రుచులు కావాలి…


రుచులు కావాలి…

నాలుకకు రుచికావాలి —

తీపి, కారం, చేదు, పులుపుల మధ్య

జీవితాన్ని రుచిచూసే ధైర్యం కావాలి.


పంటికి రుచికావాలి —

కాలాన్ని కొరికినమిలే శక్తి కావాలి,

కష్టాన్ని చూర్ణంచేసి

అనుభవంగా మింగే సహనం కావాలి.


పెదవికి రుచి కావాలి —

నవ్వుల్లో తేనె చిందించాలి,

మౌనాల్లోనూ

మాటల పరిమళం వెదజల్లాలి.


నోటికి రుచి కావాలి —

అబద్ధాల చేదు వదిలేసి

సత్యాల తీపే పలకాలి,

విషపు మాటలకు తాళంవేసి 

అమృత వాక్యాలే విడదీయాలి.


గొంతుకు రుచి కావాలి —

అణచివేతను తట్టుకునే గరళం కావాలి,

న్యాయానికి నినదించే

నవ కాంతి స్వరం కావాలి.


కడుపుకు రుచి కావాలి —

అన్నంతో పాటు ఆత్మసంతృప్తి కావాలి,

అతి వినియోగం కాదు

అపూర్ణతకు విరామం కావాలి.


మనసుకు రుచి కావాలి —

ప్రేమ తీపి కావాలి,

విరహపు చేదు తెలిసినా

కరుణ పులుపే మిగలాలి.


అన్నానికి రుచి కావాలి —

చెమట చుక్కల ఉప్పు కలిసిన

శ్రమ పరిమళం కావాలి,

పంచుకునే చేతుల్లోనే ఆహారం పండాలి.


నీటికి రుచికావాలి —

దాహాన్ని తీర్చడమే కాదు,

జీవాన్ని నిలిపే

జలజీవన  తత్వం కావాలి.


అక్షరాలకు రుచికావాలి —

శబ్దాల అలంకారం కాదు,

భావాల గాఢత కావాలి,

మౌనాన్నీ పలికించే 

లోతైన సారం కావాలి.


కవితలకు రుచికావాలి —

చదివితే తృప్తి కాదు, 

చదివాక మార్పు కావాలి,

హృదయాన్ని తాకినిలిచే 

అనిర్వచనీయ రుచి కావాలి…


జీవితానికి

రుచి కావాలి,

మనసుకు

శుచి కావాలి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog