పాడరా… పాడరా… (గానవిహారం) 


పాడరా… పాడరా… పిల్లలపాట పాడరా,

పలుకుల పరిమళాలు చిమ్మరా,

నవ్వుల చినుకులు చల్లరా,

నెమలి నాట్యాలు చేయించరా॥

|| పాడరా… ||


పాడరా… పువ్వులపాట పాడరా,

పొంగుల సందడి పంచరా,

రంగుల రాగాల రేపరా,

రమణీయ లోకాలు చూపరా॥

|| పాడరా… ||


పాడరా… పల్లెలపాట పాడరా,

పంటపొలాల పలుకులు జార్చరా,

గాలి గుసగుసల్లో గీతం కలపరా,

గడ్డి గులకరాళ్ళ గానం వినిపించరా॥

|| పాడరా… ||


పాడరా… ప్రేమపాట పాడరా,

హృదయ తంతుల్ని తాకరా,

నిశ్శబ్ద రాగాల నడుమ సాగరా,

నిత్యానురాగం నింపరా॥

|| పాడరా… ||


పాడరా… పెళ్లాంపాట పాడరా,

పెదవులపై నవ్వులు పూయించరా,

ఇంటి దీపంగా వెలిగించరా,

ఇష్టాల హారంగా చుట్టరా॥

|| పాడరా… ||


పాడరా… పడుచులపాట పాడరా,

పగటి కలలను పలికించరా,

యువ హృదయాల ఊయల ఊగించరా,

యుగయుగాల్ని ఉత్తేజపరచరా॥

|| పాడరా… ||


పాడరా… ప్రకృతిపాట పాడరా,

పొంకాల ప్రొద్దు పొడిపించరా,

భావాల బాటలో పయనించరా,

భువినంతా ఆనందింపజేయరా॥

|| పాడరా… పాడరా… ||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments