పిల్లలు - భావి భారత భాగ్యవిధాతలు


పిల్లలు… పరమాత్ముని ప్రసాదాలు —

పుడమికొచ్చిన పూర్వజన్మ పుణ్యఫలాలు,

ఇంటింటి ఇంద్రధనుస్సులు,

ఇలవేల్పుల ఆనందతరంగాలు॥


పిల్లలు… పూలతోటలో పూసిన పుష్పాలు —

పరిమళాల పూదండలు,

పసితనపు పవిత్ర గీతాలు,

ప్రేమకు ప్రతిరూపాలు॥


పిల్లలు… ఉదయించే సూర్యకిరణాలు —

ఉజ్వల భవిష్యత్తు బాటసారులు,

ఉత్సాహాల ఊటలు,

ఉన్నతశిఖరాల అధిరోహకులు॥


ప్రతినిత్యమూ గమనించు —

వారి అడుగుల్లో ఆశలు ఉంటాయి,

వారి ప్రశ్నల్లో విజ్ఞానం దాగి ఉంటుంది,

వారి కలల్లో విశ్వమే విరాజిల్లుతుంది॥


ప్రేమతో పెంచు — ప్రాణంపెట్టి పరిరక్షించు,

పొరపాట్లను సహనంతో సరిదిద్దు,

పొగడ్తలతో ప్రోత్సహించు,

పుణ్యమార్గంలో నడిపించు॥


ప్రీతితో పోషించు — పోషకాహారమే కాదు,

పొంగిపొర్లే మమకారాన్ని అందించు,

పొదువైన సంస్కారాలను నేర్పించు,

పొలిమేరలు దాటే వ్యక్తిత్వాన్ని నిర్మించు॥


పెద్దచదువులు చదివించు — పరిపూర్ణ జ్ఞానమందించు,

పుస్తకాల వెలుగులు పంచు,

పరిశోధనల పథంలో నడిపించు,

ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృష్టినివ్వు॥


ప్రయోజకులను చెయ్యి — పదవులకోసం కాదు,

పరులకు ఉపయోగపడే మనుషులుగా తీర్చు,

పరోపకారమే పరమధర్మమని నేర్పు,

పాటుపడే పౌరుషాన్ని అలవర్చు॥


ప్రశస్త పౌరులుగా తీర్చిదిద్దు — దేశభక్తి కలిగించు,

ధర్మబద్ధత దారులు చూపించు,

నిజాయితీ నిధులను నాటించు,

నైతికతను నిత్యసహచరిగా చేయించు॥


పిల్లలు… కుటుంబానికి కీర్తికిరీటాలు,

సమాజానికి సజీవ సంపదలు,

దేశానికి దివ్య ధనరాశులు,

భవిష్యత్తుకు బంగారు బాటలు॥


అందుకే… పిల్లలను ప్రేమించు,

పిల్లలను ప్రోత్సహించు,

పిల్లలను పరిరక్షించు,

పిల్లలను పరిపూర్ణ వ్యక్తులుగా మలచు॥


పిల్లలే రేపటి భారతనిర్మాతలు —

పిల్లలే భావి భారత భాగ్యవిధాతలు,

పిల్లలే వికాసపు విజయధ్వజాలు,

పిల్లలే మన ఆశయాల సాకార రూపాలు॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog