులు

కాలానికి కళాత్మక గుర్తులై చరిత్రకు ఎక్కుతారు. 


కవితలు కేవలం పదాలే కాదు —

అవి మదులను దోచే కల్పనాకృతులు,

భావితరాలకు నిర్మించిన

అమరమైన సౌందర్య సాలభంజికలు. 


✍️గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం✍️


(శిల్పాలు- చిత్రాలు, దృశ్యాలు, రూపాలు, బొమ్మలు, ఆకారాలు, ప్రతిబింబాలు, ప్రతిమలు, విగ్రహాలు, మూర్తులు, ఆకృతులు, సాలభంజికలు, శిలలు, చిత్తరువులు) 


Comments

Popular posts from this blog