ఎత్తుకున్నా…
(ఎత్తులచిట్టా)
పాపను ఎత్తుకున్నా —
ప్రీతి పరిమళం పసిడి క్షణాలై ప్రవహించింది,
చిన్న చేతుల్లో చిరునవ్వులు చిలకరిస్తే
మనసు మృదువై మల్లెలా మొగ్గ తొడిగింది.
పాటను ఎత్తుకున్నా —
పదాలు పల్లవిగా పరవశించగా,
రాగాల రెక్కలపై ఆత్మ ఎగిరి
ఆనంద గగనంలో ఆడిపాడి విరిసింది.
బరువును ఎత్తుకున్నా —
భుజాలపై భారమై నిలిచినా,
ధైర్యం అండగా నిలబడింది,
జీవితం జయగీతం ఆలపించింది.
బాధ్యతను ఎత్తుకున్నా —
బాటలో వెలుగులు దీపాలై వెలిగాయి,
నమ్మకం నడిపే ప్రతి అడుగులో
నిలకడ నిండిన గమ్యం చేరువైంది.
సమస్యను ఎత్తుకున్నా —
సంకల్పం శక్తిగా మారింది,
అడ్డంకులన్నీ దారులయ్యాయి,
విజయం తలుపులు తట్టింది.
తలను ఎత్తుకున్నా —
గర్వం వదిలింది, గౌరవం పెరిగింది,
నిజాయితీ నీడగా నిలిచింది
మనిషితనం మహిమగా మెరిసింది.
ఎత్తుకోవడం అన్నది —
భారమూ కాదు, భావమూ కాదు… అది జీవనయాత్ర,
ఎత్తుకున్నదే మనల్ని ఎత్తుతుంది —
మనసు ఎత్తితేనే మనిషి మహోన్నతుడవుతాడు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment