అక్షరాలు....


పదాలై, పంక్తులై,

పాండిత్యమై ప్రభవిల్లాలి॥

పిందెలై, పండ్లై,

పసందులై ప్రమోదపరచాలి॥


పువ్వులై, పొంకాలై,

పరిమళాలై పులకరింపజేయాలి॥

అందాలై, ఆనందాలై,

అద్భుతాలై అలరించాలి॥


జాబిలై, పున్నమై,

వెన్నెలై మురిపించాలి॥

కావ్యమై, శ్రావ్యమై,

నవరసాలై మనసులదోచాలి॥


ధూపమై, దీపాలై,

దైవమై దేవార్చన చేయాలి॥

మాటలై, పాటలై,

స్వరాలై సంతసపరచాలి॥


విత్తనాలై, మొలకలై,

ధాన్యాలై కడుపులు నింపాలి॥

ముత్యాలై, రత్నాలై, 

మాణిక్యాలై మెరిసిపోవాలి॥


బంగారమై, భూషణమై,

బహుమానమై బహుజనాదరణ పొందాలి॥

కథలై, కవితలై,

కావ్యరత్నాలై కలకాలం నిలవాలి॥


అక్షరాలు — జ్ఞానానికి విత్తనాలు,

సాహిత్యానికి సుగంధాలు,

మానవతకు మార్గదర్శకాలు,

సమాజానికి వెలుగుదివ్వెలు॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog