పుస్తకం కనుమరుగవుతుందా?
పుస్తకం మూతబడుతుంది—
పుటల పలుకులు మౌనమవుతున్నాయి,
అక్షరాల ఆత్మీయతను
అరచేతి తెరలు ఆక్రమిస్తున్నాయి॥
పుస్తకం కొనేవాళ్లు తగ్గారు—
పుస్తక దుకాణాల గడపలపై
గాలిదుమ్మే గుసగుసలాడుతోంది,
జ్ఞానదీపాల వెలుగులు నెమ్మదిగా నీరసిస్తున్నాయి॥
పుస్తకం చదివేవారు లేరు—
ఒకప్పుడు రాత్రివేళ
దీపం కింద పుటలు తిప్పిన వేళ్లు,
ఇప్పుడు చరవాణి వెలుగులో మౌనంగా మరుగునపడుతున్నాయి॥
పుస్తకం ప్రచురించే కవులు తగ్గారు—
మనసు రక్తంతో రాసిన పద్యాలకు
ముద్రణ యంత్రాలు ఎదురుచూస్తున్నాయి,
కవిత్వ గర్భగుడిలో నిశ్శబ్దమే నివాసముంటోంది॥
“పుస్తకం హస్తభూషణం” అనేవారు లేరు—
ఒకప్పుడు చేతిలో పుస్తకం ఉంటే
అది విద్యకు గుర్తు, వినయానికి ప్రతీక,
వ్యక్తిత్వానికి వన్నెగా నిలిచేది॥
గ్రంథాలయాల తలుపులు
ఇప్పటికీ ఎవరికో ఎదురు చూస్తున్నాయి,
అరుదైన పుస్తకాల మధ్య
ఒంటరితనం అక్షరాలై తిరుగుతోంది॥
పుస్తకం కనుమరుగవుతుందా? లేదు లేదు -
పుటలు పసుపురంగైపోయినా
పదాల పరిమళం చావదు,
అక్షరాల అస్తమయం జరిగినా ఆలోచనల ఉదయం ఆగదు॥
ఒక మంచి పుస్తకం—
మనిషిని మనీషిగా మలుస్తుంది,
మూసుకుపోయిన మనసుల తలుపులు తెరుస్తుంది,
చీకటి కాలానికీ దీపస్తంభంలా దారి చూపిస్తుంది॥
రండి…
మళ్లీ పుస్తకాన్ని హత్తుకుందాం,
పిల్లల చేతుల్లో పుటల పరిమళం నింపుదాం,
గ్రంథాలయాల గుండెల్లో మళ్లీ నవ్వులు పూయిద్దాం॥
ఎందుకంటే— పుస్తకం కేవలం కాగితం కాదు…
అది కాలంతో సంభాషించే మది...
మానవ మేధస్సుకు చిరస్థాయి జ్యోతి
తరతరాలకు అందించే జ్ఞానామృత గంగోత్రి॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment