పూబాలల పొంకాలు 


మల్లెలా మత్తెక్కించు —

మమతల మకరందాలను మనసున నింపించు;

వెన్నెలవై వెలుగులు చిందించు —

విరహాల చీకట్లను చిరునవ్వుతో తరిమించు॥


మందారంలా మురిపించు —

మధురానురాగాలను మదిలో మొలిపించు;

అరుణోదయ కాంతివై మెరిసించు —

ఆశల ఆకాశాన్ని రంగులతో నింపించు॥


గులాబిలా మదిని తట్టు —

గుండె గూటిలో గుసగుసల గీతమై నిలిచిపో;

రేకుల్లాంటి సున్నితత్వంతో —

ప్రేమరాగాలను పరవళ్లు తొక్కించు॥


ముద్దబంతిలా మైమరిపించు —

ముద్దు పలుకులతో మురిపాల వర్షం కురిపించు;

బంగారు వెలుగులా విరబూసి —

బ్రతుకంతా బంధాల పండుగగా మార్చించు॥


సన్నజాజిలా వికసించు —

సన్నని నవ్వులతో సౌందర్యాన్ని చిందించు;

పరిమళపు పవనమై వీచి —

ప్రతి క్షణాన్నీ ప్రేమగీతంగా మార్చించు॥


చామంతిలా వయ్యారాలు చూపు —

చూపుల్లో చిలిపి చంద్రికలను నింపించు;

నిర్మల హృదయమై వెలిగి —

చెలిమి చిగురులను చిరకాలం కాపాడించు॥


కనకాంబరంలా కళకళలాడు —

కలల లోకానికి కాంతుల హారమవు;

బంగారు ఉదయమై వెలిగి —

బాధల మబ్బులను చిరునవ్వుతో చెదరగొట్టు॥


సంపంగిలా సౌరభాలు వెదజల్లు —

సన్నిధినంతా స్వర్గసీమగా మార్చివేయు;

ప్రేమ పరిమళమై పరవశింపజేసి —

ప్రాణాల పల్లకిలో నిత్యం విహరింపజేయు॥


పూలన్నిటి పరిమళమై —

ప్రేమకు ప్రాణవాయువై నిలిచిపో;

అందాలన్నీ ఒక్కటై —

అనురాగ చంద్రికవై నా ఎదలో వెలిసిపో॥


సకలసుమాల సోయగమై —

మమతల మాధుర్యమై మనసును హత్తుకో;

జీవితమనే పూలతోటలో —

నిత్యవసంతమై నా హృదయంలో విరిసిపో॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog