స్వర వెన్నెల కరిగిపోయె...
(గాన కోకిల ఎస్. జానకి స్మృతికి)
నీ మధుర స్వరము
ఏ వేకువ గాలిలో కలిసిపోయెనో!
నీ సంగీత నాదం
ఏ అనంత గగనంలో కలిసిపోయెనో!॥
మల్లెపూల పరిమళంలా
మనసుల గుమ్మాలపై జారిన నీ గానం,
కరుణామేఘంలా
మమతల వర్షం కురిపించేది.
నీ గుండె చప్పుడు ఆగిపోయినా,
నీ గానమాధుర్యం ఎన్నటికీ ఆగదు;
నీవు కనుమూసిన వార్తతో
తెలుగు గీతమే కన్నీటి రాగమై విలపించింది॥
ఏ తల్లి జోలలోనో అమృతమై ఊగావు;
ఏ విరహ హృదయంలోనో
కన్నీటి ముత్యమై మెరిసావు;
ఏ భక్తుని ప్రార్థనలోనో దివ్యనాదమై నిలిచావు.
రాగాలకు రూపముంటే అది నీవే;
భావాలకు స్వరముంటే అది నీ గళమే,
ఒక కోయిల నిశ్శబ్దమైంది; ఒక వెన్నెల నింగిలో లీనమైంది;
ఒక మధురనది అనంతసాగరంలో కలిసిపోయింది.
అయినా— పూలు వికసించిన వేళ నీ పాట వినిపిస్తుంది;
వేకువ విరిసిన వేళ నీ స్వరం పరిమళిస్తుంది;
తెలుగు హృదయం కొట్టుకునేంత వరకు
నీ గానం చిరంజీవిగానే నిలుస్తుంది.
స్వరాల ఆకాశంలో
నీవిప్పుడు శాశ్వత నక్షత్రానివి;
భూమి కన్నీటితో వీడ్కోలు పలికినా,
సంగీతం నిన్నెన్నడూ వీడదు.
వెళ్లిరా గాన కోకిలా...
వెలుగుల లోకాలకు వెళ్లిరా...
ఇక్కడ మిగిలిన ప్రతి హృదయం
నీ పాటలతోనే నిన్ను పిలుస్తూనే ఉంటుంది.
తెలుగు పాట ఉన్నంత వరకు
నీ స్వరం చిరంజీవిగా నిలుస్తుంది;
సంగీతం ఉన్నంత వరకు
నీ స్మృతి సజీవంగా వెలుగుతుంది॥
స్వర సరస్వతీ! గాన తపస్వినీ!
నీకు మా అశ్రుపూర్వక శ్రద్ధాంజలి,
నీవు నిశ్శబ్దమైనా— నీ గానం నిత్యనూతనమే,
నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ—
నీ గానామృతానికి శతకోటి ప్రణామాలు॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment