
నా కవిత కవిత కలలోకొస్తుంది కవ్వించి కవనంచేయమంటుంది కలమును కరానికిస్తుంది కవితను కమ్మగావ్రాయమంటుంది అందాలను చూడమంటుంది అద్భుతంగా వర్ణించమంటుంది ఆనందం పొందమంటుంది అందరికి పంచమంటుంది చందమామను చూడమంటుంది వెన్నెలలో విహరించమంటుంది కొండాకోనలను కాంచమంటుంది సెలయేటిప్రక్కన సేదతీరమంటుంది నదీతీరాల నడయాడమంటుంది కడలివొడ్డుకెళ్ళి కెరటాలవోలెకదలమంటుంది పుడమిని పచ్చదనంతోకప్పమంటుంది ప్రకృతిని ప్రేమించికాపాడమంటుంది సూర్యోదయ సమయానలేవమంటుంది సుప్రభాతాన సుకవితలనల్లమంటుంది పూలపొంకాలను పరికించమంటుంది సుమసౌరభాలను చదువరులకుచేర్చమంటుంది అక్షరాలను అల్లమంటుంది అంతరంగాలలో ఆవాసముండమంటుంది పదాలను పారించమంటుంది పాఠకులను పరవశపరచమంటుంది నా కవిత నా భవిత నా కవనం నా ప్రాణం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం నా కవితను అందుకున్నారా! నా మనసును తెలుసుకున్నారా! నా కవనం రుచించిందా! నా కవిత్వం పండిందా! నా విత్తనాలు మొలిచాయా! నా మొక్కలపూలు సౌరభాలువెదజల్లాయా!