మాటల మాధుర్యం
ఊసులు ఆడుతా —
ఊరంతా ఉయ్యాలలూగేలా,
ఊహల ఊటలు ఉప్పొంగేలా
హృదయాలను హత్తుకునేలా॥
ముచ్చట్లు చెబుతా —
మమతల మల్లెలు పరిమళించేలా,
మురిపాల మధురిమలతో
మనసులను మురిసించేలా॥
కబుర్లు పంచుతా —
కలిసిమెలిసి బంధాలను బలపరచేలా,
కాలపు జ్ఞాపకాలను
కళ్లముందు నిలిపేలా॥
వార్తలు వెల్లడిస్తా —
వాస్తవాలను వెలికితీసేలా,
వివేకపు వేదికపై
విజ్ఞానదీపాలు వెలిగేలా॥
బాతాఖాని కొనసాగిస్తా —
బరువైన మనసులు తేలికపడేలా,
బంధుత్వపు బాటల్లో
బాసటగా నిలిచేలా॥
సంగతులు తెలుపుతా —
సత్యసౌరభాలు వెదజల్లేలా,
సమాజ స్పందనలు పంచేలా,
సర్వులను సంతసింపజేసేలా॥
ఇష్టఘోష్టి కొనసాగిస్తా —
ఇష్టాల ఇంద్రధనుస్సులు విరిసేలా,
ఇచ్చిపుచ్చుకునే ఆలోచనలకు
కొత్త దారులు వేసేలా॥
మాటలు విరజిమ్ముతా —
మధురానుభూతుల ముత్యాలు చల్లేలా,
మనసు గాయాలకు
మమతల మందుగా మారేలా॥
నవ్వులు పూయిస్తా —
నిత్య వసంతాలు విరిసేలా,
నిరాశ మేఘాలను
నిమిషంలోనే తరిమేసేలా॥
చర్చలు సాగిస్తా —
చైతన్యచిగురులు తొడిగేలా,
చదువుకున్న ప్రతి అనుభవం
జీవనపాఠాలు నేర్పేలా॥
మాటలు మంచివైతే
మానవత్వం పరిమళిస్తుంది,
మాటలు మధురమైతే
ప్రపంచమే ఒక కుటుంబమవుతుంది॥
ఊసులు ఆడుతా... ముచ్చట్లు చెబుతా...
మాటలతో మమతల వంతెనలు నిర్మిస్తా;
కబుర్లు పంచుతూ... హృదయాలను కలుపుతూ...
మానవత్వపు పరిమళాలను వెదజల్లుతా॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment