అతని యానం
అతడు రెక్కలు కట్టుకున్న కలలతో
రయ్యిరయ్యినా రేగిపోతూ—
అవధులన్నీ అడ్డుగోడలై నిలిచినా
ఆకాశాన్నే తన అడుగుజాడగా మలుచుకుంటూ॥
అతడు కోయిల కంఠం అలవోకగా ఆవహించుకొని
కలతల్ని కరిగిస్తూ పాడుతూ—
బంధనాలు విరిచేస్తూ
స్వరాన్నే స్వరాజ్యంగా మార్మోగిస్తూ॥
అతడు మబ్బుల మోముపై
మృదువైన స్పర్శగా తేలుతూ—
బరువైన బాధల్ని వదిలేస్తూ
తేలికైన తత్వంగా మారిపోతూ॥
అతడు జాబిలి ఒడిలోకి చేరి
జీవితాన్ని జ్యోత్స్నగా నింపుకుంటూ—
చీకట్ల చరిత్రను చెరిపేస్తూ
వెలుగే తన వసంతమని పలుకుతూ॥
అతడు వెన్నెల వీధుల్లో విహరిస్తూ
విన్నుకే వెన్నుదన్నుగా నిలుస్తూ—
నిశీధి నిశ్శబ్దాన్ని చెదరగొట్టుతూ
నిజాల్ని నూతన పుటలకెక్కిస్తూ॥
అతడు నక్షత్రాల్ని ఏరుకుంటూ
నవ్వుల్ని నిండుగా చల్లుతూ—
అనంతాకాశంలో ఆశల అక్షరాలు చల్లుతూ
అమృత క్షణాలను ఆవిష్కరిస్తూ॥
అతడు కవితల గర్భంలో
కాలాన్ని కరిగిస్తూ కూరుస్తూ—
స్వేచ్ఛే తన శ్వాసగా మిగిల్చుకొంటూ
సృష్టినే తన సొంతంగా చేసుకుంటూ॥
—
స్వేచ్ఛకోసం అతని ప్రయాణం…
ఒక కల కాదు, కలల కలబోత కాదు—
అది అతని జీవితం …
అది అతని మనసు మోక్షం!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment