నన్ను…


నన్ను…

పూలు ప్రలోభపెట్టాయి —

పొదరిల్ల పొదువుల్లో పల్లకీ ఎక్కించి

పున్నమి వెలుగుల వీధుల్లో ఊరేగించాయి॥


నన్ను…

పరిమళాలు పసందుకొలిపాయి —

పారిజాతపు పూవుల్లా పలకరించి

పలుకులలో పంచదార తీపులు కలిపాయి॥


నన్ను…

పడతులు ప్రేమలోకిదించారు —

పలుకుల్లో పల్లవులై పలకరించి

పసిడి నవ్వులతో ప్రణయ గీతాలు పాడించారు॥


నన్ను…

పొంకాలు ప్రమోదపరచాయి —

పొలిమేర గాలిలా విస్తరించి

పొయ్యిమీద పాలులా పొంగిపొర్లాయి॥


నన్ను…

ప్రభాకరుడు పొద్దుపొద్దునేలేపాడు —

ప్రభాత కిరణాల పాన్పులో పడుకోబెట్టి

ప్రపంచమంతా ప్రకాశించమని ప్రేరేపించాడు॥


నన్ను…

పున్నమి జాబిలి పురికొలిపింది —

పాలవెల్లి వెలుగులతో పాదాలపై పడిపోయి

పుడమిపై పయనానికి పూలబాటలు పరిపించింది॥


నన్ను…

ప్రకృతి పరవశపరచింది —

పచ్చని పైరుల పలకరింపుల్లో

పక్షుల గానాలతో పరిమళ గీతాలు వినిపించింది॥


నన్ను…

పగటికలలు పెన్నును పట్టించాయి —

పుటలపై పరవళ్ళు తొక్కే పదాలై

పరవశ హృదయాల్లో ప్రవాహాలయ్యాయి॥


నన్ను…

పదాలు పరుగులు తీయించాయి —

పెళ్లి పందిరిలా పూలవాన కురిపించి

ప్రతి అక్షరాన్నీ ప్రాణంగా మార్చించాయి॥


నన్ను…

కవిత్వమే కట్టిపడేసింది —

పలుకుల పల్లకీలో పరమానందం పంచి

పుడమి గుండెలో పరిమళించే పుష్పంగా నిలిపింది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog