కవినైతే... నా కవితలే చెబుతాయి!
కవినని ఇల్లెక్కి కూయను,
కొండెక్కి చెప్పను;
వేదికెక్కి వినిపించను,
వీధుల్లో విర్రవీగను॥
కవినని పత్రికల్లో ప్రకటించను,
పద్యాలలో పేర్కొనను;
గొంతెత్తి గర్జించను,
గుండెల్లో చోటు అడగను॥
కవిగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను,
కొంగొత్త భావాలను వెల్లడిస్తాను;
కలాలను కదిలిస్తాను,
కలలను కవితలుగా మారుస్తాను॥
కవిగా పాఠకుల మన్ననలు పొందుతాను,
పలువురిని పరవశింపజేస్తాను;
తోటి కవులను తోడుతెచ్చుకుంటాను,
తెలుగు తోటను పూలతో నింపేస్తాను॥
కవిగా తెలుగుజాతికి తెలియజేస్తాను,
తెలుగు తల్లి తేజాన్ని చాటుతాను;
విశ్వానికి వినిపిస్తాను,
తెలుగు వైభవం చాటుతాను॥
కవిగా వాణిపుత్రుడనై గర్విస్తాను,
వాక్సుధను విరజిమ్ముతాను;
అక్షరాల అంబరంలో విహరిస్తాను,
అమర దీపమై వెలిగిపోతాను॥
కవిగా — కవిత్వమే నా కులమంటాను,
కలమే నా బలమంటాను;
భావమే నా భాషంటాను,
ప్రేమే నా పరమార్థమంటాను॥
కవిగా పొగడ్తల కోసం పాడను,
పేరుకోసం పరుగెత్తను;
పదిమందిలో వెలుగునింపుతాను,
ప్రజ్వలించే దీపమై దారిచూపుతాను॥
కవినని నేనే చెప్పుకోను —
నా కవితలే ప్రపంచానికి చెబుతాయి;
నా పేరు కాదు చిరస్థాయి —
నా రచనలే కలకాలం నిలిచిపోతాయి॥
ఓ కవి అంటాడు —
"నన్ను నేనే చెప్పుకోకపోతే నన్నెలా గుర్తిస్తుంది లోకం?"
ఓ పాఠకుడు అంటాడు —
"మంచికవిని ప్రోత్సహించడం చదువరుల ధర్మం!"
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment