జీవితభారాలు


వంటిభారం మోస్తున్నప్పుడు—

కాళ్ళు ముందుకు పడనంటవి

కరాలు కదలనంటవి

కానీ నోరు మొత్తుకుంటది॥


ఇంటిభారం నెత్తికెక్కినప్పుడు—

ఇల్లు ఇటుకలకే పరిమితం కాదు,

బాధ్యతల బరువులతో

బంధాల బలం బిగుచుకుంటుంది॥


పనిభారం పైనబడినప్పుడు—

పగలు రాత్రి కలిసిపోతాయి,

చెమట చుక్కలౌ రాలుతున్నా

శరీరం శ్రమను కొనసాగించమంటుంది॥


దూరాభారం దాటుతున్నప్పుడు—

దూరాలు గుండెల్లో దిగబడతాయి,

అంతరాల ఆవేదనలోనే

ఆప్యాయతల విలువ పెరుగుతుంది॥


తలమీదిభారం మోస్తున్నప్పుడు—

అడుగులు నెమ్మదిగా వేయమంటాయి,

కానీ ధైర్యం దారి చూపుతూ

మనసుకు ఊపిరినిస్తుంది॥


పిల్లలభారం మోస్తున్నప్పుడు—

బాధ్యతల బరువు తేలికవుతుంది,

చిరునవ్వుల చిన్నారుల మధ్య

జీవితం పరవశిస్తుంది॥


పెద్దలభారం మోస్తున్నప్పుడు—

అనుభవాల నీడ మనతో ఉంటుంది,

వారి ఆశీస్సుల వెలుగులో

మంచి మార్గం కనబడుతుంది॥


అప్పులభారం మోస్తున్నప్పుడు—

మనసు కొంచెం వంగిపోతూనే ఉంటుంది,

కానీ ఆశల అంచుల్లో

అవకాశాలు కొత్తగా మొలుస్తాయి॥


జీవితభారం మోస్తున్నప్పుడు—

జీవితం బాట చూపిస్తుంది,

బరువు అనిపించే ప్రతి క్షణం

భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దుతుంది॥


భారం అనేది శాపం కాదు—

బాధ్యతల రూపంలో వచ్చిన వరం;

మోసిన కొద్దీ మనిషిని

మానవత్వం వైపు నడిపే మార్గదర్శకం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 

Comments

Popular posts from this blog