ఎలా రాయను? 


కొత్తగా రాయమంటావా —

కొంగొత్త భావాలకు కొమ్మలు తొడిగేలా,

కనీవినీ ఎరుగని కల్పనలకు రెక్కలిచ్చేలా,

కాలానికే కొత్త దారులు చూపేలా రాయమంటావా॥


కమ్మగా రాయమంటావా —

కలకండ తీపిలా పదాలు జాలువారేలా,

కన్నులలో చిరునవ్వులు చిందేలా,

కర్ణామృతమై హృదయాలను హత్తుకునేలా రాయమంటావా॥


ఖుషీపరచేలాగా రాయమంటావా —

కష్టాల మబ్బులను చెదరగొట్టేలా,

కిలకిల నవ్వుల జల్లులు కురిపించేలా,

కలతలన్నీ కరిగిపోయేలా రాయమంటావా ॥


కళాత్మకంగా రాయమంటావా —

కుంచెలేని చిత్రాల్ని పదాలతో గీయేలా,

కన్నుల ముందే దృశ్యాలను నిలబెట్టేలా,

కళకళలాడే కవితా గోపురాలు కట్టేలా రాయమంటావా॥


కవితాత్మకంగా రాయమంటావా —

కల్పవృక్షమై భావాలను పూయించేలా,

కావ్యగంగలా రసధారలు పారించేలా,

కవిమనసుకు కిరీటమై నిలిచేలా రాయమంటావా॥


కదిలించేలా రాయమంటావా —

కఠిన హృదయాల్లో కరుణ మొలకెత్తేలా,

కన్నీటి బిందువులు కర్తవ్యమై మారేలా,

కాలాన్నే ప్రశ్నించే కలం కదలేలా రాయమంటావా॥


కరిగించేలా రాయమంటావా —

కఠోర మనసులు వెన్నలా మెత్తబడేలా,

కసిని క్షమగా మార్చే మంత్రంలా,

కౌగిలింతై మనుషులను కలిపేలా రాయమంటావా॥


కాలక్షేపానికి రాయమంటావా —

క్షణిక వినోదాన్ని కలిగించేలా,

కాలంతో పాటు కనుమరుగయ్యేలా,

కాగితాలకే పరిమితమయ్యేలా రాయమంటావా॥


కీర్తికోసం రాయమంటావా —

కరతాళధ్వనులు మారుమోగేలా,

కీర్తి కిరీటాలు తలకు తొడిగేలా,

కలకాలం పేరు నిలిచేలా రాయమంటావా॥


రాసేదా — తెలుగు తల్లి తలపాగా మరింత వెలిగేలా,

తరతరాలకు తాత్విక బాటలు చూపేలా,

మనిషిని మనిషిగా మలిచేలా,

మానవత్వమే మహాకావ్యమై నిలిచేలా రాసేదా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog