రూపాల రాగమాలిక
చుక్కల్లో చంద్రుడా—
చీకటి చీరపై వెండిబొట్టువా,
నిశ్శబ్ద రాత్రికి చిరు నవ్వువా,
నిదురలేని హృదయాలను తాకే కలవా॥
కొమ్మల్లో పుష్పమా—
కాంతికుసుమంగా కదిలే కవిత్వానివా,
పచ్చని శ్వాసలో పరిమళం నింపే ప్రాణానివా,
సున్నితమైన స్పర్శలో సౌందర్యం పలికించే గీతానివా॥
చీకట్లో దీపమా—
దారి తప్పిన అడుగులకు దిక్సూచివా,
ఆశల అంచుల్లో అగ్నిజ్యోతి వెలిగించే దీక్షవా,
నిస్సహాయ క్షణాల్లో నిలబెట్టే నమ్మకానివా॥
ఆకాశంలో హరివిల్లా—
ఏడు రంగుల్లో ఎదను ఎగిరించే చిత్రానివా,
వర్షపు కన్నీళ్లలో వెలిగే విచిత్రానివా,
ప్రకృతి పలికే పరమానంద గేయానివా॥
కడలిలో కెరటమా—
అంతర్లీన ఆవేదనల ఆగలేని అలజడివా,
తీరాన్ని తాకే తపనలో తడిసిన తపస్సువా,
అలల లయలో ఆత్మగీతం ఆలపించే నాదానివా॥
మాటల్లో మాధుర్యమా—
మనసు ముట్టే మధురిమల మాలికవా,
పలుకుల పొదిలో పండే ప్రేమపండువా,
ఒక్క అక్షరంలో ఒదిగిన అనంతానందానివా॥
నీవు— చుక్కల్లో చంద్రుడువైనా,
కొమ్మల్లో పుష్పానివైనా, చీకట్లో దీపానివైనా,
నా కవిత్వంలో నీవే పరిమళమై నిలుస్తావు,
నా హృదయంలో నీవే నిత్య గీతమై పలుకుతావు॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment