వేసంగి వ్యధలు


మండుటెండలు మంటలు రేపగా—

గ్రీష్మ ఋతువు గగనమంతా గర్జిస్తోంది,

మేమాస వడగాల్పులు వీస్తుంటే

వేడి గాలులు వీధుల్ని వణికిస్తున్నాయి॥


ఉక్కపోతలు ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే,

చెమట చుక్కలు శ్రమల సాక్ష్యాలై జారుతున్నాయి,

ఎండిన చెరువులు నిశ్శబ్దంగా నిలిచిపోతుంటే

ప్రవహించని నదులు వేదనను వెల్లబోస్తున్నాయి॥


తడిలేని నాలుకలు తపనగా వణుకుతుంటే,

దప్పికైన గొంతులు నీటి కోసం మొరపెడుతున్నాయి,

కొట్టుకుంటున్న గుండెలు వేడిని తట్టుకోలేకపోతుంటే

కూలిపోతున్న దేహాలు నీడ కోసం పరుగెడుతున్నాయి॥


వేసంగి వదలని వేదనగా వెంటాడుతుంది,

నీడకై పరుగులు తీయిస్తుంది,

నీటికై ముచ్చెమటలు పట్టిస్తుంది,

కదలకుండా గృహాల్లో బంధిస్తుంది॥


ఇదే గ్రీష్మ తాపము—

జీవితాన్ని జ్వాలలతో పరీక్షించే కాలము,

ఇదే సూర్య ప్రతాపము—

ప్రకృతిశక్తి పరాక్రమం చూపించే ఉగ్ర రూపము॥


చినుకులు చిందించే మేఘాల కోసం ఎదురుచూపులు,

చల్లని గాలుల స్పర్శకై తపిస్తున్న ప్రాణాలు॥

గ్రీష్మాగ్ని గుండెల్ని గాయపరిచినా—

వానకాలం వస్తుందనే ఆశే జీవనానికి ఊపిరై నిలుస్తోంది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog