తెరచి చూడు
తలుపు తెరచి చూడు — తరలి వచ్చిన అతిథిని,
తులసి పరిమళంలా ఆహ్వానించు,
మనసారా పలకరించు,
మాటలతో మమతల హారతి ఇవ్వు॥
కళ్ళు తెరచి చూడు — ప్రకృతి సోయగాల్ని దర్శించు,
పొద్దుతిరుగుడు నవ్వును చూడు,
చుక్కల చీర కట్టిన ఆకాశాన్ని ఆస్వాదించు,
ప్రపంచపు అందాలలో పరవశించు॥
జేబు తెరచి చూడు — దరిద్రుని కన్నీటి తుడువు,
ఆకలికి అన్నమై మారు,
చేతి దానం అందించు,
జీవితం జయగానం పాడుతుందని చాటు॥
పుస్తకం తెరచి చూడు — కవి హృదయం తెలుసుకొను,
అక్షరాల ఆవేదన ఆలకించు,
పదాల పరిమళంలో తేలు,
భావాల భువిలో విహరించు॥
హృదయం తెరచి చూడు — ప్రేమానురాగాలు పంచు,
క్షమను కౌగిలించుకొను,
మనుషుల మధ్య మమతల వంతెన కట్టు,
స్నేహ సుధలను జలజలా కురిపించు॥
కలం తెరచి చూడు - అక్షర చినుకులు రాల్పించు,
పద పంక్తులు పారించు,
భావాలు బయటపెట్టు;
పాఠకుల హృదయాలు దోచుకొను॥
తెరవడం నేర్చుకున్న జీవితం —
తేజోమయమై వెలుగుతుందని గ్రహించు,
మూసుకుపోయిన మనసుకన్నా
తెరచిన హృదయమే జగతికి నిజమైన స్వర్గద్వారమని చాటి చెప్పు॥
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment