కయ్యమో — వియ్యమో?
కయ్యానికి — వియ్యానికి
కోపపు అగ్నికి — ప్రేమపు జలానికి
మధ్యలో మనసు
మార్గం వెతుక్కుంటూ తడబడుతుంది.
కొయ్యటానికి — వెయ్యటానికి
కఠిన నిర్ణయానికి — కరుణ హృదయానికి
మధ్యలో మనిషి
మూల్యాల మర్మాన్ని కొలుస్తూ నిలుస్తాడు.
గయ్యాలితనానికి — వయ్యారితనానికి
గర్జించే గర్వానికి — మురిపించే మాధుర్యానికి
జీవితరంగంలో
రంగులు మారుతూనే ఉంటాయి.
మెయ్యటానికి — మోయటానికి
చేజిక్కింది తినటానికి — పైపడింది భరించటానికి
మధ్యలో హృదయం
సరిగమల సప్తస్వరాలు పలుకుతుంది.
తియ్యదనానికి — తీయటానికి
మాటల మాధుర్యానికి — మమతను తొలగించటానికి
మనుగడ గీతంలో
ప్రేమ రాగం పరిమళిస్తుంది.
కుయ్యటానికి — ముయ్యటానికి
చిలిపి నవ్వులకు — మౌన క్షణాలకు
మనసు అద్దంలో
జీవిత చిత్రం మెరుస్తూనే ఉంటుంది.
జీవితం ఎప్పుడూ
రెండు దారుల మధ్యే నడుస్తుంది —
కయ్యమో, వియ్యమో… కోపమో, ప్రేమో…
అటో ఇటో తూలే మనసే మనిషి నిజ స్వరూపం.
— గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment