నవరసాల నవచైతన్యం


వెన్నెల వీణలు మీటగా

విరహమే వసంతమౌతుంది,

చూపుల చినుకులు జారగా

శృంగారం జయగీతమౌతుంది॥


చిరునవ్వు చిందినంతనే

చీకటి చెదిరిపోతుంది,

ముచ్చట్ల మధురిమలో

హాస్యం హరివిల్లౌతుంది॥


కన్నీటి తడి పలుకుల్లో

కరుణ కల్పవల్లౌతుంది,

పరబాధ పంచిన హృదయం

మానవత్వ దీపమౌతుంది॥


అన్యాయ చీకట్ల మధ్య

అగ్నిశిఖలా కోపం లేస్తుంది,

ధర్మరక్షణ దిక్సూచిగా

రౌద్రం రణభేరియౌతుంది॥


పర్వతమై కష్టం వచ్చినా

పడిపోని ధైర్యమే వీరత్వమౌతుంది,

పరాజయ బూడిదలోనూ

పరాక్రమ జ్యోతి వెలుగౌతుంది॥


చీకటి గాలి చప్పుడు కూడా

చిత్తాన్ని కంపింపజేస్తుంది,

జాగ్రత్త నేర్పే గురువై

భయానకం దీపమౌతుంది॥


కపటపు కలుషం చూసి

మనసు కలవరపడుతుంది,

మలినాలను దహింపజేసే

బీభత్సం బోధనౌతుంది॥


అణువులో విశ్వం చూసే

ఆశ్చర్యమే అద్భుతమౌతుంది,

పసినవ్వు పరిమళంలో

ఆనందదీపం వెలుగౌతుంది॥


అలజడి అలలు ఆగగా

ఆత్మసరోవరం నిర్మలమౌతుంది,

నిశ్శబ్ద నాదాల మధ్య

శాంతం శశిధారౌతుంది॥


నవరసాల నవనీతంతో

నరజీవితం నాట్యమాడుతుంది,

సుఖదుఃఖ రాగాల నడుమ

నవోన్మేషం జీవనకావ్యమౌతుంది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog