కవితంటే… ఎందుకు ఆరాటం!


కవితంటే ఎందుకు చెవికోసుకుంటావ్? —

అక్షరాల ఆలాపనలో ఆత్మస్వరాలు వినిపిస్తాయా,

నిశ్శబ్దంలో నిగూఢమైన నిజాలు

నవ్వుతూ నీ చెవిని తాకుతాయా.


కవితంటే ఎందుకు అంత కష్టపడతావ్? —

పదాల పుట్టలో భావాల బంగారం దొరుకుతుందా,

ఒక్క పంక్తి పుడితే

వేల హృదయాలు పులకరించుతాయా.


కవితంటే ఎందుకు వెంపర్లాడుతావ్? —

మనసు మబ్బుల మధ్య మెరుపులా మెరవాలా,

లోపలి తుఫాన్లను

లయగా మార్చాలని తపనా?


కవితంటే ఎందుకు ఖర్చులు పెడతావ్? —

అది వ్యయం కాదు, యజ్ఞం అంటావా,

అక్షరాలకు అంకితమైతే

అమరత్వమే లభ్యమవుతుందా.


కవితంటే ఎందుకు గళమెత్తుతావ్? —

నిశ్శబ్దం చెప్పలేని బాధలు

నాదమై పలకాలా,

న్యాయం నడవాలని నినదిస్తావా.


కవితంటే ఎందుకు పరుగెత్తుతావ్? —

కాలం కంటే ముందే

కలల్ని చేరుకోవాలా,

ప్రతి క్షణాన్ని పదాల్లో బంధించాలనే ఆత్రుతా?


కవితంటే —

శ్వాసల మధ్య సాగే సంగీతం,

హృదయానికి హృదయం కలిపే సేతువు,

మనిషిని మనిషిగా నిలబెట్టే మహోన్నత సాధన!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


🌸🌸ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు 🌸🌸


Comments

Popular posts from this blog