నేను సైతం…


నేను సైతం…

ప్రపంచపు పగుళ్ల గోడలపై

శాంతి పావురాల్ని చిత్రిస్తాను!

రక్తపు చారల మధ్య

రాగాల వర్షం కురిపిస్తాను॥


నేను సైతం…

యుద్ధ యంత్రాల కర్కశ కేకల్లో

మనిషి హృదయ స్వరాన్ని వినిపిస్తాను,

బాంబుల పొగల వెనుక

బాలల నవ్వుల దీపం వెలిగిస్తాను॥


నేను సైతం…

ప్రపంచాభివృద్ధి అనే మహాయజ్ఞంలో

ఒక చెమట చుక్కగా జారిపోతాను,

కూలీల చేతుల్లో శక్తిగా మారుతాను

పేదల పళ్లెంలో అన్నమై పడతాను॥


నేను సైతం…

ప్రపంచక్షేమం కోసం

ప్రతి గుండె గుమ్మాlni తట్టుతాను,

కన్నీటి కడలిలో మునిగినవారికి

కరుణా పడvanai చేరుతాను॥


నేను సైతం…

ప్రపంచప్రేమ అనే జెండాను

అన్ని దిక్కుల్లో ఎగరవేస్తాను,

జాతి–మత–భాషల గోడల్ని

జ్వాలల్లా కరిగిస్తాను॥


నేను సైతం…

సాహిత్య సముద్రపు అలలపై

అక్షర నౌకగా ప్రయాణిస్తాను,

ప్రపంచసాహితీ పుటల మీద

ప్రజల పలుకులై నిలిచిపోతాను॥


నేను సైతం…

ప్రపంచవీధుల్లో పయనిస్తూ

మనిషి మనిషికీ మధ్య 

మమతా వంతెనలు వేస్తాను,

మట్టిలో మగ్గిన ఆశలకు

మళ్లీ రెక్కలు తొడుగుతాను॥


నేను సైతం…

కాలం కదిలే రథచక్రానికి

ఒక చిన్న ఊపిరినైనా అందిస్తాను,

మానవతా మహాగీతంలో

ఒక గర్జనగా మారిపోతాను॥


ఎందుకంటే—

నేను ఒక్కడిని కాదు!

నా వెనుక కోట్ల గుండెలున్నాయి,

నా గొంతులో యుగాల నినాదముంది,

నా అడుగుల్లో భవిష్యత్తు ప్రతిధ్వనిస్తోంది॥


అందుకే—

నేను సైతం…

ఈ విశ్వమానవ యాత్రలో

ఒక విప్లవ జ్యోతినై వెలుగుతాను॥


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog