Posts

Showing posts from August, 2026
Image
 వర్షం మబ్బుల మదిలో మధురమైన మౌనమై మెరుపుల పెదవిపై వెండి దరహాసమై చినుకుల చేతిలో చిలిపైన తాళమై వర్షం వసుధకు వరమై కురిసె ఎండల ఎడారికి ఎర్రని ఆశై ఎండిపోయిన నేలకు పచ్చని శ్వాసై వాడిన వృక్షాలకు జీవపు జల్లై వర్షం కురిసెను వసంతం వలె! చెట్టు కొమ్మల్లో చిలకల పాటలు చెరువు గట్టుల్లో అలల ఆటలు మట్టి పరిమళం మదిని మైమరపించగా చినుకుల సవ్వడి సంగీతమయ్యె! గుడిసె కప్పుపై గలగల పాటై గుమ్మం ముందర గువ్వల ఆటై వాకిలి దాటే పిల్లల నవ్వై వర్షం ఆనందమై నిండె రైతన్న కళ్లలో వెలిగే కలగా పొలాల గుండెలో పండే పంటగా విత్తనాల నడుమ మొలకై ఎదిగి వర్షం జీవన గీతంగా మారె ప్రేమిక హృదయంలో తీయని జ్ఞాపకమై విరహి గుండెలో కన్నీటి బిందువై కవితా హృదయంలో భావాల ప్రవాహమై వర్షం మధురకావ్యమై విరిసె ఆకాశం భూమికి పంపిన లేఖలా మేఘం మనసుకు పలికిన మాటలా చినుకు చినుకుగా జారే కవితలా వర్షం ప్రకృతి ప్రేమగా కురిసె వర్షమా! నీవొస్తే వసుధ నవ్వుతుంది వనమంతా కొత్త చిగుర్లు తొడుగుతుంది మనసంతా మళ్లీ బాల్యమవుతుంది నీ జల్లులో జీవితం పులకిస్తుంది వర్షమా! దయచూపు — పొలాలు తడుపు పంటలు పండించు — పొట్టలు నింపు గొంతులు తడుపు — చల్లదనము ఇవ్వు అందాలు చూపు — ఆనందాలు అందిం...
Image
 రంగులు  మనసులను పరవశపరచుటకు చల్లేదా రంగులు  నేత్రాలను ఆకర్షించుటకు చూపేదా రంగులు    వాడిపోయిన జీవితాలకి మధుమాసాన్ని తెచ్చి  విరిసిన ఆశల పూదోటకు వేసేదా రంగులు  చీకటిలో చిక్కుకున్న ప్రాణులకు వెలుగై నిలిచి చిరునవ్వులు పెదవులపై పూయించేదా రంగులు కళాకారుని చేతికుంచెకు కదలికను అందించి  కాన్వాసుపై బొమ్మలకు అద్దించేదా రంగులు ప్రకృతమ్మ ఒడిలో పచ్చదనం కాపాడి పెంచి  అందాలు చూపించటానికి చిమ్మేదా రంగులు  మనుషులలోని మంచితనానికి కిరీటాన్ని పెట్టి  మానవత్వపు పతాకానికి పులిమేదా రంగులు  కన్నీటితో తడిసిన కన్నులకు ఓదార్పునిచ్చి కలతలను కడిగివేసేలా దిద్దేదా రంగులు పండుగలేని గడపలకు ఆనందం పంచిపెట్టి  ప్రతి ఇంటి ముంగిళ్లలో మెరిపించేదా రంగులు  రాజేంద్రుని కలమునుండి కారే అక్షరాలతో  రసహృదయుల గుండెలనందు నింపేదా రంగులు   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 గిడుగు — తెలుగు వెలుగు గ్రాంథిక గోడలు కూల్చి వ్యావహారిక భాషను నడిపినవాడు గిడుగు ప్రజల నోట పలికే భాషే తెలుగు భాషకు ప్రాణమని చాటినవాడు గిడుగు పండితుల పుటలలో బంధించిన పలుకులను ప్రజల చెంతకు తెచ్చినవాడు గిడుగు సామాన్యుని మాటకు సాహిత్య గౌరవం సమకూర్చిన భాషా విప్లవ వీరుడు గిడుగు గిడుగు! నీ కలం కదిలితే తెలుగు తల్లి మురిసిపోయింది; నీ మాట మోగితే మూగబోయిన ప్రజల గొంతు పలికింది! గిడుగు! వ్యావహారికమే జీవభాష అని వాదించి కాదు—విప్లవించి చూపావు తెలుగు పలికే ప్రతి మనిషిలో తెలుగు తల్లిని దర్శింపజేశావు! గిడుగు! అక్షరజ్ఞానం లేనివాడికీ అర్థమయ్యే భాష కావాలన్నావు విద్య కొందరి సొత్తు కాదని విద్యకు ప్రజల బాట చూపావు! గిడుగు! శబ్దాల వెనుక దాగిన భాషను శ్వాసల మధ్యకు తెచ్చినవాడివి పుస్తకాల పుటల నుంచి తెలుగును ప్రజల పెదవులపై నిలిపినవాడివి! గిడుగు! నేడు మనం పలికే ప్రతి మాటలో నీ పోరాట ప్రతిధ్వని ఉంది నేటి తెలుగు స్వేచ్ఛా స్వరంలో నీ శ్రమకు సార్థకత ఉంది! గిడుగు! భాష బతికితే జాతి బతుకుతుంది— అని నీ జీవితం చెప్పింది; ప్రజల భాషే తెలుగు భాష— అని నీ ఉద్యమం చాటింది! గిడుగు! నీవు వెలిగించిన దీపం తరతరాలకు వెలుగునిస్తుంది తెల...
Image
 ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మహాభాగ్యమని  అందరూ తెలుసుకొని చాటాలి ఆరోగ్యదీపం జీవితమంతా  వెలుగులు చిమ్మేలా చూడాలి  ధనరాశులెన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే అంధకార కూపంలా జీవితం మిగులుతుంది ఆరోగ్యమనే సంపద తోడుగా ఉంటే ప్రతి అడుగూ ఆనందాల పండుగై సాగుతుంది పోషకాహారమే దేహానికి ప్రాణధారం కావాలి పండ్ల పరిమళాలతో, కూరల పచ్చదనంతో ఆరోగ్యపు వనాన్ని నిత్యం పెంచుకోవాలి శరీరమనే గుడిని పవిత్రంగా కాపాడుకోవాలి అతి తీపి, అతి ఉప్పు రుచులకు బానిస కాకుండా కొవ్వు పదార్థాల వలలో చిక్కుకోకుండా స్వచ్ఛమైన అమృతంలాంటి నీరు తాగుతూ ఆరోగ్యసిరులను ఒడిసిపట్టుకోవాలి ఉదయభానుడి కిరణాలతో మేల్కొని ఉత్సాహపు అడుగులతో వ్యాయామం చేయాలి నడకనే నేస్తంగా చేసుకొని నిత్యం సాగించి  నరనరాన కొత్త శక్తిని నింపుకోవాలి సమయానికి ఆహారం, సమయానికి నిద్ర జీవన గమనానికి క్రమశిక్షణ కావాలి స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యవీణకు మధురమైన స్వరాలు కావాలి పొగమంచులా కమ్ముకునే పొగతాగడాన్ని వీడి మత్తు మాయలో ముంచే మద్యానికి దూరంగా ఉండాలి  దేహాన్ని దహించే చెడు అలవాట్లన్నిటినీ  జీవితంలోకి చేరనీయకుండా జాగ్రత్త పడాలి మనసుపై పేరు...
Image
ఓ చంద్రముఖీ! తుంటరి చూపులతో కొరక్కుతినకే చంద్రముఖీ  కనుల సైగలతో రమ్మని పిలవకే చంద్రముఖీ  చెంతకుచేరి చేతులను కలిపి చతుర్లలో ముంచి   మాటలలో ముంచి మంటలురేపకే చంద్రముఖీ  తెల్లనిచీరనుకట్టి బంగారు నగలను ధరించి  అందాలు చూపి ఆటలాడించకే చంద్రముఖీ   పలురంగుల గాజులు వేసుకొని గలగలలాడించి  ఆనందం ఆశించి ఊరించకే చంద్రముఖీ  ఆకాశానికి తీసుకెళ్ళి ఉయ్యాల ఎక్కించి  ఊపులతో ఉక్కిరిబిక్కిరి చేయకే చంద్రముఖీ  సిగ్గులు చిందించి మెడపట్టి బుగ్గలను తడుముతూ  ముద్దులలో ముంచేసి మురిపించకే చంద్రముఖీ  ముచ్చటగా తయారై గజ్జెల చప్పుడులు చేస్తూ  విరహంలో పడవేసి వేదించకే చంద్రముఖీ  మరుమల్లెలు కొప్పులో తురుముకొని పున్నమిరోజున  వెన్నెలలో విహారముకు రమ్మనకే చంద్రముఖీ  ముసిముసినవ్వులు ఒలకబోస్తూ చిలిపి చేష్టలతో  వయ్యారాల వలపువలను విసరకే చంద్రముఖీ  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 కళారత్న బిక్కి కృష్ణ ఎన్నో విజయాలు సాధించాడు మన బిక్కి కృష్ణ  ఎన్నో సభలు నిర్వహించాడు మన బిక్కి కృష్ణ   సభాసామ్రాటు, కళారత్నగా పేరు పొందాడు  ఎన్నో సన్మానాలు పొందాడు మన బిక్కి కృష్ణ  లయాత్మకంగా భావాత్మకంగా రంగరిస్తూ  ఎన్నో గొప్పకవితలు వ్రాశాడు మన బిక్కి కృష్ణ  ఎందరో యువకవులను తట్టి ప్రోత్సాహమిచ్చాడు  ఎన్నో సత్కారాలు చేశాడు మన బిక్కి కృష్ణ  తన జీవిత అనుభవాలను అక్షరాలలో పెట్టాడు  ఎన్నో పుస్తకాలు రచించాడు మన బిక్కి బిక్కి కృష్ణ  ఎందరో కవనప్రేమికుల సహకారం తీసుకొని  ఎన్నో సంస్థలను స్థాపించాడు మన బిక్కి కృష్ణ  సాహితీలోకాన దృవతారగా వెలుగుతున్నాడు  ఎన్నో హృదులు దోచుకున్నాడు మన బిక్కి కృష్ణ  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 కదలాలి పేజీల నింపుటకై కలాలు కదలాలి బొమ్మల అందాలకై కుంచెలు కదలాలి రాగాల మధురిమకై గళాలు ఎత్తాలి కవితల కూర్పుకై అక్షరాలు కదలాలి అర్థాల వెలుగులకై పదాలు మెరవాలి ఉల్లాస ఊపులకై ఊహలు కదలాలి కల్పనలు పూయుటకు భావాలు పుట్టాలి గమ్యాల చేరుటకై పాదాలు కదలాలి జలాశయాల నింపుటకు నదులు పారాలి కాలగమనముకు గడియారాలు కదలాలి చీకట్లు తరుముటకై దీపాలు వెలగాలి జగతి వెలుగుకై రవికిరణాలు కదలాలి ప్రేమలను పంచుటకై హృదయాలు మెదలాలి మానవతను నిలుపుటకై మనసులు కదలాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 పూలు పూయిస్తా ప్రేమలో దించేందుకై మల్లెపూలు పూయిస్తా మత్తులో ముంచేందుకై మొగిలిపూలు పూయిస్తా ప్రకృతి అందాలు పలువురికి పంచుటకు తిరుగుతూ పథమంతా చూపుటకు గులాబిపూలు పూయిస్తా అంతరంగాలను తాకే అనురాగం నింపుతూ మోముల నవ్వులకై చామంతిపూలు పూయిస్తా తీయతీయని అనుభూతుల తేనియలను పంచుతూ మకరందమును గ్రోల మందారపూలు పూయిస్తా పల్లె పడతుల మనసు పరవశింపజేస్తూ రంగులను వెదజల్లే బంతిపూలు పూయిస్తా రమణీమణుల మస్తకాలు రంజింపజేయాలని జడలో తురుముటకు కనకాంబరపూలు పూయిస్తా మురికివాడల నివాసుల మనసులు మురిపించుటకై  సౌరభాలు వీచే సంపంగిపూలు పూయిస్తా ఇంటి దొడ్లలో నాటించి పందిరులను కట్టించి మాలలు అల్లుటకు సన్నజాజిపూలు పూయిస్తా దేవాలయాలు దర్శించి దైవాన్ని కొలిచేందుకు చిదాత్మ పూజకై పారిజాతపూలు పూయిస్తా — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 అక్షరాల అర్పణ  ఏరి కోరి పేర్చి కూర్చి అందిస్తా అక్షరాలు వెతికి వేటాడి బాగా అమరిస్తా అక్షరాలు  గుండ్రని ముత్యాల్లా ఖరీదైన నవరత్నాల్లా ఒకదానికి మరొకటి చేర్చి అతికిస్తా అక్షరాలు  మెత్తగ పిండిచేసి మట్టిముద్దల్లా కలగలిపి పేజీలపై పూసి రాసి అలికిస్తా అక్షరాలు  అర్థవంతమైన మాటలను చక్కగా ఎన్నుకొని పదాలలో పంక్తుల్లో అంటిస్తా అక్షరాలు పరిమళాలు వెదజల్లి మత్తులో ముంచి తూగించి అందాలను చిందేలా  ఆడిస్తా అక్షరాలు ముచ్చటైన విషయాలను ముందుంచవలెనని తలచి చదువరులకు వినయంగా అర్పిస్తా అక్షరాలు భావాలు కురిపిస్తూ కవనగంగను పారిస్తూ సాహితీప్రియులకు అంకితమిస్తా అక్షరాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
ఆకాశం  చూడటానికి చాలా చక్కనైనది ఆకాశం  ఆస్వాదనకు అతి ఆనందమైనది ఆకాశం  నేత్రాలకు విందునిచ్చి అంతరంగాలను దోచి కాంచటానికి అధిక విచిత్రమైనది ఆకాశం  విశ్వానికి వింతై గ్రహాలను ఒడిలో దాచుకుని ఙ్ఞానానికి తావై విలాసమైనది ఆకాశం  మేఘాలకు ఆవాసమై గాలులకు స్థావరమై  వివిధ రంగులతో విలక్షణమైనది ఆకాశం  జాబిలికి చోటిచ్చి చల్లదనంతో తృప్తిపరచి  వెన్నెలను వెదజల్లు అద్భుతమైనది ఆకాశం  పగలైనా రాత్రైనా వానైనా ఎండైనా  మదుల దోచు ఆకర్షణీయమైనది ఆకాశం   తాకటానికి అందనిది చేరుటకు కష్టమైనది ఆద్యంతాలు లేక అనంతమైనది ఆకాశం  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నా డప్పు నేను కలాన్ని పట్టిన చేతిని, భావాలను కదిలించే శక్తిని, నేను కాగితంపై ఒలికే కవితా గంగను! నేను ప్రశ్నను, నేను జవాబును, నేను మార్పుకు తొలి అడుగును, నేను చీకటిలోని చిరుదీపాన్ని, నేను వెలుగువైపు నడిపే బాటను! అన్యాయం ఎదురైతే అక్షరమై నిలబడతాను, అవమానం ఎదురైతే ఆత్మగౌరవమై ఎదురుతిరుగుతాను! ఆకలి కేక వింటే అక్షరమై అన్నమవుతాను, అశ్రువులు కనిపిస్తే ఆదరణగా మారుతాను! నేను గళాన్ని, నేను వాణిని, నేను జనహృదయ స్పందనని, నేను పలికేది పదం కాదు— ప్రజల గుండెల స్వరాన్ని! నన్ను ఆపగలరా? అక్షరానికి సంకెళ్లు వేయగలరా? నన్ను మూయగలరా? సత్యానికి స్వరం లేకుండా చేయగలరా? నా కలమే నా కత్తి, నా కవితే నా కవచం, నా సాహిత్యమే నా శ్వాస, నా అక్షరమే నా ఆయుధం! నేను కవిని— కలలను నిజం చేసే కలాన్ని! నేను రవిని— మనసులను వెలిగించే వెలుగుని! నేను గళాన్ని— జనంలో వినిపించే పాటను! నేను వాణిని— సమాజానికి సందేశాన్ని! నా డప్పు మోగేది నా కోసమే కాదు—నిద్రిస్తున్న మనసుల్ని మేల్కొల్పడానికి! కీర్తి కోసం కాదు— కదలని సమాజాన్ని కదిలించడానికి! శబ్దం కోసం కాదు— సత్యం వినిపించడానికి! అక్షరం నా ఊపిరైతే— కవిత నా జీవితం! ఆ కవితకు స్వరమిస్తే— నా ...
Image
 నిద్ర నిద్రపోతే హాయి, నిద్రలేస్తే హాయి నిద్రపుచ్చితే హాయి, నిద్రవస్తే హాయి నిద్రపిలిస్తే హాయి, నిద్రముంచితే హాయి నిద్రవడిలో జారితే నిండుగానే హాయి నిద్రలో తూగితే తనువంతా హాయి నిద్రలో కలలుకంటే కనులంతా హాయి నిద్రాదేవి కరుణిస్తే మనసంతా హాయి నిద్రలో విహరిస్తే లోకమంతా హాయి నిద్రాలోలుడైతే కునుకే మధురం నిద్రాభీరువైతే రేయే దుర్భరం నిద్రాభిలాషికి పాన్పే స్వర్గం నిద్రాకాంక్షికి కునుకే భాగ్యం నిద్రామత్తుడైతే లోకమే మరుపు నిద్రావిహీనుడైతే జీవితమే అలుపు నిద్రాధికుడైతే సమయమే జారును నిద్రాప్రియుడైతే కలలే చేరును నిద్రమత్తమైన కనులలో హాయి నిద్రరాని రేయిలో భయం నిద్రలేమితో కలతలెన్నో నిద్రవల్లనే సుఖాలెన్నో అలసిన దేహానికి నిద్రే ఔషధం కలతల మనసుకు నిద్రే అమృతం రాజైనా బంటైనా నిద్రలో సమానమే పేదైనా ధనికైనా కునుకులో ఒకటే పసిబిడ్డ నవ్వులో నిద్రకే అందం పండు వయసులో నిద్రకే సౌఖ్యం నిద్రలేచిన వేళ నూతనోత్సాహం నిత్యజీవితానికి నిద్రే ఆధారం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఓ మనసా! తట్టవే శిరసును చక్కని ఆలోచనవై ముట్టవే మనసును తియ్యని ఆలోచనవై సౌఖ్యాలను లోకంలో అనుభవించేలా  కట్టవే కాసుల మూటని ఆలోచనవై కడుపులోని ఆకలి మంటలను ఆర్పేలా పెట్టవే పెళ్ళి వంటలని ఆలోచనవై చితికిచిట్లిన బ్రతుకుని దారికి తెచ్చేలా కుట్టవే అతుకుల బొంతని ఆలోచనవై నీలి గగనంలో జాబిలిలా వెలిగేలా పట్టవే కీర్తి ప్రతిష్ఠని ఆలోచనవై అంధకారాన్ని తరిమేసే ప్రకాశంలా నెట్టవే చెడ్డ గుణములని ఆలోచనవై పరుగెడుతున్న ప్రపంచాన పయనించేలా చుట్టవే భూఖండాలని ఆలోచనవై గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 గజల్ సౌందర్యం తెలుగు గజల్ సౌందర్యం పాఠకులకు అందిస్తా  గొప్ప గజల్ మాధుర్యం సువ్రతులకు అందిస్తా  పారసీ నుంచి మనకొచ్చిన గానయోగ్య ద్విపదల తెనుగు గజల్ విశిష్టతలను ఎల్లరకు అందిస్తా ప్రారంభంలోనే మనసుల తట్టే పంక్తులుగా  మత్లాలను మొదట గజల్  ప్రేమికులకు అందిస్తా చెవులు విప్పి అతి శ్రద్ధగా ఆలకించే వారికి మక్తాలను చివర గజల్ ప్రేరకులకు అందిస్తా ముచ్చటైన మాటలను లయాత్మకంగా అమర్చుతూ షేర్ల ద్విపాద నడకలను ఆంధ్రులకు అందిస్తా  మంచి పదాలను మరలమరల వినాలనే వారికి రదీఫులను రమ్యంగా రసజ్ఞులకు అందిస్తా  మాత్రలు సరిగకుదిరేలా అంశానికి అనువుగా కాఫియాల ఏరి పొదిగి గాయకులకు అందిస్తా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 రాయాలని నాకున్నది  మనసులోని ఊహలను లిఖించాలని నాకున్నది  గుండెలోని భావాలను చెప్పాలని నాకున్నది  కొండా కోనలల్లో కలియతిరిగి కాలం గడిపి చూచిన దృశ్యాలను వర్ణించాలని నాకున్నది  హృదయాన్ని ఉయ్యాలలూగించి ఉప్పొంగించగ   పొందిన అనుభవమ్ములను తెలపాలని నాకున్నది  పిల్లల తడబడు అడుగులు చూచి ముద్దు మాటలు విని పసిపాపల మోములను ముద్దాడాలని నాకున్నది  పున్నమి వెన్నెలలో విహరించి తోటలలో తిరిగి  ప్రకృతి రమణీయతలను కాంచాలని నాకున్నది  ప్రేమానురాగాలు పంచి సిగ్గుతో తలవంచిన  పడచుల ఎర్రబుగ్గలను చూడాలని నాకున్నది  కోకిల కంఠము విని కుహూకుహూ రాగాలు తీసి కమ్మని స్వరాలను ఆలపించాలని నాకున్నది  హంస నడకలను చూచి మయూరి నృత్యాలను కాంచి కూచిపూడి డాన్సు ప్రదర్శించాలని నాకున్నది  అక్షరాలను అల్లి పదపుష్పాలను పూయించే  మహాకవుల కవనాలను చదవాలని నాకున్నది  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 చేసుకో నిండు నూరేళ్ళ జీవితాన్ని బంగారం చేసుకో నిత్యం వదలక దేహాన్ని సింగారం చేసుకో శ్రేయోభిలాషుల సేవలను మనసారా గౌరవించు పని ప్రావీణ్యుల గుర్తించి సత్కారం చేసుకో చెలియ చెంతనున్న వేళలో చింతలను మరిచిపో చల్లని పున్నమి వెన్నెలలో విహారం చేసుకో సర్వదా తోడుగా నిలిచే వారిని ఆదరించు కలిసొచ్చే స్నేహితులతో సహకారం చేసుకో ఇబ్బందులు కలిగిస్తే విచారం వ్యక్తపరచు చేసిన తప్పులు దిద్దుకొని సంస్కారం చేసుకో పచ్చని పుడమి ప్రకృతిని కనులారా తిలకించు అందాల పూలతోటలో సంచారం చేసుకో సాయం చేసిన మనసులను ఎప్పటికినీ మరువకు అపకారులకు సహితం కోరి ఉపకారం చేసుకో గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 మూడు గంటలు ముచ్చటగా జరిగిన కాలిఫోర్నియా వీక్షణం గవాక్షం 168వ అంతర్జాల సమావేశం ************************************************ నేడు 15వ తేదీ ఆగష్టు 2026, శనివారం, కాలిఫోర్నియా వీక్షణం సాహితీ సమావేశం ముచ్చటగా మూడు గంటలు జరిగింది. మొదట వీక్షణం వ్యవస్థాపుకురాలు మరియు అధ్యక్షురాలైన డాక్టర్ గీతా మాధవి స్వీయ పరిచయం చేసుకోబోతున్న కవులు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మికి, బిటవరం శ్రీమన్నారాయణకి, కవిమిత్రులకు మరియు సాహీత్యాభిమానులకు ఆహ్వానం పలికి సమావేశాన్ని ప్రారంభించారు. పిమ్మట వీక్షణం భారతదేశ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ చీదెళ్ళ సీతాలక్ష్మిని సభకు పరిచయం చేసి వారి జీవితం గురించి, సాహిత్య ప్రస్థానం గురించి, వారి రచనల గురించి మరియు యువ కవులకు సూచనలు ఇవ్వమని కోరారు.  డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి కరెంటు కూడా లేని పల్లెలో పుట్టి, గుడ్డి దీపం కింద చదువుకుని పైకొచ్చానన్నారు. అన్ని క్లాసులలోనూ ప్రథమురాలుగా వచ్చేదానినని చెప్పారు.  మిగతా సమయాన్ని లైబ్రరీలో గడిపేదాన్నని అన్నారు. శ్రీశ్రీ, దివాకర్ల, దాశరథి వంటి మహాకవుల ఉపన్యాసాలు విని సాహిత్యంపై అభిలాషను పెంచుకున్నానన్నారు.ఛందోబద్ధ పద్...
Image
 నెచ్చెలితో సరసాలు తొందరగా చెంతకు రమ్మని పిలవనా నెచ్చెలిని  సరససల్లాపాలాడి నవ్వించనా నెచ్చెలిని   కబుర్లలో దించి కవ్వించి కుతూహలపరచనా తేనెపలుకులు చిందుతూ అలరించనా నెచ్చెలిని  అందాలు చూపించి ఆనందాలు అందించనా కమ్మనైన మాటలతో ఊరించనా నెచ్చెలిని  బాధలను మరిపించనా కోపాన్ని తగ్గించనా ఓదార్చి ఒప్పించనా లాలించనా నెచ్చెలిని  ఆకాశానికెత్తి తారకల మధ్యన తిప్పించి అలకపానుపును దింపి బుజ్జగించనా నెచ్చెలిని   చేతులను పట్టుకొని వెన్నెలలో విహరింపజేసి మల్లెల మత్తులో దింపి మురిపించనా నెచ్చెలిని  ఆటలు ఆడించి నెమలిలాగా నాట్యమాడించి రసరాగాలతో రంజింపజేయనా నెచ్చెలిని  మనసును దోచుకొని మమతా మోహాలు పంచినందుకు ప్రేమదేవతలాగ ఆరాధించనా నెచ్చెలిని  కళ్లను కట్టిపడవేసి కోర్కెలు రేకెత్తించే అపురూప అందాన్ని అభినందించనా నెచ్చెలిని” గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 విందులు  ఎదురుచూస్తున్న నేత్రాలకు కనులవిందు ఇవ్వనా  వెతుకుతున్న శ్రవణాలకు వీనులవిందు ఇవ్వనా  నిత్యం చెమటచుక్కలు కార్చే శ్రామిక జీవుల వేసారిన హృదయాలకు మనోవిందు ఇవ్వనా పగటికలలు కంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్న  రసికుల రంజింపజేయుటకు రసవిందు ఇవ్వనా  స్వాతిచిప్పల్లా చినుకులకై కాచుకొనిచూస్తున్న పాఠకుల మురిపించుటకు కవితావిందు ఇవ్వనా  తెలుగుభాషా తియ్యందనాలకు తడుముకుంటున్న  సాహితీ అభిమానులకు అక్షరవిందు ఇవ్వనా   కబుర్లకోసమని కలవరపడుతున్న చిన్ననాటి మిత్రుల ముచ్చటపరచుటకు స్నేహవిందు ఇవ్వనా  అందాల దృశ్యాలుచూసి ఆనందం కోరేటి ప్రకృతి ప్రియుల ప్రీతికి భావాలవిందు ఇవ్వనా  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
సాగదీస్తా  మనసును  ముట్టితే విషయాల్ని సాగదీస్తా  హృదిని తట్టితే అంశాల్ని సాగదీస్తా    కవిత కలలోకొచ్చి రాయమని కవ్విస్తే  ఊహలూరితే సంగతాల్ని సాగదీస్తా  పుష్పాలు విచ్చుకొని పరిమళాలు చల్లితే  భావాలు కూరితే వివరాల్ని సాగదీస్తా   చిరునవ్వులు చిందితే వదనాలు వెలిగితే  అక్షరాలా వ్యవహారాల్ని సాగదీస్తా  స్నేహితులు చెంతకొచ్చి సమయాన్ని అడిగితే  పదాలతో ప్రస్తావనాల్ని సాగదీస్తా  నా పుస్తకాలు కొని చదివి సంతసపడితే  పాఠకులు కొరకు ప్రకరణాల్ని సాగదీస్తా   శారదాంబ నన్ను కరుణించి వరాలిస్తే  వాణీదేవి వృత్తాంతాల్ని సాగదీస్తా  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 అందాలు (గజల్) మదిలోన ఆలోచనలు పారితే అందం  పేజీలపై భావాలు కూరితే అందం  కర్షకులు వర్షాలకై ఎదురుచూస్తుంటే  నింగిలో నీలిమబ్బులు కమ్మితే అందం కొమ్మలు తొడిగి పైకెదిగి ఆకులు చిగురించి  తోటలో మొక్కలు పూలుపూచితే అందం  కన్న కలలు ఫలించి ఆశలు నెరవేరితే  మోములపై చిరునవ్వులు ముసిరితే అందం  కప్పలు అరుస్తుంటే చినుకులు పడుతుంటే  ఏటిలోన నీటి జాలు సాగితే అందం  చల్లని గాలి వీచి సంబరపరుస్తుంటే   కడలిలో కెరటాలు ఎగిసిపడితే అందం  ప్రకృతి పులకించి పరవశపరుస్తుంటే  భువిలోన పచ్చచెట్లు మొలిచితే అందం  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రావే చెలియా! (గజల్) పట్టుచీర కట్టుకోని పక్కకురావే చెలియా  సరస సల్లాపాలాడ చెంతకురావే చెలియా   అందంగా తయారయి ఆనందం చేకూర్చగా  ముద్దూ ముచ్చట్లకొరకు ముందుకురావే చెలియా   పల్లెటూరి పడచులాగ పరువాల పడతిలాగా  నేతచీర చుట్టుకొని ఎంకిలా రావే చెలియా  వసంతమాసంలా పున్నమిజాబిలి వెన్నెలలా  మల్లెలు కొప్పులో తురుముకొనిరావే చెలియా  సిగ్గులు బుగ్గలొలుకుతూ సింగారాలు చూపుతూ  చలాకీ నవ్వులు చిమ్ముకుంటూరావే చెలియా  తెలుగింటి తరుణిలా తేనెపలుకులు చల్లుకుంటూ చందనపు బొమ్మలాగ చకచకారావే చెలియా  మనసువిప్పి మాటలాడ హృదయాన్ని దోచేలా   పరిమళాలు చల్లుతూ పువ్వులా రావే చెలియా  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 వెలుగులు (గజల్)  ఇల్లాలు తిరుగుతుంటే ఇంటికే వెలుగురా  పిల్లలూ ఆడుతుంటే కంటికే వెలుగురా   విహారానికి పిలుస్తూ వెన్నెలను చల్లుతూ   జాబిలి చరిస్తుంటే మింటికే వెలుగురా  పకపకా నవ్వుతూ పసిపాప నోరు తెరుస్తూ   తళతళా లాడుతుంటే పంటికే వెలుగురా  అందాలు చూపుతూ ఆనందం కలిగిస్తూ  మిలమిలా మెరుస్తుంటే వంటికే వెలుగురా  గలగలా మాట్లాడుతూ చిరుగంతులు వేస్తూ  నవ్వులూ చిందుతుంటే చంటికే వెలుగురా  అమ్మ ప్రేమ చల్లగా ఇల్లంతా నింపితే    ఆప్యాయతల సౌరభం గూటికే వెలుగురా॥   సత్యమనే మాటలను మనసారా పలికితే    మంచితనపు మాధుర్యం నోటికే వెలుగురా॥  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం. 
Image
 ఎంచుకో? (గజల్) అయ్యిందా అరుణోదయం వెలుగులబాట ఎంచుకో అయ్యిందా చంద్రోదయం వెన్నెలబాట ఎంచుకో॥ కళ్లు తెరచి చూడు నడుస్తున్న ఆధునిక ప్రపంచాన్ని  అయ్యిందా నేత్రోదయం చక్కనిబాట ఎంచుకో॥ గురువులచెంత సరియైన విద్యాబుద్ధులు నేర్చుకో  అయ్యిందా ఙ్ఞానోదయం మేలైనబాట ఎంచుకో॥ కలలొచ్చి కవ్వించి కుతూహలపరచి మురిపించితే అయ్యిందా నిద్రోదయం వికసితబాట ఎంచుకో॥ పొద్దుపొద్దునే చెట్లు చిగురించి మొగ్గలు తొడిగితే అయ్యిందా పుష్పోదయం పరిమళబాట ఎంచుకో॥ మధుమాసం ఏతెంచగా మనసులు పొంగిపొర్లితే  అయ్యిందా వసంతోదయం మల్లెబాట ఎంచుకో॥ సాహితీసేద్యంలో సాగుచేస్తు సతమవుతుంటే అయ్యిందా అక్షరోదయం సాహిత్యబాట ఎంచుకో॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 తెలుగు గజల్ చదవటానికి చాలా సొంపైనది తెలుగుగజల్ వర్ణించటానికి సుందరమైనది తెలుగుగజల్॥ కనువిందు చేస్తూ హృదయములను గెలిచేదీ పాడటానికి గానయోగ్యమైనది తెలుగుగజల్॥ గాంధర్వ గానమై మదులను మురిపించే స్వరమై చెప్పటానికి మాధుర్యమైనది తెలుగుగజల్॥ తీపి మాటలతో రంజింపజేసే గీతమై రాయటానికి లయబద్ధమైనది తెలుగుగజల్॥ అందమైన ఊహలను చక్కగా ఒలికించేదీ భావనలందు కడు సున్నితమైనది తెలుగుగజల్॥ సుకుమార భావమై మదిని మెల్లగా తడిమేదీ శృంగారానికి ఆలవాలమైనది తెలుగుగజల్॥ ప్రేమభావనతో విజయపథం వైపు నడిపేదీ ప్రోత్సాహానికి శక్తివంతమైనది తెలుగుగజల్॥ విరహవేదనను తట్టుకోలేక వెల్లగక్కేదీ ఆలాపనలకు అనుకూలమైనది తెలుగుగజల్॥ కాఫియా రదీఫుల కమ్మనైన ప్రయోగంతో ద్విపదలతో ప్రాసయుక్తమైనది తెలుగుగజల్॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
అంటున్నా (గజల్) నగలన్ని నీకోసమని అంటున్నా     మెడలోన వేసుకోమని అంటున్నా॥   చీరలన్ని ప్రేమతోనే ఇచ్చాను    సొగసుగా కట్టుకోమని అంటున్నా॥ చేతిలోని ధనమునంతా ఇచ్చాను   భద్రంగ దాచుకోమని అంటున్నా॥   పూలదండ నీ సిగకుకే తెచ్చాను   కొప్పునా పెట్టుకోమని అంటున్నా॥   వెన్నెలంత వెలుగులను నేను దాచాను  లోకమున వెలిగిపోమని అంటున్నా॥  చిరునవ్వులను గుండెనందు  నింపాను  మనసులో మురిసిపోమని అంటున్నా॥    రంగురంగుల గాజులు కొనితెచ్చాను    చేతులకు తొడుక్కోమని అంటున్నా॥   చెక్కలతో భక్తిమార్గం చూపాను  భజనలో లీనమవమని అంటున్నా॥  హృదయం నే నీకే అర్పించాను  ప్రేమతో నింపుకోమని అంటున్నా॥  సత్యమై నిత్యమై ముందు నిలిచాను  ధైర్యంగ నడచిపోమని అంటున్నా॥   స్వేచ్ఛ అనే జతరెక్కలను తొడిగాను గాలిలో  ఎగిరిపోమని అంటున్నా॥  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 నా చెలిని (గజల్) తేనియలు చల్లమని అర్థిస్తా నా చెలిని ముద్దులను ఇవ్వమని అర్జిస్తా నా చెలిని॥ చల్లని చినుకులతో హృదిని  తడపాలని కరుణలో ముంచమని యాచిస్తా నా చెలిని॥ హృదయము తాకి పరవశింప చేయాలని ప్రేమ పారించమని ప్రార్థిస్తా నా చెలిని॥ వెలుగు దారిలో నడిపించి జీవితమంతా జ్ఞానసుధ ఒసగమని ఒప్పిస్తా నా చెలిని॥ మాటలతోనే మధురంగా మురిపించమని చెరకురసం చిందేలా మెప్పిస్తా నా చెలిని॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 చెప్పేస్తా (గజల్) మనసులోని భావాలను మాటల్లో చెప్పేస్తా శ్రావ్యమైన రాగాలను పాటల్లో చెప్పేస్తా॥ సామూహిక సమస్యలపై కలమెత్తి రాస్తుంటా, సత్యపు సందేశాలను రాతల్లో చెప్పేస్తా॥ చేయాల్సిన కార్యాలు ఆచరణలో చూపిస్తా, మానవత్వపు విలువలను చేతల్లో చెప్పేస్తా॥ ఎదురైన అనుభవాలు హృదయంలో దాచుకుంటా, జీవనమార్గ దర్శనాన్ని సద్బాటల్లో చెప్పేస్తా॥ పల్లెల పట్టణాల సమదృష్టితో వీక్షిస్తా, ప్రజల ఆశల స్పందనను పేటల్లో చెప్పేస్తా॥ గెలుపు కోసం శ్రమించుటే విజయసూత్రమంటా, పట్టుదల గొప్పతనాన్ని ఆటల్లో చెప్పేస్తా॥ 'రాజేంద్ర' గుండెచప్పుడు అక్షరాల్లో నింపుతా, కాలం నేర్పిన పాఠాన్ని పుటల్లో చెప్పేస్తా॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం. 
Image
 అల్లుతా అక్షరాలు (గజల్)  ఆలోచనలు అందించగ అల్లుతా అక్షరాలు భావాలు బయటపెట్టంగ బరుకుతా అక్షరాలు పూలతోటన చక్కని పదపుష్పాలు పూయించగ  కలముచేబట్టి కమ్మగా కార్చుతా అక్షరాలు వాక్కులరాణి భారతిదేవి కటాక్షము పొందంగ  కాగితాలపై చక్కగా పేర్చుతా అక్షరాలు పాఠకుల మనసులను దోచుకొని పరవశపరచంగ  హృదులను హత్తుకొనేలా కూర్చుతా అక్షరాలు సమావేశాల్లో గళమెత్తి గేయాలు పాడంగ  సాహిత్యాన నిలిచేలా చెక్కుతా అక్షరాలు కర్షకునిలా కష్టపడి సేద్యమును కొనసాగించ కవితాసిరులు పండేలా చల్లుతా అక్షరాలు కొమ్మలో కొమ్మనై పువ్వులో పువ్వునై చుట్టూ సౌరభాలను వీచేలా చిమ్ముతా అక్షరాలు రవికాంచని తావులకు చేరి వీక్షించి వర్ణించ వెలుగులను వెదజల్లేలా విసురుతా అక్షరాలు  భారతీయ భాషలందు బంగారు ఆభరణంలా తెలుగుతల్లి మురిసేలా అమర్చుతా అక్షరాలు  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం. 
Image
 పెళ్ళాం (గజల్) చక్కని తోడై చల్లని నీడై పక్కన నిలిచేది పెళ్ళాం ఎండైనా వానైనా ఎప్పుడూ వీడకుండేది పెళ్ళాం॥ అలసిన వేళల్లో అమృతమాటల జల్లులు కురిపించి, ఆప్యాయ మమతలతో మనసును మురిపించేది పెళ్ళాం॥ కష్టపు కెరటాలు ఎదురొచ్చిన ప్రతివేళలో, ధైర్యపు దివ్వెయై దారిని చూపించేది పెళ్ళాం॥ ఇంటి గడపను స్వర్గసీమగా మలచి అనునిత్యం, నవ్వుల పూలతో నందనవనముగా మార్చేది పెళ్ళాం॥ తన సుఖమంతా త్యాగమనే కొవ్వొత్తిలా కరిగించి, కుటుంబ సంక్షేమానికి దీపమై వెలిగేది పెళ్ళాం॥ బాధల బరువును భుజాలపై మౌనంగా మోస్తూనే, బలమై ప్రతి అడుగున భర్తను నడిపించేది పెళ్ళాం॥ కన్నీటి చుక్కను కంటిలో కారనీయకుండానే, చిరునవ్వులు పూయించి గుండెలను గెలిచేది పెళ్ళాం॥ ముందుచూపుతో పిల్లల భవితకు పునాదులను వేసి, మంచి సంస్కారాల మకుటమై నిలిచేది పెళ్ళాం॥ సిరులకన్న మిన్నైన స్నేహమనే శుభసంపదగా, జీవిత యాత్రలో దైవవరమై దొరికేది పెళ్ళాం॥ సగమని దేవుడు సృష్టించిన సత్యరూపమై, సుఖదుఃఖాలలో సమభాగమై నిలిచేది పెళ్ళాం॥ తాళికట్టిన తనరాజు ప్రేమను హృదయంలో దాచుకొని, జన్మజన్మల బంధమై చివరివరకు నిలిచేది పెళ్ళాం॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 చెంతకురా (గజల్) ఎర్రచీర ఎంచుకున్న ఎగ్గులాడి చెంతకురా, తెల్లచీర తెచ్చుకున్న మాయలాడి చెంతకురా॥ మందహాస మల్లెలల్లే మురిపాల చిన్నదానా, బులుగుచీర పట్టుకొనీ వగలాడి చెంతకురా॥ కాటుకంటి చూపులతో కవ్వించే కలువబాలా, నల్లచీర కట్టుకొనీ నగులాడి చెంతకురా॥ చిన్ననడక చిందులతో చిలిపిగా నడిచే దానా, కొత్తచీర చుట్టుకొనీ కులుకులాడి చెంతకురా॥ చందమామ వెన్నెలంత చల్లనైన చెలియవై, పట్టుచీర పైటేసుకొనీ సోకులాడి చెంతకురా॥ పచ్చని పైరులాంటి పరువాల పడుచుదానా, పచ్చచీర ధరియించీ మిటుకులాడి చెంతకురా॥ పసిమి బంగారు వన్నెలల్లే కాంతులు చల్లేదానా, పసుపుచీర ముసుగేసీ టెక్కులాడి చెంతకురా॥ ఇంద్రధనుస్సు రంగులన్ని ఒలికించే అందగత్తె, రంగులచీర వేసుకొనీ వన్నెలాడి చెంతకురా॥ ఊరునిండా ఒయ్యారాలు ఊపిరిగా నింపేదానా, నేతచీర కప్పుకొనీ ఎమ్మేలాడి చెంతకురా॥ మల్లెపూల పరిమళాలు మనసునంత నింపుటకై, మెల్లమెల్ల అడుగులేస్తూ బొంకులాడి చెంతకురా॥ రాజు గుండె రాగమంతా నీకోసమే పలుకుతుంటే, ముద్దూముచ్చట తీర్చుటకై మాటలాడి చెంతకురా॥ — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం