తెలుగుతల్లికి అక్షరహారతులు


రాయిద్దాం...

రసరమ్యమైన భావాల్ని రాయిద్దాం,

రాగాల్లా హృదయాలను తాకే

రత్నాలాంటి రచనల్ని రాయిద్దాం.


చదివిద్దాం...

చదువును చైతన్యంగా మలిచే 

గ్రంథాలను చదివిద్దాం,

చీకట్లను చీల్చే జ్ఞానజ్యోతిని వెలిగిద్దాం.


పొగుడుదాం...

పదాలను కాదు – పదునైన భావాలను;

కవిని కాదు – కవిత్వ సాధనను;

ప్రతిభ వికసిస్తే ప్రపంచమే పరవశిస్తుందని చాటుదాం.


ప్రోత్సహిద్దాం... 

మొగ్గలోనే ఉన్న ప్రతి కలాన్ని,

మొదటి అడుగులు వేస్తున్న ప్రతి కవిని,

ఒక చప్పటితో, ఒక చిరునవ్వుతో, ఒక అభినందనతో ఆకాశానికెత్తుదాం.


సభకు పిలుద్దాం...

అక్షరాభిమానులందరినీ, సాహిత్యసేవకులందరినీ,

భావసుమాల పరిమళాలు వెదజల్లే

సాహిత్య వేదికపైకి ఆహ్వానిద్దాం.


మాట్లాడుదాం...

మనసులను మమతతో కలిపే మాటలు,

మనుగడకు మార్గం చూపే మాటలు,

మానవత్వాన్ని మేల్కొలిపే సందేశాలను పంచుదాం.


సత్కరిద్దాం...

సంపదను కాదు – సంప్రదాయాల్ని,

పదవిని కాదు – కవిత్వ ప్రతిభను;

కీర్తిని కాదు – కర్తవ్యనిష్ఠను, సాహిత్యసేవను శిరసావహిద్దాం.


మదిలో నిలుపుకుందాం...

మంచి మాటలను,

మధురమైన కవితలను,

మహోన్నత రచయితలను, మానవతా విలువలను.


ఎందుకంటే...

అక్షరం విత్తనమైతే ఆలోచన వృక్షమవుతుంది,

కలం కదిలితే కాలమే దానికి సాక్షిగా నిలుస్తుంది,

సాహిత్యం శ్వాసిస్తే సంస్కృతి శాశ్వతంగా వెలుగుతుంది.


అందుకే...రాయిద్దాం! చదివిద్దాం!

పొగుడుదాం! ప్రోత్సహిద్దాం! 

సభకు పిలుద్దాం! మాట్లాడుదాం! 

సత్కరిద్దాం! మదిలో నిలుపుకుందాం!


అక్షరమే మన ఆభరణం...

సాహిత్యమే మన సంస్కారం... 

కలమే మన ఆయుధం... తెలుగు భాషే మన ప్రాణం...

తెలుగుతల్లికి అక్షరహారతులు అర్పిద్దాం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog