Posts

Showing posts from July, 2026
Image
 బాటలు పట్టాలని (గజల్) హృదయం చెబుతుంది మంచిబాట పట్టాలని, పాదాలు సూచిస్తున్నాయి పూలబాట పట్టాలని॥ కన్నులు వెదుకుతున్నాయి వెలుగుబాట కోసమని, కిరణాలు ఆదేశిస్తున్నాయి జ్ఞానబాట పట్టాలని॥ చేతులు రెండు ముందుకు వస్తున్నాయి సేవచేయమని, చిరునవ్వులు ఆహ్వానిస్తున్నాయి స్నేహబాట పట్టాలని॥ పెదవులు ప్రేరేపిస్తున్నాయి సత్యాన్నే పలకాలని, పలుకులు ప్రబోధిస్తున్నాయి నీతిబాట పట్టాలని॥ తల్లిదండ్రులు బోధిస్తున్నారు సూటిబాట వదలవద్దని, అనుభవాలు నేర్పిస్తున్నాయి ధర్మబాట పట్టాలని॥ గురువులు నిర్దేశిస్తున్నారు సన్మార్గంలో నడవాలని, గ్రంథాలు చెబుతున్నాయి విజ్ఞానబాట పట్టాలని॥ బంధాలు కలుపుతున్నాయి మనుషులను దగ్గరగా, మమతలు మొండికేస్తున్నాయి ఆత్మీయబాట పట్టాలని॥ ప్రకృతి పలుకుతోంది పచ్చదనము పెంచమని, చెట్లు కోరుతున్నాయి పర్యావరణబాట పట్టాలని॥ అక్షరాలు అడుగుతున్నాయి ఆలోచనలు పంచమని, భావాలు బ్రతిమాలుతున్నాయి కవితబాట పట్టాలని॥ తెలుగుతల్లి పిలుస్తుంది తియ్యగా మాట్లాడమని, తెలుగు గుండె పురికొల్పుతోంది తెలుగుబాట పట్టాలని॥ రాజు కలం కురిపిస్తుంది నవరసాల జల్లులు, సాహితీలోకం అభ్యర్థిస్తుంది అక్షరబాట పట్టాలని॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్...
Image
 అడుగుతాను (గజల్) నీ జాడలు తెలిసేమో మేఘాలను అడుగుతాను, నీ వార్తలు వినెనేమో తారకలను అడుగుతాను॥ వెన్నెలంత వెలుగునిచ్చే నీ రూపమెక్కడుందో, నీ గురించిన సంగతికై కిరణాలను అడుగుతాను॥ అంతులేని నీలిమలో కనిపించక దాగినపుడు, నీ దారిని చూపునేమో గాలులను అడుగుతాను॥ నీ స్పర్శను దాచుకున్న జ్ఞాపకాల జాడలకై, మౌనంగా నిలిచియున్న వృక్షాలను అడుగుతాను॥ నీ నవ్వుల సుగంధాలు ఇంకెక్కడ విరిసాయో, మధురంగా వికసించిన పుష్పాలను అడుగుతాను॥ నీ పలుకుల ప్రతిధ్వనులు వినిపించు వేళలో, కొమ్మలపై కూయుచున్న కోయిలలను అడుగుతాను॥ నీ అడుగుల సవ్వడేదో అలలలో వినిపించగా, తీరాలను తాకివచ్చే కెరటాలను అడుగుతాను॥ అన్నిచోట్ల ఉన్నావని ఆత్మసాక్షి చెబుతున్నా, నిజమేదో చూపమంటూ బాటలను అడుగుతాను॥ కాలమెంత గడిచినా నీ ఆచూకి దొరకకున్న  చిట్టచివర చేతులెత్తి దేవతలను అడుగుతాను॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 బాగున్నది (గజల్) సద్గురువులు బోధించే ఉపదేశం బాగున్నది, మంచిదారి చూపించే సందేశం బాగున్నది॥ అవకాశం విస్తరించ కలల జగము విరియంగా, రెక్కలిప్పి ఎగిరించే ఆకాశం బాగున్నది॥ వాసంతం రాగానే పరిమళాలు పొంగంగా, పూనవ్వులు పంచే ఈ మధుమాసం బాగున్నది॥ ఆ ప్రాంతం ప్రశాంతమై సిరిసంపద నింపంగా, మానవతను చాటుతున్న ఆ దేశం బాగున్నది॥ ఆ రూపం సాత్వికమై సౌమ్యతలను చాటంగా, చూపరులను ఆకట్టుకునే ఆ వేషం బాగున్నది॥ జ్ఞానదివ్వె వెలగంగా చీకటులను తరమంగా, బాటలన్ని వెలిగించే ప్రకాశం బాగున్నది॥ మనసు మనసు కలిసేలా అనురాగం పెరగంగా, బంధములను నిలబెట్టే విశ్వాసం బాగున్నది॥ సత్యబోధ సారమంత హృదయముల నిండంగా, జీవితములు వెలిగించే సందేశం బాగున్నది॥ రాజేంద్రుని భావాలలో రాగవాన కురియంగా, కవన విరులు పూయించే ఉద్దేశం బాగున్నది॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 దేనికి? (గజల్) నవ్వులు చిందని మోములు దేనికి మనసులు గెలవని మాటలు దేనికి॥ పువ్వులు పూయని కొమ్మలు దేనికి పరిమళమీయని సుమాలు దేనికి॥ చినుకులు కురవని మేఘాలు దేనికి పైరులు పండని పొలాలు దేనికి॥ సేవలు చేయని చేతులు దేనికి సంతసమీయని మిత్రులు దేనికి॥ వెలుగులు చిందని దివ్వెలు దేనికి దారులు చూపని కన్నులు దేనికి॥ కరుణను పంచని మనుజులు దేనికి కడుపును నింపని విందులు దేనికి॥ అక్కరకురాని చుట్టము దేనికి ఆదరణ ఇవ్వని ఆప్తు లు దేనికి॥ అర్థము ఇవ్వని పలుకులు దేనికి ఆచరణ లేని సూక్తులు దేనికి॥ రాజేంద్ర! ప్రేమ రహితులు దేనికి మేలును చేయని బ్రతుకులు దేనికి॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 పాడుతాను (గజల్) తకిట తకిట తకిటంటూ తియ్యంగా పాడుతాను ధనాధనా దరువేస్తూ చక్కంగా పాడుతాను మనసులోని భావాలను మెల్లగాను బయటపెడుతు విన్నవారు మురిసేలా సవ్యంగా పాడుతాను తేటతేట పదములతో తేనెబొట్లు చిందిస్తూ గళమునెత్తి కోకిలలా కమ్మంగా పాడుతాను లెమ్ము లెమ్ము లెమ్మంటూ వెన్నుతట్టి నిద్రలేపి ఝుమ్ముఝుమ్ము ఝుమ్మంటూ రమ్యంగా పాడుతాను  జోజోజో జోయంటూ జవరంగా గళమునెత్తి ఇంపుసొంపు లొలికిస్తూ సౌమ్యంగా పాడుతాను ఉగ్గుపాలు తాగిస్తూ ఊపులూపి పసివారిని  ఊయలలో పండబెట్టి హృద్యంగా పాడుతాను జాబిల్లిని చూపిస్తూ చల్లదనము అనుభవిస్తు చిన్నారులను మురిపిస్తూ శ్రావ్యంగా పాడుతాను తెలుగుతల్లి మహత్యాన్ని తిన్నగాను తెలియజేయ అక్షరాలకు హారతిచ్చి అందంగా పాడుతాను "రాజేంద్ర" రాగాన్నై రసగంగను పారిస్తూ గుండెలలో నిలిచిపోయె గీతంగా పాడుతాను గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 కారు మబ్బులు కారు మబ్బులు కమ్ముతుంటే, కడలి గర్భం నుంచి కదిలివస్తుంటే, నింగి నిండా నీలి చీరలు కప్పుకొని నవ్వుల జల్లులు జారవిడుస్తుంటే॥ కారు మబ్బులు కురుస్తుంటే, కాసుల వానలా కురిపిస్తుంటే, ఎండిన నేల ఎదురు చూసిన దాహానికి అమృతధారలు అందిస్తుంటే॥ కారు మబ్బులు కదులుతుంటే, కొండలపై నుంచి పరుగెడుతుంటే, గాలికి చేయిచ్చి గంతులేస్తూ గగనవీధుల్లో విహరిస్తుంటే॥ కారు మబ్బులు కాలువలను పారిస్తుంటే, కారు మబ్బులు కాలువలు పారేలా చేస్తుంటే, కుంటలు చెరువులు నింపేస్తుంటే, గలగలలాడే జలరాగాలతో పల్లెలతో పచ్చని పాట పాడిస్తుంటే॥ కారు మబ్బులు కలవరపరుస్తుంటే, మెరుపు తీగలు మిలమిలలాడిస్తుంటే, ఉరుముల డప్పులు మోగిస్తూ ఉలిక్కిపడే వేళలు తెస్తుంటే॥ కారు మబ్బులు కర్షకులను ఆకట్టుకుంటుంటే, కనుల నిండా ఆశలు నాటుతుంటే, నాగలి చాళ్లలో నవజీవనాన్ని నవ్వుతూ చిగురింపజేస్తుంటే॥ కారు మబ్బులు కరువును పారదోలుతుంటే, కన్నీటి గాథలు తుడిచేస్తుంటే, బీడువారిన భూమి ఒడిలో బంగారు పంటలు పండిస్తుంటే॥ కారు మబ్బులు కడలిని కవ్విస్తుంటే, కెరటాల నృత్యాలు చేయిస్తుంటే, అలల హారతులతో ఆకాశానికి ఆనంద సందేశం పంపిస్తుంటే॥ కారు మబ్బులు కరుణగా మారితే, కలలన్నీ ని...
Image
 కవన విజయం కవనం ఒక కల కాదు, కాలంతో చేసే సంభాషణం, భావాలకు రూపమిచ్చే భారతీదేవి ప్రసాదం॥ మనసులో మెరిసిన మెరుపును మాటలలో బంధించడమే, అంతరంగంలో పొంగిన అలలను అక్షరాలుగా మలచడమే॥ కవనమంటే కేవలం పదాలు కాదు, కన్నీటి చుక్కల కథలు, నవ్వుల వెన్నెల జల్లులు, జీవిత గమనపు గీతలు॥ కవనమంటే సత్యాన్వేషణ, సమాజానికి స్ఫూర్తిదానం, చీకట్లలో దీపమై వెలిగి చైతన్యానికి మార్గదర్శనం॥ పూల సుగంధం గాలిలో విరియగా, కవితా పరిమళం మనసుల్లో విరియాలి, నదులు సాగరాన్ని చేరినట్లు కవనం జనమనసులను చేరాలి॥ కవన విజయం అంటే పురస్కారాల పర్వం కాదు, పాఠకుని పెదవిపై చిరునవ్వు, స్పందనలను రేకెత్తించడమే॥ ఒక మంచి కవిత పుడితే వెయ్యి మనసులు పులకరిస్తాయి, ఒక మంచి భావం పలికితే లక్షల మనసులు మేల్కొంటాయి॥ అక్షరమే ఆయుధమై, భావమే బలమై, మానవతే లక్ష్యమై కవనం ముందుకు సాగాలి॥ అప్పుడు ప్రతి కవి కల సాకారమై, ప్రతి కవితా మణిహారమై, ప్రతి పాఠకుడు పులకించగా, సాధించినదే నిజమైన కవన విజయం॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 భావజల్లులు చుక్కల్లో చంద్రుడు  తిరుగుతున్నాడు, మనసుల్లో మాధుర్యాలు నింపుతున్నాడు॥ తోటల్లో పువ్వులు పూస్తున్నాయి, గాల్లో పరిమళాలు విరజిమ్ముతున్నాయి॥ ఆకాశంలో మబ్బులు తేలుతున్నాయి, చిటపటా చినుకులు రాలుస్తున్నాయి॥ కడలిలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి, కనులకు ఆనందాలు చేకూరుస్తున్నాయి॥ తలల్లో ఆలోచనలు పుడుతున్నాయి, పుటలపై భావాలు కొలువుతీరుతున్నాయి॥ పత్రికల్లో కవితలు ప్రచురితమవుతున్నాయి, పాఠకులకు పరవశాలు పంచిపెడుతున్నాయి॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 చూస్తున్నా... మోముల్లో నవ్వులు చూస్తున్నా, నవ్వుల్లో వెలుగులు చూస్తున్నా, వెలుగుల్లో రంగులు చూస్తున్నా, రంగుల్లో హరివిల్లు చూస్తున్నా॥ పలుకుల్లో ప్రేమను చూస్తున్నా, ప్రేమల్లో అందాలు చూస్తున్నా, అందాల్లో ఆనందం చూస్తున్నా, ఆనందాల్లో లోకం చూస్తున్నా॥ లోకంలో మనుషులను చూస్తున్నా, మనుషుల్లో జీవితాలు చూస్తున్నా, జీవితాల్లో ఆశలు చూస్తున్నా, ఆశల్లో భవితను చూస్తున్నా॥ కన్నుల్లో కలలు చూస్తున్నా, కలల్లో కొత్త మార్గాలు చూస్తున్నా, మార్గాల్లో గమ్యాలు చూస్తున్నా, గమ్యాల్లో విజయాలు చూస్తున్నా॥ చేతుల్లో చెలిమిని చూస్తున్నా, చెలిమిలో మమతలు చూస్తున్నా, మమతల్లో కరుణను చూస్తున్నా, కరుణలో దైవాన్ని చూస్తున్నా॥ ప్రకృతిలో పరిమళం చూస్తున్నా, పరిమళంలో ప్రశాంతి చూస్తున్నా, ప్రశాంతిలో పరమసుఖం చూస్తున్నా, సుఖాల్లో జీవనార్థం చూస్తున్నా॥ అక్షరాల్లో అమృతం చూస్తున్నా, కవిత్వంలో అనుభూతి చూస్తున్నా, భావాల్లో మాధుర్యం చూస్తున్నా, మాధుర్యంలో మానవత్వం చూస్తున్నా॥ సృష్టిలో సౌందర్యం చూస్తున్నా, సౌందర్యంలో సత్యం చూస్తున్నా, సత్యంలో శివాన్ని చూస్తున్నా, శివంలో సుందర జగాన్ని చూస్తున్నా॥ ప్రతి రూపంలో ఒక భావాన్ని చూస్తున్నా, ...
Image
 తెలుగోడీని  తెలుగుతల్లి పుత్రుడిని తెలుగుతల్లి ఋణం తీర్చుకుంటాను, తెలుగుదనపు వెలుగులు పంచుతాను॥ తెలుగునేల వాసిని తెలుగుఘనత చాటుతాను, తెలుగుమట్టి పరిమళం వెదజల్లుతాను॥ తెలుగు భాషాభిమానిని తెలుగు భాషను కాపాడుతాను, తెలుగు తేజాన్ని పెంపొందిస్తాను॥ తెలుగు జాతీయుడిని  తెలుగు జాతి ఐక్యత కోరుతాను, తెలుగు ఖ్యాతిని దిక్కులన్నిటా చాటుతాను॥ తెలుగు రైతుని చెమట చుక్కలు చిందిస్తాను, బంగారు పంటలు పండిస్తాను॥ తెలుగు పంటని ఆకలి బాధలు తీర్చుతాను, ఆనందాలవిందు అందిస్తాను॥ తెలుగు గళముని తేనెచుక్కలు చిందుతాను, తీయని పలుకులు పలుకుతాను॥ తెలుగు కలముని  తెలివిని చాటుతాను, తరతరాలకు వెలుగులు పంచుతాను॥ తెలుగు కిరణాన్ని జ్ఞానజ్యోతులు వెలిగిస్తాను, చీకట్లను పారద్రోలుతాను॥ తెలుగు సౌరభాన్ని సుగంధాలు వెదజల్లుతాను, సంస్కృతి వైభవం చాటుతాను॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 అక్షర విన్యాసాలు అక్షరజల్లులు కురిపిస్తా, ఆనందధారలు పారిస్తా, అక్షరగంగను ప్రవహింపజేస్తా, అమృతస్నానం చేయిస్తా॥ అక్షరవిత్తనాలు నాటుతా, ఆలోచనలమొక్కలు మొలిపిస్తా, అక్షరతోటను పెంచుతా, అందాలలోకము చూపిస్తా॥ అక్షరపువ్వులు పూయిస్తా, అనురాగపరిమళాలు చల్లిస్తా, అక్షరమకరందం పంచుతా, అంతరంగాలను అలరిస్తా॥ అక్షరదీపాలు వెలిగిస్తా, అజ్ఞానచీకట్లు తొలగిస్తా, అక్షరజ్యోతులు ప్రసరింపజేస్తా, అభ్యుదయమార్గం కనబరుస్తా॥ అక్షరామృతము త్రాగిస్తా, ఆనందసాగరంలో ముంచేస్తా, అక్షరరాగాలు ఆలపిస్తా, అలసిన మనసులు మురిపిస్తా॥ అక్షరకిరణాలు విరజిమ్ముతా, ఆశల రెక్కలు తొడిగిస్తా, అక్షరాకాశంలోకి తీసుకెళ్తా, అనంతవిశ్వాలు వీక్షింపజేస్తా॥ అక్షరమే నా ఆభరణం, అక్షరమే నా అభ్యుదయం, అక్షరమే నా ఆరాధనం, అక్షరసౌరభమే నా జీవనం॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 వంకర విన్యాసాలు (వంకరటింకరలు)  వంకర బుద్ధులు పెరుగుతున్నాయి, విలువల వేర్లు తెగిపోతున్నాయి, వివేక దీప్తులు మసకబారుతున్నాయి, వంచన మేఘాలు కమ్ముతున్నాయి॥ వంకర నడతలు నడుస్తున్నాయి, నీతిని నెట్టివేస్తున్నాయి, నిజం నడిచే బాటను వదలి నీచ మార్గాలు వెదుకుతున్నాయి॥ వంకర మాటలు వినబడుతున్నాయి, విషపు జల్లులు కురిపిస్తున్నాయి, తేనె పూసిన పెదవుల వెనుక తీరని తుఫాన్లు దాచుతున్నాయి॥ వంకర మార్గాలు విస్తరిస్తున్నాయి, మనసుల దిక్కులు మార్చుతున్నాయి, అడ్డదారుల ఆకర్షణతో ఆత్మగౌరవం అమ్ముతున్నాయి॥ వంకర చూపులు చూస్తున్నాయి, లోపాలనే లెక్కిస్తున్నాయి, పర్వతమంత మంచితనాన్ని వదిలి పొరపాటునే పెద్దదిగా చేస్తున్నాయి॥ వంకర చేష్టలు సాగుతున్నాయి, వింత నాటకాలు ఆడుతున్నాయి, ఒకటి చెప్పి మరొకటి చేసి ఊసరవెల్లులై తిరుగుతున్నాయి॥ వంకర రాబడులు వస్తున్నాయి, వంచన గూడులు కడుతున్నాయి, చెమట చుక్కల విలువను మరిచి చీకటి దారులు ఎంచుకుంటున్నాయి॥ వంకర రాతలు రాస్తున్నాయి, వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి, అక్షరాలకు అలంకారాలు అద్ది అసత్యాలకు అభిషేకం చేస్తున్నాయి॥ వంకర మనుషులు పెరుగుతున్నారు, మమతల మూలాలు నరికేస్తున్నారు, మనిషిలోని మానవత్వాన...
Image
 కవితానుభూతులు కవిత్వాన్ని తినాలా...? తీయని పండువలె ఆస్వాదించాలా, మనసుకు మధురానుభూతి నింపే మకరందఫలమై మురిపించాలా॥ కవిత్వాన్ని త్రాగాలా...? గంగాజలమై గుండెలో పారే భావసుధగా గ్రోలుతూ  బ్రతుకును బలంగా మలచాలా॥ కవిత్వాన్ని చవిచూడాలా...? తేనెలో ముంచిన తియ్యని పలుకులా, భావాల మకరందం నాలుకపై చిందించగా, ప్రతి అక్షరాన్ని అమృతమయం చేయాలా॥ కవిత్వాన్ని ఆఘ్రాణించాలా...? విచ్చుకున్న పూల పరిమళంలా, వాక్యాల సౌరభాలను పీలుస్తూ, వెలుగుల వైపు నడిపించాలా॥ కవిత్వాన్ని పూయించాలా...? మొగ్గలో దాగిన మాధుర్యంలా, మనసులోని భావాలను వికసింపజేస్తూ, అక్షరకుసుమాలతో జగతిని అలంకరించాలా॥ కవిత్వాన్ని శోధించాలా...? సాగరగర్భంలోని ముత్యంలా, భావలోకపు లోతులను అన్వేషిస్తూ, సత్యసౌందర్యాలను వెలికితీయాలా॥ కవిత్వాన్ని అనుభవించాలా...? కన్నీటిలోని కరుణగా, నవ్వులోని నవరసంగా, ప్రతి స్పందనలో ప్రతిధ్వనింపజేయాలా॥ కవిత్వాన్ని అనుసరించాలా...? సత్యానికి సారథిగా, మానవతకు మార్గదర్శిగా, మంచితనానికి మకుటమై వెలగాలా॥ కవిత్వాన్ని ప్రోత్సహించాలా...? కొత్త కలాలకు రెక్కలిచ్చి, నూతన స్వరాలకు వేదికగా నిలిచి, అక్షరాలకు అభయమివ్వాలా॥ కవిత్వాన్ని గుండెలో ...
Image
 మిత్రులను కలుసుకుంటున్నా... మిత్రులను కలుసుకుంటున్నా, మురిపాల ముచ్చట్లు చెబుతున్నా, మనసుకు మనసును కలుపుకుంటూ మమతల వంతెన వేస్తున్నా॥ మిత్రులను కలుసుకుంటున్నా... కష్టాలను మరచిపోతున్నా, కన్నీటి జాడలు చెరిపేస్తున్నా, స్నేహపు చల్లని నీడలో కూర్చొని సేదతీరిపోతున్నా॥ మిత్రులను కలుసుకుంటున్నా... కుషీ చేసుకుంటున్నా... కేరింతలు కొడుతున్నా, చిరునవ్వుల పూలు పూయిస్తున్నా, చిన్ననాటి జ్ఞాపకాల వీధుల్లో చిలిపిగా తిరుగుతున్నా॥ మిత్రులను కలుసుకుంటున్నా... కాలక్షేపం చేస్తున్నా...  కబుర్లను చేబతున్నా, కాలానికి రంగులు అద్దుతున్నా, క్షణాలను ముత్యాలుగా మార్చుకొని గుండెలో దాచుకుంటున్నా॥ మిత్రులను కలుసుకుంటున్నా... కోతలు కోస్తున్నా...  చమత్కారాలు విసురుతున్నా, సరదాల వర్షం కురిపిస్తున్నా, నవ్వుల నావలో ప్రయాణిస్తూ నింగిని తాకుతున్నా॥ మిత్రులను కలుసుకుంటున్నా... ఆస్వాదిస్తున్నా... కమ్మదనాలు ఆస్వాదిస్తున్నా, కాఫీ కప్పుల కబుర్లలో, టీ తాగిన తీపికన్నా స్నేహమే తియ్యనిదంటున్నా॥ మిత్రులను కలుసుకుంటున్నా... చదువుతున్నా... కవితలను చదువుతున్నా, భావాల లోకంలో విహరిస్తున్నా, అక్షరాల పరిమళాలను పీలుస్తూ ఆనందసాగరంలో...
Image
 పూల ప్రస్థానం పూలు... పుట్టుకొస్తున్నాయి, విచ్చుకుంటున్నాయి, పిలుస్తున్నాయి, ప్రేమను పంచుతున్నాయి, పరిమళిస్తున్నాయి, పొంకాలు చూపిస్తున్నాయి, పరవశపరుస్తున్నాయి॥ పూలు... వేకువ వెలుగులను వెన్నెలలుగా మార్చుతున్నాయి, గాలుల రెక్కలపై గంధ సందేశాలు పంపిస్తున్నాయి, ప్రకృతికి రంగుల పండుగను ప్రతిరోజూ జరిపిస్తున్నాయి॥ పూలు... తేనెటీగలను ఆకర్షిస్తున్నాయి, సీతాకోకచిలుకలను అలరిస్తున్నాయి, కొమ్మలపై నవ్వుల జల్లులు కురిపిస్తున్నాయి, తోటలలో రంగవల్లులు అల్లుతున్నాయి,  భూమాతకు అందాల హారాలు అర్పిస్తున్నాయి॥ పూలు... పడతుల కొప్పులకెక్కుతున్నాయి, పెళ్లిపందిరులను శోభాయమానం చేస్తున్నాయి, దేవుళ్ల పాదపద్మాలను చేరుతున్నాయి, దైవార్చనలకు దండలవుతున్నాయి, భక్తి భావాలకు ప్రతీకలవుతున్నాయి॥ పూలు... కవుల్లో కవితా ప్రవాహాలు పారిస్తున్నాయి, కలాల్లో రంగులు నింపుతున్నాయి, కవిత్వంలో పదాలై వికసిస్తున్నాయి, గేయాల్లో రాగాలై ప్రవహిస్తున్నాయి, హృదయాల్లో భావసుమాలై నిలుస్తున్నాయి॥ పూలు... ప్రేమికుల సందేశాలవుతున్నాయి, స్నేహితుల సంతోషాలవుతున్నాయి, తల్లుల అనురాగాలవుతున్నాయి, పిల్లల చిరునవ్వులవుతున్నాయి, మానవత్వానికి మధుర చిహ్నాల...
Image
 కవిత్వ వైవిధ్యానికి, సాహిత్య సౌరభాలకు వేదికగా నిలిచిన కాలిఫోర్నియా వీక్షణం 167వ అంతర్జాల సాహితీ సమావేశం ******** నేడు 18 జూలై 2026 తేదీన శనివారం కాలిఫోర్నియాకు చెందిన వీక్షణం సాహితీ గవాక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన 167వ అంతర్జాల సాహితీ సమావేశం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంటూ విజయవంతంగా జరిగింది. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా॥ కె. గీతామాధవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రేమికులు పాల్గొన్నారు. అతిధులకు, సాహితీ ప్రియులను స్వాగతం పలికి సమావేశాన్ని గీతా మాధవి సభను ప్రారంభించారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఇద్దరి అతిధుల చిరు పరిచయంచేసి పరిచయ ప్రసంగాలను చేయవలసినదిగా ఇద్దరు అతిధులను ఆహ్వానించారు. ఈరోజు రెండు విభిన్నమైన జీవన నేపథ్యాలనుండి  వచ్చిన కవుల ప్రసంగం అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉంది. డా. కందిపి రాణి ప్రసాద్ జీవన నేపథ్యం వడ్డించిన విస్తరి. వారి తల్లిదండ్రులు, పూర్వీకులు సాహిత్యానికీ సేవ చేసిన వారు. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న శ్రీ రావూరి భరద్వాజ, విశ్వనాథ వారితో వారి కుటుంబానికి బాగా పరిచయం. రాణి భర్త డాక్టర్ , ఈమె దాని అడ్మిన్ కావడం చేత చిన్నపిల్...
Image
 చెప్పండి...  మీరంతా ఎందుకో... కవిసమ్మేళనాల్లో పాల్గొంటుంది, కవితలను పఠిస్తుంది, కవిత్వం కోసం పాటుపడుతుంది, కలల సాకారంకోసం ప్రయత్నిస్తుంది॥ మీరంతా ఎందుకో... పదాలు కూర్చుతుంది, పంక్తులు పేర్చుతుంది, ప్రాసలు వాడుతుంది, ప్రశంసలు అందుకుంటుంది॥ మీరంతా ఎందుకో... భావాలు పండిస్తుంది, భావుకులను అలరిస్తుంది, అక్షరాలను ఆరాధిస్తుంది, అభినందనలు పొందుతుంది॥ మీరంతా ఎందుకో...  కవితలు చదువుతుంది, చదివిస్తుంది, చింతిస్తుంది, చైతన్యాన్ని పంచుతుంది॥ మీరంతా ఎందుకో... వినమ్రంగా వింటుంది, వినిపిస్తుంది, విమర్శలను స్వీకరిస్తుంది, విజయాలను సాధిస్తుంది॥ మీరంతా ఎందుకో... కమ్మని కలలు కంటుంది, కల్పనలు చేస్తుంది, కవితలను సృష్టిస్తుంది, కళామాతను కొలుస్తుంది॥ మీరంతా ఎందుకో... రమ్యంగా రాస్తుంది, రంజింపజేస్తుంది, రసహృదయాలను తాకుతుంది, రచయితగా రాణిస్తుంది॥ మీరంతా ఎందుకో... నైపుణ్యం నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది, నవభావాలను నింపుతుంది, నలుదిశలా పేరు తెచ్చుకుంటుంది॥ మీకంతా... కవిత్వం కాంక్షా, అక్షరాలు అలంకారాలా; పదాలు ప్రియ నేస్తాలా, సాహిత్యము సరస్వతీదేవి వరమా॥ అందుకేనా మీరు... పదాలు కూర్చేది హృదయాలను కలపడాని...
Image
 తెలియటంలా... తెలియటంలా... ఎవరిని అనుసరించాలో ఎవరికి దూరమై నిలవాలో, వెలుగును చూపే చేతిని పట్టాలో వెలుగును దాచే నీడను వదలాలో॥ తెలియటంలా...ఏమి మాట్లాడాలో ఏమి మౌనంగా దాచుకోవాలో, ఒక మాట మనసును గెలుస్తుందని ఒక మాట మనిషిని దూరం చేస్తుందని॥ తెలియటంలా...ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఆవేశపు అలల వెంట పోవాలో ఆలోచనల ఒడ్డున నిలవాలో॥ తెలియటంలా...ఎలా బతకాలో ఎంతగా నవ్వాలో, మన కోసం మాత్రమే జీవించాలో మనతోపాటు మరొకరిని వెలిగించాలో॥ తెలియటంలా...ఎవరిని ప్రేమించాలో ఎవరిని జ్ఞాపకాలుగా మిగల్చుకోవాలో, కళ్లను ఆకట్టుకునే రూపాన్నా హృదయాన్ని హత్తుకునే స్వభావాన్నా॥ తెలియటంలా...ఏమి చెప్పాలో ఏమి గుండెలో దాచుకోవాలో, అన్నీ చెప్పేస్తే విలువ తగ్గుతుందని ఏమీ చెప్పకపోతే దూరం పెరుగుతుందని॥ తెలియటంలా... ఏమి చూడాలో ఏమి చూడనట్టే వదిలేయాలో, లోపాలను లెక్కించాలో లోకాల్ని ప్రేమించాలో॥ తెలియటంలా... ఏమి రాయాలో ఏమి రాయకూడదో, కాలంతో కలిసి కరిగిపోయే అక్షరాలనా కాలాన్నే నిలబెట్టే అక్షరాలనా॥ తెలియటంలా... జీవితం ఒక ప్రశ్నపత్రం, జవాబులు మాత్రం పుస్తకాల్లో ఉండవు; అడుగులు వేస్తూ నేర్చుకోవాలి, అనుభవాలే గురువులవుతాయి॥ చివరికి తెలిసేదొక్కటే— నడక ...
Image
 తెలుగుతల్లికి అక్షరహారతులు రాయిద్దాం... రసరమ్యమైన భావాల్ని రాయిద్దాం, రాగాల్లా హృదయాలను తాకే రత్నాలాంటి రచనల్ని రాయిద్దాం. చదివిద్దాం... చదువును చైతన్యంగా మలిచే  గ్రంథాలను చదివిద్దాం, చీకట్లను చీల్చే జ్ఞానజ్యోతిని వెలిగిద్దాం. పొగుడుదాం... పదాలను కాదు – పదునైన భావాలను; కవిని కాదు – కవిత్వ సాధనను; ప్రతిభ వికసిస్తే ప్రపంచమే పరవశిస్తుందని చాటుదాం. ప్రోత్సహిద్దాం...  మొగ్గలోనే ఉన్న ప్రతి కలాన్ని, మొదటి అడుగులు వేస్తున్న ప్రతి కవిని, ఒక చప్పటితో, ఒక చిరునవ్వుతో, ఒక అభినందనతో ఆకాశానికెత్తుదాం. సభకు పిలుద్దాం... అక్షరాభిమానులందరినీ, సాహిత్యసేవకులందరినీ, భావసుమాల పరిమళాలు వెదజల్లే సాహిత్య వేదికపైకి ఆహ్వానిద్దాం. మాట్లాడుదాం... మనసులను మమతతో కలిపే మాటలు, మనుగడకు మార్గం చూపే మాటలు, మానవత్వాన్ని మేల్కొలిపే సందేశాలను పంచుదాం. సత్కరిద్దాం... సంపదను కాదు – సంప్రదాయాల్ని, పదవిని కాదు – కవిత్వ ప్రతిభను; కీర్తిని కాదు – కర్తవ్యనిష్ఠను, సాహిత్యసేవను శిరసావహిద్దాం. మదిలో నిలుపుకుందాం... మంచి మాటలను, మధురమైన కవితలను, మహోన్నత రచయితలను, మానవతా విలువలను. ఎందుకంటే... అక్షరం విత్తనమైతే ఆలోచన వృక...
Image
 అన్నీ కుదరవు అన్ని కూతలు కోకిల గానాలు కావు; అన్ని రాతలు మహాకావ్యాలు కావు॥ అన్ని మబ్బులు చినుకులు కురిపించవు; అన్ని వృక్షాలు ఫలప్రదాలు కావు॥ అన్ని మాటలు మనసులను గెలుచుకోలేవు; అన్ని ఊహలు ఉన్నత శిఖరాలను చేరుకోలేవు॥ అన్ని అక్షరాలు ఆణిముత్యాలు కావు; అన్ని పదాలు కవితలుగా వికసించవు॥ అన్ని ఆటలు ఆనందాన్ని పంచలేవు; అన్ని పాటలు ఆత్మను తాకలేవు॥ అన్ని కలాలు అద్భుతాలను సృష్టించలేవు; అన్ని గళాలు గుండెలను కదిలించలేవు॥ అన్ని నవ్వులు మోములను వెలిగించలేవు; అన్ని పువ్వులు పరిమళాలను వెదజల్లలేవు॥ అన్ని కవితలు కాలపరీక్షను గెలవలేవు; అన్ని సాహితీసభలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయలేవు॥ గొప్పదనం గోలలో కాదు—గుణంలో ఉంటుంది; శాశ్వతత్వం సంఖ్యలో కాదు—సారంలో ఉంటుంది॥ కాలమే కళకు అసలైన గీటురాయి; నిలిచేదే నిజం నిండిన సృజన॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 స్వర వెన్నెల కరిగిపోయె... (గాన కోకిల ఎస్. జానకి స్మృతికి) నీ మధుర స్వరము ఏ వేకువ గాలిలో కలిసిపోయెనో! నీ సంగీత నాదం ఏ అనంత గగనంలో కలిసిపోయెనో!॥ మల్లెపూల పరిమళంలా మనసుల గుమ్మాలపై జారిన నీ గానం, కరుణామేఘంలా మమతల వర్షం కురిపించేది. నీ గుండె చప్పుడు ఆగిపోయినా, నీ గానమాధుర్యం ఎన్నటికీ ఆగదు; నీవు కనుమూసిన వార్తతో తెలుగు గీతమే కన్నీటి రాగమై విలపించింది॥ ఏ తల్లి జోలలోనో అమృతమై ఊగావు; ఏ విరహ హృదయంలోనో  కన్నీటి ముత్యమై మెరిసావు; ఏ భక్తుని ప్రార్థనలోనో దివ్యనాదమై నిలిచావు. రాగాలకు రూపముంటే అది నీవే; భావాలకు స్వరముంటే అది నీ గళమే, ఒక కోయిల నిశ్శబ్దమైంది; ఒక వెన్నెల నింగిలో లీనమైంది; ఒక మధురనది అనంతసాగరంలో కలిసిపోయింది. అయినా— పూలు వికసించిన వేళ నీ పాట వినిపిస్తుంది; వేకువ విరిసిన వేళ నీ స్వరం పరిమళిస్తుంది; తెలుగు హృదయం కొట్టుకునేంత వరకు నీ గానం చిరంజీవిగానే నిలుస్తుంది. స్వరాల ఆకాశంలో నీవిప్పుడు శాశ్వత నక్షత్రానివి; భూమి కన్నీటితో వీడ్కోలు పలికినా, సంగీతం నిన్నెన్నడూ వీడదు. వెళ్లిరా గాన కోకిలా... వెలుగుల లోకాలకు వెళ్లిరా... ఇక్కడ మిగిలిన ప్రతి హృదయం నీ పాటలతోనే నిన్ను పిలుస్తూనే ఉంటుంది....
Image
 కావాలి స్వర్గం  వెలుగు కావాలి — వెలవెలబోయిన బ్రతుకుల్లో వేకువ కిరణమై విరియడానికి; చీకటి చాటున దాగిన చిరునవ్వులను మేల్కొల్పడానికి॥ వెన్నెల కావాలి — వేదనల వేడిని చల్లార్చే చల్లని చినుకులై కురవడానికి; మనసు మడతల్లో దాగిన మధురస్వప్నాలను మేల్కొలపడానికి॥ ప్రేమ కావాలి — ప్రాణానికి ప్రాణమై, పలుకులకు పరవశమై; హృదయాల మధ్య హరివిల్లుల వంతెన కట్టడానికి॥ మమత కావాలి — మంచుతెరల మృదుత్వమై, తల్లిచేతి స్పర్శై; బాధలన్నిటినీ బుజ్జగించే జోలపాట కావడానికి॥ పువ్వులు కావాలి — ప్రకృతి పెదవులపై పూసిన నవ్వులై; ప్రతి ఉదయాన్ని పండుగగా మార్చడానికి॥ పరిమళాలు కావాలి — పూలలోనే కాదు, పలకరింపుల్లోనూ పరచుకుని; మనిషి మనసును మానవత్వంతో నింపడానికి॥ అందము కావాలి — ముఖచందంలో కాదు, మనసు మంచితనంలో; చూపులను దాటి చిరకాల జ్ఞాపకాల్లో నిలిచిపోవడానికి॥ ఆనందము కావాలి — ఆస్తుల్లో కాదు, ఆప్యాయతల్లో విరియడానికి; ఒక్కడికే కాదు, అందరి హృదయాల్లో అలలై పొంగడానికి॥ అందుకే...  వెలుగు పంచే జీవితమూ, వెన్నెల చిందే మనసూ, ప్రేమ పలికే పలుకులూ, మమత నింపే ముద్దులూ, పువ్వులా నవ్వే ముఖాలూ, పరిమళాలై నిలిచే జ్ఞాపకాలూ, అందమై వికసించే ఆత్మలూ, ఆనంద...
Image
 నీటి రూపాలు  కన్నీరు — కరిగిన గుండెకు కలిగే మూగసాక్ష్యం; కంటి తలుపులు తెరిస్తే కథలై జారే భావప్రవాహం॥ మున్నీరు — మహాసముద్రమై మహిమను చాటే జలవైభవం; లోతెరిగినవారికే లోకసత్యాలు తెలిపే గురుబోధనం॥ తన్నీరు — దాహార్తిని తీర్చే దైవానుగ్రహపు తీర్థం; ప్రాణమనే మొక్కకు ప్రతిరోజూ పోసే జీవజలం॥ తేనీరు — అలసటను కరిగించే ఆప్యాయతల ఆహ్వానం; ఒక కప్పులోనే వంద పలకరింపులు నింపే స్నేహం॥ చన్నీరు — చికాకులను చల్లార్చే చిరునవ్వుల నేస్తం; వేసవి వేడిలో వెన్నెలై దిగివచ్చే వరం॥ వెన్నీరు — వెచ్చని వాత్సల్యంతో వేదనను వీడదీసే వైద్యం; శరీరానికే కాదు, మనసుకూ హాయినిచ్చే మమతామృతం॥ ఎలనీరు — ఎండల దాహానికి ఎదురొడ్డి నిలిచే ప్రకృతి ప్రసాదం; కొబ్బరి గుండెలో దాగిన కల్పవృక్షపు కల్యాణామృతం॥ పన్నీరు — పూల పరిమళాలను పుటపుటలుగా వెదజల్లే పవిత్రజలం; పండుగలకు పవిత్రతను పంచే పూల జలం॥ కన్నీరు కరుణను నేర్పింది, మున్నీరు మహిమను చాటింది, తన్నీరు ప్రాణాన్ని నిలిపింది, తేనీరు స్నేహాన్ని పెంచింది. చన్నీరు చల్లదనమిచ్చింది, వెన్నీరు వెచ్చదనమిచ్చింది, ఎలనీరు తృప్తిని నింపింది, పన్నీరు పరిమళం పంచింది॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం....
Image
 నీ స్థానమేది...? ఈ విశాల విశ్వంలో నీ స్థానమేది? వెలుగులు వెదజల్లే నక్షత్రానివా? లేక చీకటిని చీల్చే ఉషోదయ కిరణానివా? ఈ భువన భాండాగారంలో నీ స్థానమేది? సంపదలను కూడబెట్టే హస్తానివా? లేక సంతోషాలను పంచే  మానవ హృదయానివా? ఈ నీలి గగనంలో నీ స్థానమేది? మేఘమై వచ్చి కరిగిపోతావా? లేక ఇంద్రధనుస్సై  ఆశల హారాలను అల్లుతావా? ఈ మానవ జాతిలో నీ స్థానమేది? జన్మించి వెళ్లిపోయే వారిలో ఒకడివా? లేక జీవించి జాడలు మిగిల్చే  మహిమాన్విత మనిషిగా నిలుస్తావా? ఈ తెలుగు ప్రపంచంలో నీ స్థానమేది? మాటలు వల్లించే నాలుకవా? లేక మాతృభాషకు మకుటం కట్టే  మహత్తరమైన కలమువా? ఈ సాహితీ సాగరంలో నీ స్థానమేది? అలలా వచ్చి చెదిరిపోతావా? లేక అమృతధారగా  యుగయుగాలకు ప్రేరణవై ప్రవహిస్తావా? ఈ అక్షర లోకంలో నీ స్థానమేది? సిరా చుక్కవా? లేక తరతరాలను వెలిగించే  శాశ్వత శిలాశాసనానివా? ఈ కవితా జగతిలో నీ స్థానమేది? ఒక పద్యపు పాదానివా? లేక పాఠకుల హృదయాల్లో పరిమళించే భావగీతానివా? నీ స్థానం ఎవ్వరూ వచ్చి ఇచ్చేది కాదు; ఎవ్వరూ చూపించి పెట్టేది కాదు.  నీ ఆలోచనలతో, నీ ఆచరణతో, నీ అక్షరాలతో, నీ ఆదర్శాలతో నువ్వే నిర్మించుకోవాల్...
Image
 చేతల చమత్కారాలు త్రాగిస్తే — తచ్చాడుతా, తాళాలకు తందనాలాడుతా; తినిపిస్తే — తిరుగుతా, తృప్తిని పొందుతా॥ పలకరిస్తే — పలవరింతలై వికసిస్తా, పండుగవుతా; పరవశపరిస్తే — పట్టరాని తన్మయత్వంలో మునిగిపోతా॥ చూపిస్తే  — వెన్నెలై విరిసిపోతా, విస్మయమవుతా; వినిపిస్తే — వీణారాగమై విహరిస్తా, తన్మయుడనవుతా॥ ఆడిస్తే — ఆనందిస్తా, ఆకట్టుకుంటా; గెలిపిస్తే — గంతులేస్తా, కీర్తిపతాకం ఎగరేస్తా॥ పాడిస్తే — పంచమమవుతా, పాటలో ప్రాణమవుతా; పొంగిస్తే — పుష్కలానందమై పొంగిపోతా॥ ప్రేమిస్తే — ప్రాణదీపమవుతా, ప్రణయసాగరంలో ఈదుతా; పెళ్లిచేస్తే — పాణిగ్రహణ బంధమవుతా, పరిపూర్ణ జీవితం గడుపుతా॥ రాయిస్తే — రత్నాల్లాంటి భావాలు చిందిస్తా, రసవర్షమవుతా; గీయిస్తే — గవాక్షాలు తెరుస్తా, గీతల్లో గుండెచప్పుళ్లు నింపుతా॥ పొగిడితే — పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తా, పుష్పంలా వికసిస్తా; ప్రోత్సహిస్తే — ప్రతిభను చాటుతా, ప్రగతి శిఖరాలెక్కుతా॥ నమ్మితే — నింగంత విశ్వాసమై నిలుస్తా, నీడవుతా; నడిపిస్తే — నవ్యబాటల్లో పయనిస్తా, ఫలసిద్ధి పొందుతా॥ ఆదరిస్తే — ఆత్మీయతై అల్లుకుపోతా, ఆనందమై నిలుస్తా; ఆశీర్వదిస్తే — అక్షరాల్లో చిరంజీవినై, అందరి హృదయాల్లో ...
Image
 పూబాలల పొంకాలు  మల్లెలా మత్తెక్కించు — మమతల మకరందాలను మనసున నింపించు; వెన్నెలవై వెలుగులు చిందించు — విరహాల చీకట్లను చిరునవ్వుతో తరిమించు॥ మందారంలా మురిపించు — మధురానురాగాలను మదిలో మొలిపించు; అరుణోదయ కాంతివై మెరిసించు — ఆశల ఆకాశాన్ని రంగులతో నింపించు॥ గులాబిలా మదిని తట్టు — గుండె గూటిలో గుసగుసల గీతమై నిలిచిపో; రేకుల్లాంటి సున్నితత్వంతో — ప్రేమరాగాలను పరవళ్లు తొక్కించు॥ ముద్దబంతిలా మైమరిపించు — ముద్దు పలుకులతో మురిపాల వర్షం కురిపించు; బంగారు వెలుగులా విరబూసి — బ్రతుకంతా బంధాల పండుగగా మార్చించు॥ సన్నజాజిలా వికసించు — సన్నని నవ్వులతో సౌందర్యాన్ని చిందించు; పరిమళపు పవనమై వీచి — ప్రతి క్షణాన్నీ ప్రేమగీతంగా మార్చించు॥ చామంతిలా వయ్యారాలు చూపు — చూపుల్లో చిలిపి చంద్రికలను నింపించు; నిర్మల హృదయమై వెలిగి — చెలిమి చిగురులను చిరకాలం కాపాడించు॥ కనకాంబరంలా కళకళలాడు — కలల లోకానికి కాంతుల హారమవు; బంగారు ఉదయమై వెలిగి — బాధల మబ్బులను చిరునవ్వుతో చెదరగొట్టు॥ సంపంగిలా సౌరభాలు వెదజల్లు — సన్నిధినంతా స్వర్గసీమగా మార్చివేయు; ప్రేమ పరిమళమై పరవశింపజేసి — ప్రాణాల పల్లకిలో నిత్యం విహరింపజేయు॥ పూలన్నిటి ...
Image
 అక్షర తోరణాలు మామిడి తోరణాలు — ముంగిట మంగళ శోభను పరచే పచ్చని ఆశలు; పువ్వుల తోరణాలు — పరిమళాలతో పండుగలకు స్వాగతం పలికే ప్రేమలహరులు॥ అరుణ తోరణాలు — ఆకాశాన ఉదయరాగాలను అల్లే సూర్యకిరణాలు; అక్షర తోరణాలు — అంతరంగాల గుమ్మాలకు ఆనందాలను అలంకరించే కవితామాలలు॥ మల్లెల తోరణాలు — మనసులను మత్తెక్కించే మాధుర్య గంధాలు; మమతల తోరణాలు — మనుషుల మధ్య బంధాలను బలపరిచే బంగారు వంతెనలు॥ చిరునవ్వుల తోరణాలు — చీకట్ల గుమ్మాలను వెలుగులతో నింపే వెన్నెలలు; చిరు పలుకుల తోరణాలు — చిరకాల స్నేహాలకు చిరునామాలయ్యే ముత్యాల సరాలు॥ కలల తోరణాలు — కనురెప్పల గడపపై కాంతులను కురిపించే ఇంద్రధనుస్సులు; కవితా తోరణాలు — కాలపు గుండెలపై కళాత్మకంగా నిలిచే అక్షర శిల్పాలు॥ ప్రేమ తోరణాలు — ప్రాణాల గుమ్మానికి పరిమళాలు పూయించే పుష్పహారాలు; ప్రణయ తోరణాలు — ప్రతి హృదయాన్ని స్వర్గసీమగా మార్చే మధురానుభూతులు॥ తెలుగు తోరణాలు — తేనెలొలికే తల్లి భాషకు తిలకమయ్యే అక్షరవల్లులు; సాహిత్య తోరణాలు — సంస్కృతికి సిరిసంపదలు చేకూర్చే సరస్వతీ హారాలు॥ జీవిత తోరణాలు — జ్ఞాపకాల జాజులతో జతకట్టిన అనుభవాల దండలు; అనుబంధ తోరణాలు — ఆత్మలను ఒక్కటిగా అల్లే అపురూప అనురా...
Image
 నా అక్షరాల అడుగుజాడలు దేవులపల్లి కృష్ణశాస్త్రిలా రాయనా? ప్రకృతి సోయగాలకు కవితాభిషేకం చేస్తూ, హృదయవీణపై మధురరాగాలు పలికిస్తూ, భావకవిత్వానికి మల్లెపందిరి కడుతూ రాయనా? దాశరథిలా రాయనా? తెలంగాణ నేల ఆవేదనను ఆలపిస్తూ, స్వేచ్ఛా స్వప్నాలకు దీప్తినిస్తూ, అణగారిన ఆత్మలకు ఆశాకిరణమై రాయనా? శ్రీశ్రీలా రాయనా? సంకెళ్లను సవాలు చేస్తూ, శ్రమజీవి చెమటను చరిత్రగా మలుస్తూ, అన్యాయాన్ని ప్రశ్నించే విప్లవ శంఖమై రాయనా? సినారెలా రాయనా? తెలుగు మాటలకు సంగీతస్పర్శనిస్తూ, ప్రేమను పరిమళంగా చల్లి, లాలిత్యసుధలను లోకానికి పంచుతూ రాయనా? ఆరుద్రలా రాయనా? ఆలోచనల లోతుల్లోకి దిగిపోయి, కాలాన్ని ప్రశ్నిస్తూ, జీవితరహస్యాలను జిజ్ఞాసకు జ్యోతులుగా వెలిగిస్తూ రాయనా? ఆత్రేయలా రాయనా? మనసు మౌనాన్ని మాటలుగా మార్చి, ప్రేమకు ప్రాణం పోసి, ఒక చిరునవ్వులోనే వేల భావాలను పలికిస్తూ రాయనా? తిలక్‌లా రాయనా? అంతరంగ అలజడిని ఆవిష్కరిస్తూ, జీవితపు సూక్ష్మసత్యాలకు నిశ్శబ్దాన్నే నుడికారంగా చేస్తూ, మనిషి మనసును అద్దంలా చూపిస్తూ రాయనా? అలా కాదు... నాలా రాస్తాను. నా కన్నీరు తెలిసిన కలంతో, నా నవ్వు నేర్చుకున్న అక్షరాలతో, నా అనుభవం నింపిన భావాలతో, నా ఊహ...
Image
 ప్రియా! పిలిస్తే పరుగెత్తుకుంటూ రానా? పిచ్చివాడినై నీ పాదాల చెంత వాలనా? హృదయాన్ని అర్పించనా? ప్రేమసుధను పంచనా?॥ కవ్విస్తే వలకు చిక్కనా? కన్నుల గాలానికి బందీ అయిపోనా? మోహపు మైకంలో మునిగిపోనా, మమతల మధురిమలో మైమరచిపోనా॥ కలలోకొస్తే కలవరించనా? కనురెప్పలపై నీ రూపమే కొలువుండగా, కలకూ నిజానికీ తేడా చెరిగిన వేళనా, కరిగే వెన్నెలలా నీలో కలిసిపోనా॥ పలికితే ప్రతిస్పందించనా? ప్రతి పలుకులో ప్రతిధ్వనిగా మారనా? నీ మాటల్లో మనసు వినిపిస్తే, ప్రేమగీతాన్ని ఆలపించనా॥ నవ్వితే బదులివ్వనా? నవ్వులో నవ్వు కలిపి పూయనా? నీ చిరునవ్వు చిందితే చాలదా, నా హృదయమంతా వసంతమై విరబూయనా॥ చేయి చాస్తే జత కలపనా? చెంతకు చేరి చేయూతనివ్వనా? నమ్మకపు నూలుతో బంధాన్ని ముడివేయనా, జీవితాంతం విడవని తోడుగా నిలవనా॥ తోడుకురమ్మంటే తొందరగా రానా? తొలకరి చినుకై నీ గడప చేరనా? ఆహ్వానంలో ఆత్మీయత ఉంటే, ఆలస్యంచేయక దరిచేరనా॥ మెడ వంచితే తాళి కట్టనా? మంగళసూత్రంతో మనసులను ముడివేయనా? ప్రేమ పరిపక్వమై ఆశీర్వాదమై వికసిస్తే, ఏడు అడుగులతో జీవితమంతా నీతోనే నడువనా॥ అయితే ఒక మాట... పిలుపులో ప్రేమ ఉండాలి ప్రియతమా, కవ్వింపులో కపటం ఉండకూడదు చెలియా; చూపుల్లో చెలి...
Image
 కవినైతే... నా కవితలే చెబుతాయి! కవినని ఇల్లెక్కి కూయను, కొండెక్కి చెప్పను; వేదికెక్కి వినిపించను, వీధుల్లో విర్రవీగను॥ కవినని పత్రికల్లో ప్రకటించను, పద్యాలలో పేర్కొనను; గొంతెత్తి గర్జించను, గుండెల్లో చోటు అడగను॥ కవిగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను, కొంగొత్త భావాలను వెల్లడిస్తాను; కలాలను కదిలిస్తాను, కలలను కవితలుగా మారుస్తాను॥ కవిగా పాఠకుల మన్ననలు పొందుతాను, పలువురిని పరవశింపజేస్తాను; తోటి కవులను తోడుతెచ్చుకుంటాను, తెలుగు తోటను పూలతో నింపేస్తాను॥ కవిగా తెలుగుజాతికి తెలియజేస్తాను, తెలుగు తల్లి తేజాన్ని చాటుతాను; విశ్వానికి వినిపిస్తాను, తెలుగు వైభవం చాటుతాను॥ కవిగా వాణిపుత్రుడనై గర్విస్తాను, వాక్సుధను విరజిమ్ముతాను; అక్షరాల అంబరంలో విహరిస్తాను, అమర దీపమై వెలిగిపోతాను॥ కవిగా — కవిత్వమే నా కులమంటాను, కలమే నా బలమంటాను; భావమే నా భాషంటాను, ప్రేమే నా పరమార్థమంటాను॥ కవిగా పొగడ్తల కోసం పాడను, పేరుకోసం పరుగెత్తను; పదిమందిలో వెలుగునింపుతాను, ప్రజ్వలించే దీపమై దారిచూపుతాను॥ కవినని నేనే చెప్పుకోను — నా కవితలే ప్రపంచానికి చెబుతాయి; నా పేరు కాదు చిరస్థాయి — నా రచనలే కలకాలం నిలిచిపోతాయి॥ ఓ కవి అంటాడ...
Image
 చిరుచింతనలు... చిరంతన సందేశాలు చిరునవ్వులు చిందితే — చీకటి మేఘాలు చెల్లాచెదరవుతాయి; చిగురాకులు వేస్తే — చెట్లన్నీ కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తాయి॥ చిరుమొగ్గలు తొడిగితే — చెలిమి సౌరభాలు వెదజల్లుతాయి; చిరుజల్లులు పడితే — చిట్లిన నేలలు చిగురాశలతో పులకరిస్తాయి॥ చిరుసవ్వడులు వినిపిస్తే — చెవులలో చైతన్య వీణలు మ్రోగుతాయి; చిరుమాటలు పలికితే — చిరకాల బంధాలు మరింత బలపడతాయి॥ చిరుసాయం అందితే — చిక్కుముడులన్నీ వీడిపోతాయి; చిరుకోర్కెలు చిగురిస్తే — చిత్తవీణలో ఆనంద రాగాలు పలుకుతాయి॥ చిరుతిండ్లు తింటే — చిన్ననాటి మధుర జ్ఞాపకాలు మేల్కొంటాయి; చిరునామా దొరికితే — చేరాలనుకున్న గమ్యానికి దారులు  కనిపిస్తాయి॥ చిరుమోములు నవ్వితే — చింతలన్నీ చిరుగాలిలో కలిసిపోతాయి; చిరుగాలులు వీస్తే — మేనులన్నీ మహదానందంలో మైమరచిపోతాయి॥ చిరుదీపాలు వెలిగితే — చీకటి గుండెల్లో ఆశాజ్యోతులు వెలుగుతాయి; చిరుపదాలు పేర్చితే — చిరంతన సాహిత్య సౌధాలు నిర్మితమవుతాయి॥ చిరుభావాలు కురిస్తే — చిత్తక్షేత్రంలో ప్రేమపూలు పూస్తుంటాయి; చిరుకవితలు జాలువారితే — చిరకాలం నిలిచే మనోమధుర గీతాలు పుడతాయి॥ చిరు అనే పదం చిన్నదే — చైతన్యానికి చిహ్నమ...
Image
 భారత భాషల భూషణం – బంగారు తెలుగు అచ్చ తెలుగు — అమ్మ ఒడిలో జోలపాటై అలరించే భాష; ఆత్మను ఆలింగనం చేసుకుంటూ అమృతధారలు పారించే భాష॥ తేట తెలుగు — తేటతెల్లమైన తాత్పర్యాలు పలికించే భాష; తర్కానికీ తేనె పూసి, తలపులకు వెలుగునిచ్చే భాష॥ తీపి తెలుగు — తేనె చుక్కల తీయదనమై జారే భాష; విన్న చెవులకు విందై, మనసులకు మధురిమలు పంచే భాష॥ వరాల తెలుగు — వాగ్దేవి వరమై వెలసిన భాష; విద్యకు వెలుగై, విజ్ఞానానికి వేదికైన భాష॥ పల్లె తెలుగు — పంట పొలాల పరిమళం పంచే భాష; గోదారమ్మ గలగలల్లో, గోరింటాకు సొగసుల్లో వెలిగే భాష॥ నాజూకు తెలుగు —  నవమల్లెల నాజూకుతనం నింపుకున్న భాష; నవ్వులోనూ, నిట్టూర్పులోనూ నయగారాన్ని నింపే భాష॥ సుందర తెలుగు — సాహిత్య సరస్వతికి సింగారమైన భాష; సంగీత స్వరాలకు సఖియై, సంస్కృతికి సౌందర్యం చేకూర్చే భాష॥ నేటి తెలుగు — నవయుగానికి నవచైతన్యం నింపే భాష; నింగిని తాకే సాంకేతికతలోనూ, నిత్యనూతనంగా నడిచే భాష॥ మేటి తెలుగు — మహనీయుల మేధస్సుకు మణిహారమైన భాష; మానవతకు మార్గదర్శకమై, మహిమలను చాటే మేటి భాష॥ బంగారు తెలుగు — భారత భాషల భూషణమై వెలిగే భాష; భావాలకు బంగారు వన్నెలద్దే భాష; భవితకు బాటలు వేసే భాష॥ తెలుగు...