కవితా కల్యాణి


కవిత ఒక వధువు —

కలల కంచుకం కట్టుకుని

మనసు మంటపంలోకి మెల్లగా అడుగుపెడుతుంది,

భావాల తాళిబొట్టుతో హృదయాన్నే వరుడిగా చేసుకుంటుంది॥


కవిత ఒక మధువు —

మాటల మంజీరంలో జారే మకరందమై,

చదివిన ప్రతి హృదయంలో

చిరునవ్వుల చిలకరింపులు చిమ్ముతుంది॥


కవిత ఒక కూర్పు —

అక్షరాలన్నీ అల్లుకొని

అందమైన పూలదండగా మారుతుంది,

భావాల సోయగాలతో భాషకు వన్నెలద్దుతుంది॥


కవిత ఒక నేర్పు —

మనసును మనిషిగా తీర్చిదిద్దే గురువు,

మౌనానికి మాట నేర్పి

మమతలకు మార్గం చూపుతుంది॥


కవిత ఒక ఆట —

ఊహల ఊయలలో ఊగించే ఉల్లాసం,

పదాలతో పరవశించి

పాఠక హృదయాన్ని పసితనంలోకి తీసుకెళ్తుంది॥


కవిత ఒక పాట —

రాగాల రెక్కలపై విహరించే కోయిలగానం,

విన్నవారి హృదయవీణపై

మధుర స్వరాలను పలికిస్తుంది॥


కవిత ఒక హారం —

అక్షర పుష్పాలతో అల్లిన అపూర్వ సరం,

కవి హృదయాన్ని అలంకరించి

కాలానికీ పరిమళం పంచుతుంది॥


కవిత ఒక ఆభరణం —

భాషామాత నుదుటిన మెరిసే తిలకం,

తెలుగు తల్లికి తేజస్సై

తరతరాలకు వెలుగై నిలుస్తుంది॥


కవిత ఒక ప్రయాణం —

కన్నీటి తీరం నుంచి ఆనంద తీరాల దాకా,

జీవితపు దారుల్లో

జ్ఞాపకాల జ్యోతులు వెలిగిస్తుంది॥


కవిత ఒక ప్రవాహం —

గుండెల గర్భం నుంచి ఉబికి వచ్చే గంగలా,

ఎడారైన మనసుల్లోనూ

పచ్చదనాన్ని పరచుతుంది॥


కవిత ఒక అందం —

ప్రకృతి నవ్వులో మెరిసే వెన్నెలవెలుగు,

చూసిన ప్రతి చూపుకీ

చిరమధురానుభూతులను అందిస్తుంది॥


కవిత ఒక ఆనందం —

ఆత్మను ఆవహించే అమృత తరంగం,

రాసినవారికి పరవశం,

చదివినవారికి శాశ్వతానందం కలిగిస్తుంది॥


కవిత నన్ను వదలదు —

కవితను నేను వదలను,

పాఠకహృదయాల్లో నిలుస్తా,

అక్షరయాత్రను కొనసాగిస్తా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog