వన్నెల వైభవం


నీలి ఆకాశం నవ్వితే —

మనసుల్లో నీలిమ నింపుతుంది,

అపారమైన ఆ విశాలతలో

ఆశల పక్షులను ఎగరేస్తుంది.


సప్తవర్ణాల హరివిల్లు మెరిస్తే —

ప్రకృతి కుంచె రంగులు చిందిస్తుంది,

వానబిందువుల వీణపై

రంగుల రాగాలు ఆలపిస్తాయి.


పచ్చని చెట్లు పలికితే —

పృథ్వి ఒడిలో జీవం మొలుస్తుంది,

చిగురుల చప్పుళ్లలో

ప్రకృతి నవ్వులు వినిపిస్తాయి.


రంగుల పూలు విరిసితే —

సువాసనల సందేశాలు పంచుతాయి,

మౌనంగా వికసిస్తూ

మనసులకు మధురానుభూతులు అందిస్తాయి.


తెల్లని వెన్నెల పరచుకుంటే —

రాత్రి ముద్దుగా మెరిసిపోతుంది,

చంద్రకాంతి చీర కప్పుకొని

ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోతుంది.


బులుగు సముద్రం ఉప్పొంగితే —

అలల ఆటలలో సంగీతం పుడుతుంది,

అపారమైన ఆ గర్భంలో

అనేక రహస్యాలు దాచుకుంటుంది.


సింధూరపు బొట్టు మెరిసితే —

భారత నారి గౌరవం వెలుగుతుంది,

ఒక చిన్న ఎర్రబిందువులోనే

సంస్కృతి సౌందర్యం నిలుస్తుంది.


మువ్వన్నెల జండా ఎగిరితే —

భారత హృదయం గర్వంగా కొట్టుకుంటుంది,

కేసరి, తెలుపు, పచ్చ రంగుల్లో

జాతి ఆత్మ గాథ మెరిసిపోతుంది.


రంగుల ఈ లోకంలో —

ప్రకృతి చిత్రమే జీవితం,

ప్రతి రంగులో ఒక భావం,

ప్రతి క్షణంలో ఒక సౌందర్యం.


రండి — రంగుల్లో మునుగుదాం,

వర్ణాల్లో తేలుదాం;

చాయలలో సంచరిద్దాం,

వన్నెలలో వెలుగుదాం.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog