ఓ కవీశ్వరా!
కుళ్ళును కడిగేయ్—
కంపు కాయాల్ని కాల్చివేయ్,
కపటపు కవచాల్ని ఛేదించేయ్,
కలుషిత మనసులను శుద్ధిచేయ్॥
చెడును చెరిపేయ్—
చీకటి చాటున దాగిన దుర్బుద్ధిని,
చెరగని మచ్చలై పెరిగిన పాపాన్ని,
చైతన్య జ్వాలలతో చిదిమివేయ్॥
మలినాన్ని మట్టుబెట్టేయ్—
మనసుల్లో పేరుకున్న మసకలను,
మాటల్లో మొలిచిన మోసపు ముళ్లను
మానవత్వ వర్షంతో ముంచెత్తేయ్॥
అవినీతిని అంతంచేయ్—
అధికారపు అహంకార జ్వాలలను,
అన్యాయపు అడ్డగోలు దారులను
అక్షర సత్యంతో అణచివేయ్॥
అహంకారాన్నీ అణగకొట్టేయ్—
అధికత్వపు అంధకార గర్జనలను,
అణగారిన వారి ఆర్తనాదాలపై
సమానత్వ అమృతం చల్లివేయ్॥
దౌర్జన్యాలను తుదముట్టించేయ్—
దుర్మార్గపు దండయాత్రలన్నిటినీ,
దీనుల కన్నీటి గాథలన్నిటినీ,
ధర్మధ్వజంతో ధూళిలో కలిపివేయ్॥
మానవత్వమే మంత్రంగా మారనీ,
మమతలే మహోన్నత మార్గమవనీ,
నిజాయితీనే నిత్యదీపమై వెలగనీ,
నూతన సమాజం నవోదయమై విరియనీ॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment