అక్షరాల ఆవిర్భావం…
కవితలు రాద్దామనుకున్నా —
కాగితం ఎదురు చూసింది,
కలం చేతివ్రేళ్లలోకి దూరింది,
మనసు మాటలను కుమ్మరించింది।
కవితలు వినిపిద్దామనుకున్నా —
గుండె గర్భంలో గుసగుసలు మోగాయి,
గొంతు తలుపులు తెరుచుకున్నాయి,
నిశ్శబ్దమే నాదమై శ్రావ్యతను చిందించింది।
తేటపలుకుల తేనెచుక్కలు చల్లుదామనుకున్నా —
పదాలు పరిమళాలై పూచాయి,
పలుకులు పూలవానై కురిశాయి,
పంక్తులు మాధుర్యమై ముందుకొచ్చాయి।
కవనాలను ప్రచార మాధ్యమాలకు పంపుదామనుకున్నా —
ఆలోచనలు రెక్కలు తొడుక్కొన్నాయి,
అక్షరాలు ఆకాశానికి ఎగిరాయి,
లోకాన్నంతా పలకరించి పులకరింపజేశాయి।
కమ్మగా పాడుదామనుకున్నా —
రాగాలు చిరుజల్లులై జారాయి,
భావాలు గానస్వరాలై మారాయి,
మనసులను మత్తెక్కించాయి।
పాఠక హృదయాలను తట్టాలనుకున్నా —
అక్షరం ఒక్కటే చాలు అనిపించింది,
ఆత్మను తాకే పలుకు,
అమృతంలా జారిపడింది।
కవితలు అనేవి —
కలం రాసిన గీతలు కావు,
మనసుల్ని ముట్టే మాధుర్యాలు,
లోకాన్ని ఓలలాడించే గాంధర్వ గానాలు॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment