కవితా వైభవం


కవితలకు...శీర్షిక తలమానికం —

చదివే మనసుకు తొలి చిరునవ్వు,

కవితామందిరానికి సుందర ద్వారం,

పాఠకుని ఆకర్షించే పుష్పమాలికలో తొలిపుష్పం॥


కవితలకు...అంశం ప్రధానం —

భావాలకు బలమైన పునాది,

ఆలోచనలకు ఆకాశవీధి,

అర్థవంతమైన సందేశాలకు అక్షరాధారం॥


కవితలకు...శైలి ప్రాణం —

పదాలకు పరిమళం పూయించేది,

భావాలకు భంగిమలు అద్దేది,

తేనెజల్లులు కురిపించే కవికంఠ మాధుర్యం॥


కవితలకు...ఆరంభం ఆకర్షణీయం —

ఉదయభానుని తొలి కిరణంలా,

వీణానాదపు తొలి స్వరంలా,

పాఠకుని మనసును కట్టిపడేసే అమృతపలుకుల ఆహ్వానం॥


కవితలకు...ముగింపు మననీయం —

మనసులో ముద్ర వేసేది,

ఆలోచనల్లో అలలు రేపేది,

చదివిన తరువాత కూడా చిరకాలం వెంటాడే జ్ఞాపకం॥


కవితలకు...పోలికలు అలంకారం —

పూలకు పరిమళాలైనట్లు,

చంద్రునికి వెన్నెలైనట్లు,

భావాలకు సొబగులు చేకూర్చే సాహిత్య సుందరాభరణం॥


కవితలకు...మదులముట్టటం ప్రశస్తం —

హృదయతంత్రులను మీటి, అంతరంగాలను తట్టి,

ఆనందాశ్రువులను కార్పించి 

ఆత్మను ఆలోచనల్లో ముంచటం॥


కవితలు... కళ్ళకు చూపాలి అందం,

కర్ణాలకు పంచాలి పరమానందం,

పెదాలకు పూయాలి మకరందం,

మదులకు అందించాలి అరవిందం॥

 

అందుకే...కవిత అంటే కాదు అక్షరాల ప్రవాహం,

అది హృదయస్పందనల కర్పూరహారతి సుగంధం, 

కవిత అంటే కాదు పదాల సమూహం,

అది భావసౌరభాల విరిసిన ఉద్యానవనం॥


శీర్షికతో శోభిల్లి, అంశంతో అర్థవంతమై,

శైలితో జీవం పొంది, కవిశ్రమతో సుందరరూపమై,

భావాలతో హృదయాలను తాకినప్పుడే —

కవితకు కలుగుతుంది కాలాతీతమైన వైభవం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 




Comments

Popular posts from this blog