కవిత్వ వైవిధ్యానికి, సాహిత్య సౌరభాలకు వేదికగా నిలిచిన కాలిఫోర్నియా వీక్షణం 167వ అంతర్జాల సాహితీ సమావేశం
********
నేడు 18 జూలై 2026 తేదీన శనివారం కాలిఫోర్నియాకు చెందిన వీక్షణం సాహితీ గవాక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన 167వ అంతర్జాల సాహితీ సమావేశం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంటూ విజయవంతంగా జరిగింది. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా॥ కె. గీతామాధవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రేమికులు పాల్గొన్నారు. అతిధులకు, సాహితీ ప్రియులను స్వాగతం పలికి సమావేశాన్ని గీతా మాధవి సభను ప్రారంభించారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఇద్దరి అతిధుల చిరు పరిచయంచేసి పరిచయ ప్రసంగాలను చేయవలసినదిగా ఇద్దరు అతిధులను ఆహ్వానించారు.
ఈరోజు రెండు విభిన్నమైన జీవన నేపథ్యాలనుండి వచ్చిన కవుల ప్రసంగం అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉంది. డా. కందిపి రాణి ప్రసాద్ జీవన నేపథ్యం వడ్డించిన విస్తరి. వారి తల్లిదండ్రులు, పూర్వీకులు సాహిత్యానికీ సేవ చేసిన వారు. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న శ్రీ రావూరి భరద్వాజ, విశ్వనాథ వారితో వారి కుటుంబానికి బాగా పరిచయం. రాణి భర్త డాక్టర్ , ఈమె దాని అడ్మిన్ కావడం చేత చిన్నపిల్లల అనారోగ్యాలు, వాటి నివారణపై అనేక కవితలు వ్రాశారు. దాదాపుగా అరవై కవితా సంపుటిలను ప్రచురించారు. రాణి ప్రసాద్ వెలుగులోంచి దివిటీ పట్టుకుని వెలుపలికి వస్తె మౌనశ్రీ మల్లిక్ చీకటిలో నుండి సాహిత్య దివిటీ ఎగురవేశారు.
మౌనశ్రీ మల్లిక్ గారిది నిరుపేద కుటుంబం. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అందరూ బడికి పోతుంటే తనూ బడికి వెళ్లారు. అత్తెసరు మార్కులతో పాస్ అయ్యారు. అలాగే పట్టుదలతో మాస్టర్స్ చేశారు. లైబ్రరీకి వెళ్ళి విస్తృతంగా పుస్తకాలు చదివారు. తాను మాత్రం ఎందుకు కవితలు వ్రాయకూడదనే భావంతో కవితలు మొదలెట్టారు. వ్రాసిన ప్రతి కవితకూ ఏదో ఒక.బహుమతి రావడంతో తన సాహితీ ప్రయాణాన్ని మొదలెట్టారు. కొందరు పెద్దలు సినిమాలలో ప్రయతించరాదా అన్నకూడా చాలా కాలం చిన్న చిన్న పనులు చేస్తూ ఉదరపోషణ చేసుకుంటూ సినిమాపాటలు వ్రాయడానికి అవసరమైన విషయ,వస్తు సేకరణ చేసిన అనంతరమే సినిమాలలో ప్రవేశించి షుమారు 1200 పాటలు వ్రాశారు. టీవీ సీరియళ్లలో వ్రాసిన కవితలు లెక్కే లేదు. కేవలం సినిమా పాటలేకాక "దిగంబర" " గరళం" లాంటి కొన్ని పుస్తకాలు వ్రాసి సాహిత్యానికి దగ్గరగానే వున్నానని తెలిపారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి వీరొక గొప్ప ఉదాహరణ. వారి ప్రసంగానికి ప్రేక్షకులు చప్పట్లు చరిచారు
కవిసమ్మేళనంలో 30 మంది కవులు విభిన్న ప్రక్రియలకు చెందిన కవితలు, గేయాలు, పద్యాలు వినిపించి సాహిత్య రసగంగను ప్రవహింపజేశారు. డా॥ గీతామాధవి "కలల కళకళ" కవితతో ఆశావాదాన్ని ఆవిష్కరించగా, పి.వి. సత్యమూర్తి "గాంధర్వలోకానికి గానకోకిల" ద్వారా గానకోకిల ఎస్. జానకికి అక్షరాంజలి ఘటించారు. మౌనశ్రీ మల్లిక్ "ఈర్షితం" కవితలో మానవ మనస్తత్వంలోని సూక్ష్మ భావాలను చిత్రించారు.
డాక్టర్ కందేపి రాణిప్రసాద్ "మూత్రపిండం" కవిత ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని ప్రబోధించగా, కొత్తూరి వెంకట్ "శ్రీకరం – శుభకరం" ఉపనయన గేయంతో సాంప్రదాయ విలువలను ప్రతిబింబించారు. ఆది మోపిదేవి "మింగలేక మొండి శివుడు" కవితతో చమత్కారాన్ని పంచగా, అయ్యల సోమయాజుల ప్రసాద్ "నరరూప రాక్షసులకు అంతమెపుడు" కవిత ద్వారా సామాజిక దుర్మార్గాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి "కంటిరెప్ప రోదన" ఆటవెలది పద్యాలతో శ్రోతలను కదిలించగా, శ్రీలత ధావన్ "ఆత్మాభిరామం", లలితా చండి "వానలమ్మ" కవితలతో భావరసాలను పలికించారు. వైరాగ్యం ప్రభాకర్ "భుజం తట్టండి" కవిత ద్వారా నపుంసకుల జీవన వేదనను స్పృశించగా, అవధానం అమృతవల్లి "వేదిక" కవితతో సాహిత్య వేదికల ప్రాధాన్యాన్ని వివరించారు.
ఆనం అశ్రితారెడ్డి "అక్షరాల అమరికలను అల్లి", కొత్తపల్లి ప్రియాంక (భానుప్రియ) "సమాజానికి ప్రబోధం", డాక్టర్ కోదాటి అరుణ "పూరీ జగన్నాథ రథయాత్ర" కవితల ద్వారా వరుసగా సృజనాత్మకత, సామాజిక బాధ్యత, ఆధ్యాత్మికతను ఆవిష్కరించారు.
రామాయణం ప్రసాదరావు "ఎండిన గడ్డి పూసనై", ఉప్పలపాటి వెంకటరత్నం "నీడ" (హరిత ప్రాముఖ్యత), పరాంకుశం కృష్ణవేణి "మోదుగపూలు" కవితలతో ప్రకృతి సోయగాలను ప్రతిబింబించారు. డాక్టర్ ఎం.ఎన్. బృంద "ఓ జానకమ్మా" గేయం, కాదంబరి కృష్ణప్రసాద్ "గానకోకిల" కవితలు గానసరస్వతి జానకమ్మకు అంకితమై శ్రోతలను అలరించాయి.
బి. నాగేశ్వరరెడ్డి రామాయణ పద్యాలు, బుక్కపట్నం రమాదేవి "నిచ్చెనమెట్లు" బాలసాహిత్య రచన, భోగెల ఉమామహేశ్వరరావు "పొద్దుగూకే వేళ" వృద్ధుల జీవన వాస్తవాలను ప్రతిబింబించే కవితలను వినిపించారు. మేడిసెట్టి యోగేశ్వరరావు "జడ", బలుసాని వనజ "పుడమితల్లి పులకరింత" గేయం, టి.వి. మాణిక్యలక్ష్మి "వెండి అంచు మబ్బులు", డాక్టర్ దేవులపల్లి పద్మజ "సాహిత్య విప్లవ శంఖం", కాకర్ల రమణయ్య "పల్లె జీవనం", బిటవరం శ్రీమన్నారాయణ "పరమ పూజ్యం" కవితలతో సభను రంజింపజేశారు.
చివరిగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ "చెప్పండి" కవితను పఠించి ఆలోచనాత్మక సందేశాన్ని అందించారు. "గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ పఠించిన ‘చెప్పండి’ కవిత సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆవేశం, భావం, లయ సమ్మిళితమైన ఈ కవిత శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. కవిత పూర్తికాగానే సభ కరతాళధ్వనులతో మార్మోగగా, పలువురు కవులు ప్రశంసించి కవిని అభినందించారు."
ఈ కవిసమ్మేళనాన్ని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మరియు బిటవరం శ్రీమన్నారాయణ సంయుక్తంగా సమర్థవంతంగా నిర్వహించారు. వారి చమత్కార వ్యాఖ్యానం, కవుల పరిచయాలు, సందర్భోచిత స్పందనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డాక్టర్ గీతా మాధవి సభను నిర్వహించటం చక్కగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపి సభను ముగించారు.
విభిన్న భావాలు, భిన్న ప్రక్రియలు, వైవిధ్యభరిత అంశాలతో సాగిన ఈ కవిసమ్మేళనం తెలుగు సాహిత్య వైభవాన్ని మరోసారి చాటిచెప్పింది. పాల్గొన్న కవులు, శ్రోతలు వీక్షణం నిర్వహిస్తున్న సాహిత్య సేవను అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వీక్షణం భారతీయ ప్రతినిధి,
హైదరాబాద్,
18-07-2026
Comments
Post a Comment